ఇజ్రాయెల్- హెజ్బుల్లా మధ్యా కాల్పుల విరమణ.. ట్రంప్ మధ్యవర్తిత్వంతో కుదిరిన ఒప్పందం
Publish Date:Jun 2, 2026
Advertisement
మధ్యప్రాచ్యంలో గత కొన్ని నెలలుగా కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ఇజ్రాయెల్, హిజ్బుల్లా సాయుధ సంస్థల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. తన మధ్యవర్తిత్వంలో కుదిరిన ఈ ఒప్పందం.. తక్షణమే అమలులోకి వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్వయంగా ప్రకటించారు. ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించారు. ఇరుపక్షాలతో తాను జరిపిన సుదీర్ఘ చర్చలు విజయవంతమయ్యాయని, ఇకపై పరస్పరం దాడులకు పాల్పడబోమని ఇరు వర్గాలు అంగీకరించాయని ట్రంప్ పేర్కొన్నారు. ఈ చారిత్రాత్మక ఒప్పందం కేవలం తాత్కాలికం కాకూడదని, ఇది శాశ్వతంగా, అనంతకాలం కొనసాగాలని ఆకాంక్షిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. ఈ అసాధారణ ఒప్పందానికి ముందు తెరవెనుక దౌత్యపరమైన ఒత్తిళ్లు నడిచాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుతో ప్రత్యేకంగా ఫోన్లో మాట్లాడారు. అలాగే హిజ్బుల్లాకు చెందిన అత్యున్నత స్థాయి ప్రతినిధులతోనూ విడివిడిగా సంప్రదింపులు జరిపారు. లెబనాన్ రాజధాని బీరూట్‌పై ఇజ్రాయెల్ భారీ వైమానిక దాడులకు సిద్ధమవుతున్న తరుణంలో ట్రంప్ జోక్యం చేసుకుని నెతన్యాహును వారించారు. బీరూట్ నగరంపై పెద్ద ఎత్తున దాడులు చేయవద్దని ట్రంప్ చెప్పడంతో ఇజ్రాయెల్ ప్రధాని తన సైనిక బలగాలను వెనక్కి తిప్పారని అమెరికా శ్వేతసౌధం వర్గాలు వెల్లడించాయి. వాస్తవానికి హిజ్బుల్లా గనుక ఇజ్రాయెల్ సరిహద్దు గ్రామాలపై దాడులు ఆపకపోతే బీరూట్‌ను నామరూపాలు లేకుండా చేస్తామని ఇజ్రాయెల్ హెచ్చరించిన కొద్ది గంటల్లోనే ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదరడం గమనార్హం. ఈ నూతన ఒప్పందం ప్రకారం, ఇజ్రాయెల్ సైన్యం బీరూట్‌తో పాటు లెబనాన్ దక్షిణ శివార్లలోని దాహియే ప్రాంతంపై ఎలాంటి దాడులు చేయదు. దీనికి బదులుగా హిజ్బుల్లా ఇజ్రాయెల్ భూభాగాలపై కానీ, అక్కడి సైనికులపై కానీ ఎలాంటి దాడులకు పాల్పడదు.
http://www.teluguone.com/news/content/easefire-between-israel-and-hezbollah-36-221473.html





