రాహుల్ ఈడీ విచారణ కంటిన్యూస్..!
Publish Date:Jun 20, 2022
Advertisement
రాహుల్ గాంధీని ఈడీ సోమవారం కూడా విచారించనుంది. ఇంతకు ముందు వరుసగా మూడు రోజుల పాటు సుదీర్ఘంగా విచారించిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ రాహుల్ విజ్ణప్తి మేరకు మధ్యలో మూడు రోజులు విరామం ఇచ్చింది. నేషనల్ హెరాల్డ్ కేసులో రాహుల్ ఈడీ విచారణను ఎదుర్కొంటున్న సంగతి విదితమే. తన తల్లి సోనియాగాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా రాహుల్ విరామం కోరగా ఈడీ అంగీకరించింది. హెరాల్డ్ కేసులో ఈడీ రాహుల్ ను ఇప్పటికే ఈ నెల 13 నురంచి 15 వరకూ మూడు రోజుల్లో దాదాపు 28 గంటల పాటు విచారించింది. యంగ్ ఇండియన్ కంపెనీ కార్యకలాపాలు, అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ ఆస్తులతో పాటు పలు అంశాలపై ఈడీ అధికారులు రాహుల్ గాంధీపై పలు ప్రశ్నలు సంధించారు. రాహుల్ ఇచ్చిన సమాధానాలను ఆడియో, వీడియో రూపంలో భద్రపరిచారు. అయితే విచారణలో భాగంగా రాహుల్ ఇచ్చిన సమాధానలు తమ సందేహాలను పూర్తిగా నివృత్తి చేయలేదంటున్నా ఈడీ అధికారులు ఆయనను మరో మారు విచారించనున్నారు. రాహుల్, సోనియా గాంధీతో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు ప్రమోటర్లుగా ఉన్న యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్.. నేషనల్ హెరాల్డ్ పత్రికకు యాజమాన్య సంస్థ. అయితే, యంగ్ ఇండియన్ లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలపై ప్రస్తుతం ఈడీ దర్యాప్తు చేస్తోంది. కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ బకాయి పడ్డ సుమారు 90 కోట్లను వసూలు చేసుకునే హక్కును కేవలం 50 లక్షలు చెల్లించడం ద్వారా సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు ప్రయత్నించారని బీజేపీ నేత సుబ్రమణ్యస్వామి పదేళ్ల కిందట అంటే 2012లో ఫిర్యాదు చేశారు. ఆ కేసులోనే ఇప్పుడు ఈడీ రాహుల్ గాంధీని ప్రశ్నిస్తోంది. మరోవైపు, ఈడీ విచారణను నిరసిస్తూ, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా.. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది.
http://www.teluguone.com/news/content/ed-continues-to-inquire-rahul-25-138006.html





