గోల్కొండ తారామతి రిసార్ట్స్‌లో ఈగల్ టీం సోదాలు... డ్రగ్స్ పరీక్షలు కలకలం
Publish Date:Apr 4, 2026
Advertisement
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్ కలకలం మరోసారి రేగింది. గోల్కొండ సమీపంలోని తారామతి బారాదరి రిసార్ట్‌లో జరుగుతున్న ఒక భారీ డ్రగ్స్ పార్టీని ఈగల్ టీమ్ భగ్నం చేసింది. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత పక్కా సమాచారంతో అధికారులు చేపట్టిన ఈ దాడి నగరంలో సంచలనం సృష్టించింది. రిసార్ట్‌లో 'జాక్ అండ్ జాన్సన్' పేరిట నిర్వహిస్తున్న ఓ ఈవెంట్‌లో విచ్చలవిడిగా మాదకద్రవ్యాల వాడకం జరుగుతున్నట్లు అధికారులకువిశ్వసనీయంగా అందిన సమాచారం మేరకు ఈగల్ బృందం, హైదరాబాద్ సిటీ టాస్క్‌ఫోర్స్ పోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. పార్టీ జరుగుతున్న ప్రాంగణాన్ని పూర్తిగా దిగ్బంధించిన పోలీసులు, అక్కడ ఉన్న ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీ చేశారు. వీకెండ్ కావడంతో ఈ వేడుకకు భారీ సంఖ్యలో యువతీ యువకులు హాజరయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, ఈ పార్టీలో కొంతమంది బాలీవుడ్ నటులు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. అనుమానితులకు అధికారులు అక్కడికక్కడే డ్రగ్స్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. రిసార్ట్ ఆవరణ మొత్తాన్ని జల్లెడ పట్టి నిషేధిత పదార్థాల కోసం ముమ్మరంగా గాలించారు. రాష్ట్రంలో మాదకద్రవ్యాల సంస్కృతిని వేళ్లతో సహా పెకిలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉంది. అందుకోసం అత్యాధునిక సాంకేతికత మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో పనిచేసే 'ఈగల్ టీమ్'ను రంగంలోకి దించింది. పబ్‌లు, ఫామ్‌హౌస్‌లు, రిసార్టులలో జరిగే చట్టవిరుద్ధ కార్యకలాపాలపై ఈ బృందం నిరంతరం నిఘా ఉంచుతోంది. ఇటీవల కొండాపూర్‌లోని ఒక ప్రముఖ పబ్‌పై దాడి చేసి డ్రగ్స్ వినియోగదారులను పట్టుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘటన మరువకముందే తారామతి బారాదరిలో భారీ ఆపరేషన్ నిర్వహించడం డ్రగ్స్ మాఫియాకు గట్టి హెచ్చరికగా మారింది. యువత భవిష్యత్తును నాశనం చేస్తున్న ఇటువంటి పార్టీలపై ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరిస్తోంది. ప్రస్తుతం ఈ దాడిలో కొందరు డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది, పట్టుబడ్డ వారిలో ప్రముఖులు ఎవరెవరు ఉన్నారు అనే వివరాలను పోలీసులు గోప్యంగా ఉంచారు. త్వరలోనే పూర్తి నివేదికను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
http://www.teluguone.com/news/content/eagle-team-raida-in-baramathi-resorts-36-216695.html





