ఆ చేపలు.. ఒక్కొక్కటీ రూ.50 వేలు.. కచిడి చేపల ప్రత్యేకత ఏంటంటే?
Publish Date:Jun 22, 2026
Advertisement
ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతంలో మత్స్యకారుల నిరీక్షణకు ఊహించని రీతిలో అదృష్టం వరించింది. సముద్రంలో చేపల సంతానోత్పత్తి సమయం కావడంతో, ప్రభుత్వం ప్రతి ఏటా రెండు నెలల పాటు మర పడవలతో వేటను నిషేధిస్తుంది. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు దాదాపు 61 రోజుల పాటు సాగిన ఈ వేట నిషేధ కాలం ముగిసింది. వేట విరామ సమయంలో ఉపాధి కోల్పోయిన తీరప్రాంత మత్స్యకారులను ఆదుకునేందుకు ప్రభుత్వం శ్రీకాకుళం జిల్లా డోంకూరు నుండి తిరుపతి జిల్లా తడ వరకు ఉన్న అర్హులైన ప్రతి మత్స్యకారుడి కుటుంబానికి 20 వేల రూపాయల చొప్పున ఆర్థిక భృతిని కూడా అందించింది. చేపల వేట నిషేధ గడువు ముగియడంతో, మత్స్యకారులు చేపల వేట ప్రారంభించారు. ఈ క్రమంలో వేటకు వెళ్లిన కోనసీమ జిల్లా, సఖినేటిపల్లి మండలం అంతర్వేది పల్లిపాలెం మత్స్యకారుల వలలకు అరుదైన మత్స్య సంపద చిక్కింది. వారు వేసిన వలలో ఏకంగా లక్షల రుూపాయల విలువైనఅరుదైన కచిడి చేపలు మూడు చిక్కాయి. చాలా రోజుల విరామం తర్వాత సముద్రంలోకి వెళ్లిన తొలి వేటలోనే ఇలాంటి అరుదైన చేపలు వలకు చిక్కడంతో ఆ మత్స్యకారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ మూడు కచిడి చేపలను అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌కు తీసుకురావడంతో, ఆ అరుదైన చేపలను చూడటానికి స్థానికులు, ఇతర మత్స్యకారులు భారీగా తరలివచ్చారు. హార్బర్‌లో ఈ మూడు అరుదైన చేపలకు బహిరంగ వేలం నిర్వహించగా, వ్యాపారుల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. చివరకు ఒక స్థానిక వ్యాపారి ఈ మూడు చేపలను ఏకంగా 1 లక్షా 50 వేల రూపాయల భారీ ధరకు దక్కించుకున్నాడు. అంటే ఒక్కో చేప ధర అక్షరాలా 50 వేల రూపాయలు పలికింది. వేలంలో అమ్ముడైన ఈ మూడు చేపలలో రెండు మగ చేపలు కాగా, ఒకటి ఆడ చేప. ఈ చేపలు ఒక్కొక్కటి దాదాపు 13 కిలోల బరువు తూగాయి. కచిడి చేపల పొట్ట భాగంలో లభించే ఒక ప్రత్యేకమైన పొర లేదా ఎయిర్ బ్లాడర్ లాంటి పదార్థానికి అంతర్జాతీయ మార్కెట్లో విపరీతమైన గిరాకీ ఉంటుంది. దీనిని పలు రకాల ప్రాణరక్షక ఔషధాల తయారీలోనూ, శస్త్రచికిత్సకు ఉపయోగించే సర్జికల్ దారాల తయారీలోనూ వినియోగిస్తారు. అందుకే ఈ చేపలకు ఇంతటి డిమాండ్ ఉంటుంది. ప్రస్తుతం దొరికిన వాటికంటే ఇంకా పెద్ద పరిమాణంలో ఉండే కచిడి చేపలు గనుక వలలకు చిక్కితే, మార్కెట్లో ఒక్కో చేప ధర 2 లక్షల నుండి 3 లక్షల రూపాయల వరకు కూడా పలుకుతుందని మత్స్యకారులు చెప్తున్నారు. వేట నిషేధం ముగిసిన వెంటనే ఇలాంటి అదృష్టం కలిసిరావడం ఈ ఏడాది పొడవునా సాగే వేటకు మంచి శుభపరిణామమని, రాబోయే రోజుల్లో మరింత మత్స్య సంపద లభిస్తుందని తీరప్రాంత మత్స్యకారులు ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/each-fish-cost-50thousand-36-223761.html





