కేవలం ఐదారుగురు మంత్రులే సమైక్యం కోరుకొంటున్నారు: డొక్కా
Publish Date:Oct 2, 2013
Advertisement
మొన్నముఖ్యమంత్రికి వ్యతిరేఖంగా ముఠాకట్టిన తొమ్మిది మంది సీమంధ్ర మంత్రులలో ఒకరయిన మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, మీడియాతో మాట్లాడుతూ " సీమంధ్ర మంత్రులలో కేవలం కేవలం ఐదారుగురు మంత్రులు మాత్రమే రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకొంటున్నారని, మిగిలినవారు గందరగోళంలో ఉన్నారని" బాంబు పేల్చారు. మొన్న మంత్రి ఆనం రామినారాయణ రెడ్డి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై యుద్ద భేరి మ్రోగించగా నేడు మంత్రి డొక్కా ఆయనపై నేరుగా యుద్దమే మొదలుపెట్టేసారు. ముఖ్యమంత్రి అధిష్టానం తీసుకొన్న నిర్ణయాన్ని ఎదిరించడం, తప్పుబట్టడం చాలా తప్పని అన్నారు. ముఖ్యమంత్రి చుట్టూ కొంత మంది చెక్కభజన చేస్తున్నారని, వారి కారణంగానే ఆయన ఆవిధంగా మాట్లాడుతున్నారని డొక్కా ఆరోపించారు. ఆయన కొత్త పార్టీ స్థాపించబోతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలను ఖండించకపోవడంలో ఆయన ఉద్దేశ్యం ఏమిటని ప్రశ్నించారు. ముఖ్యమంత్రిగా ఉన్నకిరణ్ కుమార్ రెడ్డి ఇరు ప్రాంతాల ప్రజల మధ్య సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేయకపోగా వారి మధ్య విద్వేషాలు మరింత రెచ్చగొడుతున్నారని ఆరోపించారు. తాము కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయాన్ని వ్యతిరేఖించమని ఆయన స్పష్టం చేసారు. అయితే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచమని అధిష్టానాన్ని కోరుతామని ఆయన తెలిపారు. ఇంత వరకు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కేవలం తెలంగాణా మంత్రులు, ప్రతిపక్ష పార్టీ నేతలే విమర్శిస్తున్నారు. కానీ బహుశః రేపటి నుండి మిగిలిన సీమంద్రా మంత్రులు కూడా ఆయనకు వ్యతిరేఖంగా తమ గొంతులు సవరించుకొని విమర్శలు గుప్పిస్తారేమో. దీనివలన ఇప్పటికే దెబ్బ తిన్న కాంగ్రెస్ ప్రతిష్ట మరింత దిగజారడం ఖాయం. అది సమైక్యవాదం చేస్తున్న వైకాపాకు లబ్ది చేకూర్చే అవకాశం ఉంది. అదే విధంగా అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పడం ద్వారా, రాష్ట్ర విభజనకు అంగీకరిస్తున్నట్లు స్పష్టం చేసిన సదరు నేతలు సమైక్యవాదుల ఆగ్రహానికి గురి కాక తప్పదు.
http://www.teluguone.com/news/content/dokka-manikyavara-prasad-39-26299.html





