శాంతి పట్టుచీర కథ.. వెలుగులోకి అక్రమాల పుట్ట!
Publish Date:Jul 20, 2024
Advertisement
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి, దేవాదాయ శాఖ ఉద్యోగి శాంతి వ్యవహారం. వీరి వ్యవహారంలో లోతుగా వెళ్లిన కొద్దీ దిగ్భ్రాంతికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తన భార్య శాంతి జన్మనిచ్చిన కుమారుడికి తండ్రి ఎవరనే విషయం తేల్చాలని భర్త మదన్ మోహన్ ఓ వైపు కోరుతుంటే.. మరోవైపు దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో శాంతి అవినీతి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఆమె ఆస్తుల చిట్టా కూడా చాలా చాలా పెద్దగానే ఉంది. హైదరాబాద్, మంగళగిరి, తాడేపల్లిలో కోట్లాది రూపాయల విలువైన విల్లాలు ఉన్నట్లు తెలుస్తోంది. విశాఖ పట్టణంలో పదెకరాల మామిడి తోట కూడా ఉందని అంటున్నారు. అంతేకాదు.. దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో ఆమె ఏదైనా దేవాలయానికి వెళితే కచ్చితంగా పట్టు చీరతో పాటు రూ. 50వేలు సమర్పించాల్సిందేనన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. శాంతి పోస్టింగ్ విషయంలోనూ కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. ఆమె ఏపీపీఎస్సీ పరీక్షలో పాస్ కాకుండానే కొంత మంది మద్దతుతో జాబ్ లోకి వచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మధ్య సంబంధంపై గత వారంరోజులుగా విస్తృత చర్చ జరుగుతోంది. ఈ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సిన విజయసాయిరెడ్డి.. మీడియా సమావేశం ఏర్పాటు చేసి కథనాలు ప్రసారం చేసిన మీడియాపై బూతులతో విరుచుకుపడ్డారు. కానీ, శాంతి, తనకు మధ్య సంబంధం ఏమిటనే విషయంపై ఎక్కడా క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు శాంతి మీడియా సమావేశం ఏర్పాటు చేసి నేను జన్మనిచ్చిన మగబిడ్డకు తండ్రి నా భర్త మదన్ మోహన్ కాదు.. అడ్వకేట్ సుభాష్ రెడ్డి అని కుండబద్దలు కొట్టినట్లు చేప్పేశారు. సుభాష్ రెడ్డి ఇప్పటి వరకు మీడియా ముందుకు రాకపోయినా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో శాంతి జన్మనిచ్చిన మగ బిడ్డకు తనకూ ఎలాంటి సంబంధం లేదని చెప్పడం గమనార్హం. ఈ వ్యవహారంపై శాంతి భర్త మదన్ మోహన్ రెడ్డి గత వారం రోజులుగా తన ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. నా భార్య శాంతి జన్మనిచ్చిన మగ బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డేనని ఆరోపిస్తున్నారు. భవిష్యత్తులో తనకు, శాంతికి పుట్టిన ఇద్దరు ఆడ పిల్లలకు అన్యాయం జరిగే అవకాశం ఉందని, ప్రస్తుతం శాంతి జన్మనిచ్చిన మగ బిడ్డకు ఎదిగే కొద్దీ ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని.. ఇప్పుడే ఈ విషయంపై తేల్చాలని మదన్ మోహన్ డిమాండ్ చేస్తున్నారు. విజయసాయి రెడ్డికి, సుభాష్ రెడ్డికి డీఎన్ఏ పరీక్ష నిర్వహించాలని కోరుతున్నారు. ఇదే విషయంపై రాష్ట్ర హోమంత్రి అనితను కలిశారు. కోర్టుకు సైతం వెళ్లేందుకు మదన్ మోహన్ రెడ్డి సిద్ధమయ్యారు. ఈ వ్యవహారం సాగుతున్న సమయంలోనే దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ గా తన హోదాను అడ్డుపెట్టుకొని శాంతి చేసిన అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. శాంతి ఏపీపీఎస్సీ నుంచి డైరెక్ట్ అసిస్టెంట్ కమిషనర్ గా జాయిన్ అయ్యారు. అయితే, ఆమెకు అర్హత లేకపోయినా విశాఖ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ పోస్టింగ్ ఇచ్చినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇందులో రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రమేయం ఉందని, ఆమె ద్వారా విశాఖలోని దేవాదాయ శాఖ భూములను పెద్ద మొత్తంలో కొట్టేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. స్థానికంగా కొందరు వ్యక్తులు దేవాదాయ శాఖ పరిధిలోని భూముల వివరాల కోసం సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసినా వివరాలు ఇచ్చేందుకు గతంలో శాంతి తిరస్కరించారని, వివరాలు ఇవ్వాలని ఉన్నతాధికారులు సూచనలు చేసినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. తాడేపల్లిలోని మాజీ సీఎం జగన్ నివాసానికి కొద్దిదూరంలో శాంతి ఓ విల్లా నిర్మాణం చేస్తున్నారు. ఆ విల్లా నిర్మాణానికి దాదాపు 40 నుంచి 50 మంది కూలీలు పనిచేస్తున్నారు. వారందరికి రోజూ భోజనాలు విజయవాడ సీతారామయ్య సత్రంతో పాటు మరొక సత్రం నుంచి సప్లయ్ చేస్తున్నారని సమాచారం. విల్లా వద్ద పర్యవేక్షణకు కొందరు దేవాదాయ శాఖ సిబ్బందిని వినియోగించినట్లు ఆరోపణలు ఉన్నాయి. శాంతి సహకారంతో విజయసాయిరెడ్డి, మరి కొందరు వైసీపీ నేతలు పెద్దమొత్తంలో దేవాదాయ భూములను కబ్జా చేసినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే శాంతికి ఓ విల్లాను విజయసాయిరెడ్డి కొనిచ్చారనేది ఏపీ రాజకీయాల్లో విస్తృతంగా ప్రచారంలో ఉంది. మొత్తానికి విజయసాయిరెడ్డి, శాంతి వ్యవహారం ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. శాంతికి జన్మనిచ్చిన బిడ్డకు తండ్రి విజయసాయిరెడ్డా.. సుభాష్ రెడ్డా అనే విషయం తేలాల్సి ఉండగా.. మరోవైపు దేవాదాయ అసిస్టెంట్ కమిషనర్ హోదాలో శాంతి అక్రమాలపై ప్రభుత్వం దృష్టిసారించాల్సి ఉంది. ఇప్పటికే శాంతి అక్రమాలపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రాంనారాయణ రెడ్డి దృష్టి కేంద్రీకరించినట్లు తెలుస్తోంది. అధికారుల నుంచి పూర్తి వివరాలు సేకరించిన ఆయన.. త్వరలోనే ప్రభుత్వానికి నివేదిక అందించే అవకాశాలు ఉన్నాయి. మొత్తానికి శాంతి జన్మనిచ్చిన బిడ్డ ఎవరో తేల్చాలని ఆమె భర్త డిమాండ్ చేస్తున్న క్రమంలో.. శాంతి అక్రమాలుసైతం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో ప్రజలు విస్తుపోతున్నారు.
http://www.teluguone.com/news/content/endoments-assistant-commissioner-shanthi-irregularities-25-181155.html





