మునుగోడు టీఆర్ఎస్ లో ముసలం
Publish Date:Aug 13, 2022
Advertisement
మునుగోడు టీఆర్ఎస్ లో అసమ్మతి పతాక స్థాయికి చేరింది. మునుగోడు ఉప ఎన్నికకు ముందు నియోజకవర్గ టీఆర్ఎస్ అసంతృప్త నేతల రహస్య సమావేశం కలకలం రేపింది. ఈ రహస్య సమావేశానికి నియోజకవర్గం నలుమూలల నుంచీ దాదాపు 300 మంది నేతలు హాజరయ్యారు. కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి వ్యతిరేకంగా ఈ సమావేశం జరిగినట్లు చెబుతున్నారు. ప్రభాకరరెడ్డికి వినా ఎవరికి టికెట్ ఇచ్చినా అందరం మనస్ఫూర్తిగా సహకరిస్తామని అసంతృప్త నేతలు అంటున్నారు. అయితే కూసుకుంట్ల ప్రభాకరరెడ్డికి పార్టీ టికెట్ ఖరారు చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ సహకరించేది లెదని అసమ్మతి నేతలు అంటున్నట్లు సమాచారం. ఈ రహస్య సమావేశం నేపథ్యంలో పార్టీ అగ్ర నాయకత్వం అప్రమత్తమైంది. అసమ్మతులను బుజ్జగించే బాధ్యతను మంత్రి జగదీశ్ రెడ్డికి అప్పగించింది. అయితే ఆయన అసమ్మతి నేతలతో జరిపిన చర్చలు ఫలించలేదని అంటున్నారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పినా ప్రభాకరరెడ్డి విషయంలో రాజీ పడేది లేదని వారు భీష్మించినట్లు పార్టీ వర్గాలే చెబుతున్నాయి. ఈ నేపథ్యంలోనే దండు మల్కాపూర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో అసమ్మతి నేతలు సమావేశం కావడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. మునుగోడు ఉపఎన్నిక ను కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో నియోజకవర్గ కారు పార్టీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమనడం పార్టీకి మింగుడుపడటం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికను బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ కూడా సీరియస్ గా తీసుకున్న నేపథ్యంలో త్రిముఖ పోరు హోరాహోరీగా ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ లో ఒక్కసారిగా అసమ్మతి జ్వాలలు రేగడం ఆ పార్టీకి ఒకింత ఇబ్బందికరమేనని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికలో విజయం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలలో తమదే అధికారం అని చాటుకోవాలన్న లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ లు సర్వ శక్తులూ ఒడి మునుగోడును దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అధికార పార్టీలో అసమ్మతి సెగలు ఆ పార్టీని డిఫెన్స్ లో పడేసినట్లేనని పరిశీలకులు అంటున్నారు.
http://www.teluguone.com/news/content/disidents-secreat-meeting-ahead-of-munugodu-by-election-25-141845.html





