బీహార్ అసెంబ్లీ ఎన్నికలు... ఎగ్జిట్ పోల్స్ ఏం చెబుతున్నాయంటే?
Publish Date:Nov 11, 2025
Advertisement
బీహార్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ పూర్తయ్యింది. మంగళవారం (నవంబర్ 11) రెండో విడత పోలింగ్ ముగిసింది. దీంతో ఎగ్జిట్ పోల్స్ వెలువడ్డాయి. వివిధ సంస్థలు వెలువరించిన ఎగ్జిట్ పోల్స్ లో బీహార్ లో తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేయబోయేది ఎన్డీయే కూటమే అని పేర్కొన్నాయి. అయితే ఒక సంస్థ మాత్రం రాష్ట్రంలో అధికార పగ్గాలు చేపట్టనున్నది మహాగట్ బంధనే అని పేర్కొంది. మాసివ్ మెజారిటీతో కాకపోయినా అధికారం చేపట్డేందుకు అవసరమైన మెజారిటీ స్థానాలను కాంగ్రెస్ నేతృత్వంలోని మహాగట్ బంధన్ గెలుచుకుంటుందని అంచనా వేసింది.. ఇలా ఉండగా యాక్సిస్ మై ఇండియా, సీవోటర్, ఐపిఎస్ఓఎస్, జన్ కిబాత్, టుడేస్ చాణక్య సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ను వివిధ చానళ్లు, వెబ్ సైట్లు, సోషల్ మీడియా ద్వారా వెలువరించాయి. పీపుల్స్ పల్స్ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం బీహార్ లో మరో సారి ఎన్డీయే అధికారం చేపడుతుంది. రాష్ట్రంలోని 243 స్థానాలకు గానూ ఎన్డీయే కూటమి 133 నుంచి 159 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. మహాఘట్ బంధన్ కూటమి 75 నుంచి 101 స్థానాలకు పరిమితమౌతుంది. ఇతరులకు 2 నుంచి 13 స్థానాలు దక్కు అవకాశం ఉంది. ఇక చాణక్య సర్వే మేరకు ఎన్డీయే కూటమి 140 నుంచి 147 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని కూటమి 86 నుంచి 92 స్థానాలలో గెలుపొందే అవకాశం ఉంది. ఇతరులు 2 నుంచి 4 స్థానాలలో విజయం సాధిస్తారు. ఇక బీకాన్ సర్వే ప్రకారం ఎన్డీయే కూటమి 139 నుంచి 144 స్థానాలలోనూ, మహాఘట్ బంధన్ 95 నుంచి 101 స్థానాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది. ఇతరులకు 7 నుంచి 10 స్థానాలు లభించే అవకాశం ఉంది. అయితే సత్తాబజార్ వెలువరించిన సర్వే ప్రకారం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ 125 నుంచి 130 స్థానాలలో విజయం సాధించి అధికారం చేపడుతుంది. బీజేపీ నాయకత్వంలోని ఎన్డీయే కూటమి 93 నుంచి 99 స్థానాలకే పరిమితమౌతుంది. ఇతరులు ఒక్క స్థానంలో కూడా గెలిచే అవకాశం లేదు. మొత్తం మీద ఎగ్జిట్ పోల్స్ వెలువరించిన సంస్థలలో అత్యధిక సంస్థలు ఎన్డీయే కూటమే రాష్ట్రంలో మరోసారి అధికార పగ్గాలు చేపడుతుందని అంచనా వేయగా, ఒక్క సంస్థ మాత్రం కాంగ్రెస్ నేతృత్వంలోని మహాఘట్ బంధన్ బీహార్ లో అధికారంలోకి వస్తుందని పేర్కొంది.
ఇక పోలింగ్ శాతం చూస్తే గతంలో ఎన్నడూ లేని విధంగా బీహార్ ఓటర్లు ఈ సారి తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద సంఖ్యలో వెల్లువెత్తారు. రెండో దశలో సాయంత్రం ఐదు గంటల వరకూ 67.14శాతం ఓటింగ్ నమోదైంది. తొలి విడతలో 64.46 శాతం ఓటింగ్ నమోదైంది. రెండు విడతలూ కలిపి బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో మొత్తం 66.11శాతం పోలింగ్ నమోదైంది. బీహార్ రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన అత్యధిక పోలింగ్ ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలో రికార్డు స్థాయి పోలింగ్ ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి సంకేతంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. రాష్ట్రంలో అధికారం ఏర్పాటు చేయడానికి ఏ కూటమికైనా కావలసిన మ్యాజిక్ ఫిగర్ 122.
http://www.teluguone.com/news/content/exir-polls-out-39-209361.html





