ఉపరాష్ట్రపతి ఎన్నికలో అదే కీలకం
Publish Date:Sep 8, 2025
Advertisement
ఎన్డీయే, ఇండియా కూటములు ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన వర్క్ షాపులు, అవగాహన సదస్సులు నిర్వహించాయి. వీటిలో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే.. మొదటి ప్రాధాన్యతా ఓటు తప్పనిసరి, రెండో ప్రాధాన్యతా ఓటు ఐచ్ఛికం. ఆ తర్వాత ఈ ఓటింగ్ విధానంలో పాల్గొనడానికి ఒక ప్రత్యేకమైన పెన్ను ఇస్తారు. దీని ద్వారా మాత్రమే బ్యాలెట్ పేపర్ పై గుర్తులు పెట్టాలి. ఇక బ్యాలెట్ పేపర్ లో మొదటి పేరు కూటమి అభ్యర్ధి జస్టిస్ బి. సుదర్శన్ రెడ్డిది ఉండగా.. రెండో పేరు ఎన్డీయే కూటమి అభ్యర్ధి సీపీ రాధాకృష్ణన్ పేరు ఉంటుంది. అందుకే బీజేపీ తన ఎంపీలతో పాటు ఎన్డీయే కూటమి ఎంపీలను కలిపి జేపీ నడ్డా అధ్వర్యంలో వేర్వేరు వర్క్ షాపులు నిర్వహించింది. ఆ తర్వాత ఇండియా కూటమి సైతం మాక్ పోల్ నిర్వహించింది. ఉప రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనే ఇండియా కూటమి పార్టీల ఎంపీలకు ఈ విషయంపై ఒక అవగాహన కల్పించాలన్నదే ఈ మాక్ పోల్ ముఖ్య ఉద్దేశం. ఇక మంగళవారం (సెప్టెంబర్ 9) పోలింగ్ జరుగుతుంది. అదే రోజున ఫలితం కూడా వెలువడుతుంది. ఉభయ సభల్లో ఇప్పటి వరకూ ఉన్న బలాబలాలు చూస్తే ఎన్డీఏకి 422 సీట్ల బలం ఉంది. ఇక ఇండియా కూటమికి 323 సీట్ల సపోర్ట్ ఉంది. ఆప్ కూడా తన 11 సీట్లను ఇండియా కూటమి అభ్యర్ధికే ఇస్తోంది. దీంతో ఈ బలం 334గా మారింది. చివర్లో కొన్ని తటస్త పార్టీల ఎంపీలు ఇటు వైపు మొగ్గితే ఈ సంఖ్య కొంత పెరిగినా పెరగొచ్చు. అలాగని ఎన్డీఏ అభ్యర్ధిని క్రాస్ చేయగలిగేంత కాదు. ఇప్పటికే ఎన్డీయే అభ్యర్ధి గెలుపు దాదాపు లాంఛనం అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే విజయానికి అవసరమైన మేజిక్ ఫిగర్ 392 కన్నా ఎన్డీయే కూటమి సభ్యుల సంఖ్య ఎక్కువే ఉంది. దీంతో ఎన్డీయే కూటమి అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్ విజయం నల్లేరు మీద బండినడకే అంటున్నారు. ఇదిలా ఉంటే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తెలుగువాడైన సుదర్శన్ రెడ్డికి తెలుగు పార్టీలన్నీ కలసి ఓట్లు వేయాలని కోరింది. ఈ ఎన్నికలో ఫలానా అభ్యర్ధికే ఓటు వేయాలని ఎవరూ విప్ జారీ చేయరు కాబట్టి.. ఈ దిశగా స్థానిక బీఆర్ఎస్, టీడీపీ, జనసేన, వైసీపీలకు కాంగ్రెస్ పిలుపునిచ్చింది మరి చూడాలి.. ఏదైనా మేజిక్ జరుగుతుందో లేదో?
http://www.teluguone.com/news/content/do-you-know-the-key-issue-in-vice-president-election-39-205780.html





