పరిమళ్ నత్వానీకి నిరాశే!
Publish Date:Jun 6, 2026
Advertisement
భారతీయ కార్పొరేట్ రంగంలోనే కాకుండా దేశ రాజకీయాల్లోనూ అత్యంత ప్రభావమంతమైన వ్యూహకర్తగా, బలమైన లాబీయిస్ట్ గా గుర్తింపు పొందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ గ్రూప్ ప్రెసిడెంట్ పరిమళ్ నత్వానీకి ఈసారి నిరాశే మిగిలింది. వరుసగా మూడు పర్యాయాలు, అంటే దాదాపు 18 ఏళ్ల పాటు రాజ్యసభలో చక్రం తిప్పిన నత్వానీకి.. 2026 రాజ్యసభ ఎన్నికల్లో ఎక్కడా చోటు దక్కలేదు. ఆయన గతంలో ప్రాతినిధ్యం వహించిన ఆంధ్రప్రదేశ్ నుండి గానీ, అంతకుముందు రెండుసార్లు గెలిచిన జార్ఖండ్ నుండి గానీ, లేదా ఆయన సొంత రాష్ట్రమైన గుజరాత్ నుండి గానీ ఈసారి అభ్యర్థిత్వం లభించలేదు. దేశంలోనే అత్యంత శక్తిమంతమైన రిలయన్స్ కార్పొరేట్ లాబీయింగ్ పప్పులు మారిన రాజకీయ సమీకరణాల ముందు ఉడకలేదు. పరిమళ్ నత్వానీ రాజకీయ ఒక సారి పరిశీలిస్తే ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో ఆయన ఆరితేరారని అర్థమవుతుంది. రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీకి అత్యంత నమ్మకస్తుడైన నత్వానీ, 2008లో మొదటిసారిగా జార్ఖండ్ నుండి స్వతంత్ర అభ్యర్థిగా రాజ్యసభ బరిలోకి దిగారు. ఏ రాజకీయ పార్టీకి అధికారికంగా చెందని వ్యక్తి అయినప్పటికీ.. తనకున్న కార్పొరేట్ నెట్‌వర్క్, అద్భుతమైన లాబీయింగ్ వ్యూహాల ద్వారా స్థానిక ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టుకుని అప్పట్లో సంచలన విజయం సాధించారు. ఆ విజయం యాదృచ్ఛికం కాదని నిరూపిస్తూ.. మళ్లీ 2014లో కూడా అదే జార్ఖండ్ నుండి రెండోసారి కూడా ఇండిపెండెంట్ గా పెద్దల సభలో అడుగుపెట్టారు. జార్ఖండ్ లాంటి గిరిజన ప్రాధాన్యత, సంక్లిష్ట రాజకీయాలు ఉన్న రాష్ట్రంలో ఒక గుజరాతీ పారిశ్రామికవేత్త వరుసగా రెండుసార్లు ఇండిపెండెంట్ గా గెలవడం అప్పట్లో ఒక అరుదైన రికార్డుగా నిలిచింది. అయితే, 2020 నాటికి జార్ఖండ్ రాజకీయాల్లో ఊహించని మార్పులు రావడంతో నత్వానీ ఆంధ్రప్రదేశ్ వైపు చూశారు. నాడు రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ స్వయంగా రంగంలోకి దిగి.. నాటి ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో తాడేపల్లి ప్యాలెస్‌లో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ ఉన్నత స్థాయి చర్చల ఫలితంగా.. ఆంధ్రప్రదేశ్‌తో ఎలాంటి ప్రత్యక్ష సంబంధం లేనప్పటికీ వైసీపీ కోటా నుండి పరిమళ్ నత్వానీకి రాజ్యసభ సీటు దక్కింది. జగన్ తన సొంత పార్టీకి చెందిన ఎందరో సీనియర్ నేతలను, ఆశావహులను పక్కనబెట్టి మరీ నత్వానీని ఏపీ నుండి పెద్దల సభకు పంపారు. ఈ విధంగా రెండుసార్లు జార్ఖండ్ నుండి, ఒకసారి ఆంధ్రప్రదేశ్ నుండి మొత్తం మూడు సార్లు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ప్రస్తుత 2026 ఎన్నికల నాటికి సీన్ పూర్తిగా రివర్స్ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలుకావడంతో, ఆ పార్టీకి ఈసారి ఒక్క రాజ్యసభ సీటును కూడా సొంతంగా గెలుచుకునే సంఖ్యాబలం లేదు. ప్రస్తుతం ఖాళీ అవుతున్న 4 స్థానాలనూ అధికార టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికే దక్కబోతున్నాయి. మరోవైపు జార్ఖండ్‌లోనూ ప్రస్తుత అధికార, ప్రతిపక్ష కూటములు స్థానిక క్యాడర్‌కే ప్రాధాన్యత ఇవ్వడంతో అక్కడ కూడా నత్వానీకి మొండిచేయే ఎదురైంది. దీంతో.. ఒకప్పుడు తెరవెనుక ఉండి దేశ రాజకీయాలను శాసించిన రిలయన్స్ ప్రతినిధి పరిమళ్ నత్వానీ, ఈసారి ఏ రాష్ట్రం నుంచీ మద్దతు లభించక పెద్దల సభకు దూరమై మాజీ ఎంపీగా మిగిలిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
http://www.teluguone.com/news/content/disappointment-for-parimal-natwani-39-222073.html





