ప్రాణం తీసిన వాషింగ్ మిషన్ వాటర్.. జర జాగ్రత!
Publish Date:Dec 7, 2022
Advertisement
ఇరుగూ పొరుగూ అన్నాక సఖ్యత ఉండాలి. చిన్న చిన్న పొరపొచ్చాలున్నా సద్దుకు పోయే సహృదయత ఉండాలి. అలా లేకపోతే నిత్యం గొడవలతో సతమతవమ్వాల్సిందే. అయితే ఆ చిరు గొడవలే చినికి చినికి గాలివానగా మారితే ఏమౌతుందనడానికి సత్యసాయి జిల్లాలో జరిగిన దారుణ ఘటనే ప్రత్యక్షసాక్ష్యంగా నిలుస్తుంది. సత్యసాయి జిల్లా కదిరిలో ఇరుగు పొరుగుల మధ్య వాషింగ్ మిషన్ పెను వివాదానికి దారి తీసింది. పద్మావతి అనే మహిళ వాషింగ్ మిషన్ ఉపయోగించిన ప్రతి సందర్భంలోనూ ఆ మిషన్ నుంచి బయటకు వచ్చే నీళ్లు తమ ఇంటి గుమ్మం మీదుగా వెళుతున్నాయంటూ పొరుగునే ఉన్న వేమన్న కుటుంబం తగవు పడుతూ వస్తోంది. ఆ తగవే చినికి చినికి గాలివానగా మారింది. ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో మేమన్న కుటుంబీకులు ఆమెపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. అవీ అలాంటిలాంటి రాళ్లు కాదు ఏకంగా బండ రాళ్లతో దాడి చేయడంతో ఆ దాడిలో పద్మావతి తీవ్రంగా గాయపడింది. దీంతో కుటుంబ సభ్యులు ఆమెను తొలుత స్థానిక ఆసుపత్రికి అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకూ తరలించారు. అయితే ఫలితం లేకపోయింది. బెంగళూరులోని ఓ అసుపత్రిలో చికిత్స పొందుతూ కన్ను మాసింది.
http://www.teluguone.com/news/content/dispute-over-washing-mission-water-women-attacked-with-stones-25-148216.html





