కుక్క బిర్యానీ విషయంలో... కాకి గోల!
Publish Date:Dec 26, 2016
Advertisement
నాలెడ్జ్ వేరు... టెక్నాలజీ వేరు! టెక్నాలజీ అంటే పువ్వులోంచి నూనె తీయటం. కాని, నాలెడ్జ్ అంటే మనకు ఎంత నూనె కావాలో అంతే తీసుకుని.. సున్నితమైన, అందమైన పూలని అనవసరంగా పాడు చేయకపోవటం! ఇప్పుడు జనాలకి టెక్నాలజీ విపరీతంగా అందుబాటులోకి వచ్చింది కాని నాలెడ్జ్ అందుకు తగ్గట్టుగా పెరగటం లేదు. ఆ కారణంగానే మంచికి వాడాల్సిన సీక్రెట్ కెమెరాల్ని, సెల్ కెమెరాల్ని ట్రయల్ రూమ్స్ లో, బాతూరూముల్లో అమరుస్తుంటారు. తాజాగా హైద్రాబాద్ లో జరిగిన కుక్క బిర్యానీ గోల అలాంటి టెక్నాలజీ పైత్యమే!
వున్నట్టుండీ ఒక వాట్సప్ మెసేజ్ చక్కర్లు కొట్టడం మొదలైంది. ఓల్డ్ సిటీలో ఫేమస్ అయిన షా ఘౌస్ బిర్యానీ సెంటర్లో మటన్, చికెన్ బదులు కుక్క మాంసం కలుపుతున్నారని. నిజంగా కూడా హైద్రాబాద్ లాంటి మహానగరాల్లో హోటల్ ఫుడ్ చాలా దారుణంగా వుంటుంది. అందులో ఏం కలుస్తుందో, ఎవరు కలుపుతారో అర్థం కాని పరిస్థితి. అందుకే, బిర్యానీలో కుక్క మాంసం అనే సరికి అంతా షేర్ లు , ఫార్వడ్ లు చేసేశారు. అలా అలా ఆ వార్త మెయిన్ స్ట్రీమ్ మీడియా నోటిలో పడింది. ఒక వాట్సప్ సమాచారాన్నిపట్టుకుని మన ఛానల్స్ నానా హడావిడి చేసేశాయి. ఎంతగా అంటే, పోలీసులు రంగ ప్రవేశం చేసి హోటల్ యజమానిని అరెస్ట్ చేసేంతగా!
వాట్సప్ అనే సాంకేతిక సౌకర్యం అందుబాటులో వుండటంతో ఒక 22ఏళ్ల యువకుడు ఆవేశపడ్డాడట! ఎందుకు షా ఘౌస్ హోటల్ పై కోపమొచ్చిందో తెలియదు కాని... అక్కడ కుక్క మాంసంతో బిర్యానీ చేస్తున్నారంటూ వాట్సప్ మెసేజ్ సిద్ధం చేశాడు. దాన్ని గ్రూప్స్ లో షేర్ చేశాడు. అక్కడ్నుంచీ యాగీ మొత్తం మొదలైంది. అయితే, ఏదో సోషల్ మీడియా గడబిడలే అనుకుని వదిలేయకుండా పెద్ద పెద్ద ఛానల్సు ఈ న్యూస్ పై కన్నేయటంతో రాత్రికి రాత్రి పెద్ద బ్రేకింగ్ న్యూస్ గా మారిపోయింది. చివరకు, అధికారులు దర్యాప్తు చేస్తే కుక్క మాంసం గోలంతా ఒట్టిదేనని తేలింది. కాని, అప్పటికే హోటల్ యజమానికి పేరు మొత్తం పాడైపోయింది. గిరాకీ తగ్గిపోయింది. పూడ్చలేని నష్టం జరిగిపోయింది.
వాట్సప్, ఫేస్బుక్, ట్విట్టర్ చేతుల్లో వున్నంత మాత్రాన అబద్ధాలు చెప్పే హక్కు ఎవ్వరికీ లేదు. అలాగే, మన ముందుకొచ్చిన సోషల్ మీడియా న్యూస్ నిజమవ్వాలని గ్యారెంటీ లేదు. ఇది అందరూ గుర్తుంచుకోవాలి. అలాగే, పెద్ద పెద్ద ఛానల్స్, పేపర్స్ ఒక వార్త అందిస్తున్నప్పుడు వాట్సప్ , ఫేస్బుక్ పోస్టుల ఆధారంగా నానా యాగీ చేయటం పద్ధతి కాదు. సరైన ఇన్వెస్టిగేషన్ చేసి నిజానిజాలు తేల్చుకోవాలి. ఇవేవీ జరగటం లేదు. టెక్నాలజీ ఆధారంగా సమాచారం వచ్చి పడిపోతుండటంతో దాంట్లో వివేకం కోల్పోయి కొట్టుకుపోతున్నారు జనం...
http://www.teluguone.com/news/content/dog-biryani-37-70622.html





