వైసీపీలో అసమ్మతి.. జగన్ చేతులెత్తేశారా?
Publish Date:Oct 17, 2023
Advertisement
కాంగ్రెస్ పార్టీ అంటే కుమ్ములాటకి పెట్టింది పేరు. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని లేకుండా దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఈ సమస్య ఎదుర్కొంటూనే ఉంటుంది. అయితే, కాంగ్రెస్ జాతీయ పార్టీ కనుక ఎన్ని కుమ్మలాటలు ఉన్నా చెల్లిపోతుంది. కానీ, ప్రాంతీయ పార్టీలలో అలా అంతర్గత కుమ్ములాటలు ఉంటే ఆ పార్టీ ఎందుకు పనికి రాకుండా పోతుంది. సింగిల్ కార్డ్ సిద్ధాంతం మీద పనిచేసే ప్రాంతీయ పార్టీలలో కర్త, కర్మ, క్రియ అన్నీ పార్టీ అధ్యక్షుడే కాగా.. అధ్యక్షుడి మాటకి మొత్తం పార్టీ కట్టుబడి ఉంటుంది. ఇంకా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలలో అధ్యక్షులు కనుసైగతో పార్టీని కట్టడి చేస్తారు. కానీ, ఏపీలో అధికార పార్టీలో ఇప్పుడు అంతర్గత కుమ్ములాటలు తారాస్థాయికి చేరగా.. నేతలు అధిష్టానికి కూడా కొరకురాని కొయ్యలుగా తయారయ్యారు. గట్టిగా మాట్లాడితే ఓడిపోయే పార్టీలో మేం ఉండేదే లేదంటూ అలకపాన్పు ఎక్కుతున్నారు. మళ్ళీ వాళ్ళని బుజ్జగించడం.. ఆశ పెట్టడం ఎందుకులే అనుకున్నారో ఏమో కానీ జగన్ కూడా చేతులెత్తేశారు. నేతల మధ్య సమన్వయం కుదిర్చే బాధ్యతను కోఆర్డినేటర్లకు అప్పగించేసి.. నా పని బటన్ నొక్కుడు మాత్రమేనని చెబుతున్నారు. ఇటీవల సీఎం జగన్ లండన్ నుండి ఏపీకి రాగానే విజయవాడలో వైసీపీ కన్వీనర్ల సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ఎన్నికలకు సమాయత్తం కావాలని.. ఎక్కడికక్కడ నేతలు, ఎమ్మెల్యేలు, ఇంచార్జిలు కోఆర్డినేటర్లతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. దీంతో అప్పటి నుండి వైసీపీ రీజనల్ కోర్డినేటర్లు విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. నిజానికి ఎన్నికల ముంగిట ఈ సమావేశాలు చాలా కీలకం. పార్టీలోని లోటుపాట్లు, అసంతృప్తులను చల్లార్చి, ఎన్నికల యుద్ధానికి సన్నద్ధం చేయడమే కోఆర్డినేటర్లసమావేశాల ప్రధాన ఎజెండా. కానీ, వైసీపీలో ఇప్పుడు ఈ కోఆర్డినేటర్ల సమావేశాలే కొంప ముంచుతున్నాయి. ఎక్కడికక్కడ అన్ని నియోజకవర్గాలలో అంతర్గత విభేదాలు సమసిపోవడం దేవుడెరుగు.. మరింతగా పెంచేలా చేస్తున్నాయి. కోఆర్డినేటర్ల ఎదుటే నేతలు యుద్దానికి దిగుతూ రెచ్చిపోతున్నారు. గట్టిగా మాట్లాడితే మీరేంటి చెప్పేది అంటూ కోఆర్డినేటర్లను కూడా లెక్క చేయకుండా రెచ్చిపోతున్నారు. ఇందుకు ఉదాహరణే నెల్లూరు నియోజకవర్గ సమావేశం. వైసీపీ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి నెల్లూరులో సమావేశాలు నిర్వహించారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ సమావేశంలో మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ను మిగతా నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. విజయసాయి రెడ్డి అనిల్ కుమార్ పేరును ప్రకటించగానే జిల్లాలోని మిగతా నేతలు ఒక్కసారిగా భగ్గుమన్నారు. వైసీపీ రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నుడా చైర్మన్ ముక్కామల ద్వారకనాథ్, చివరికి అనిల్ కుమార్ యాదవ్ బాబాయ్ రూప్ కుమార్ యాదవ్ కూడా అనిల్ కు వ్యతిరేకంగా గళం విప్పారు. వీరిలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లేదా ఆయన సతీమణి ప్రశాంతి నెల్లూరు ఎంపీ బరిలో ఉండగా.. రేపు అనిల్ ఆయనతో కలిసి పనిచేయాల్సి ఉంది. ఇప్పటికే పేరున్న నేతలంతా గుడ్ బై చెప్పేయగా.. ఉన్న వారిలో మంత్రి కాకాణితో పాటు మిగతా వాళ్ళు కూడా కలిస్తేనే ఇక్కడ పార్టీ బ్రతికి బట్టకట్టేది. కానీ, ఏ ఒక్కరూ పార్టీ ప్రకటించిన అభ్యర్థిని ఒప్పుకోవడం లేదు. కోఆర్డినేటర్ గా ఉన్న విజయసాయి రెడ్డి ఎంత చెప్పినా వినేవారు లేరు. ఇది ఒక్క నెల్లూరు సిటీ పరిస్థితి మాత్రమే కాదు. దాదాపుగా రాష్ట్రమంతా వైసీపీది ఇదే పరిస్థితి. ఒకరికి ఒకరు అనే మాట లేకుండా ఎవరికి వారే అన్నట్లుగా మారిపోయారు. అసలే రాష్ట్ర ప్రజలకు పీకల వరకూ అసంతృప్తి ఉండగా.. గట్టేక్కేది ఎలారా భగవంతుడా అని పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతుంది. కానీ, నేతలేమో ఎలాగూ గెలిచే అవకాశం లేనప్పుడు తమ ఈగో చంపుకోని ఎందుకు పనిచేయాలన్నట్లుగా ఎవరినీ లెక్కచేయడం లేదు. ఒకవైపు ప్రతిపక్షాలు ఐక్యతా రాగం అందుకొని బలపడి సవాళ్లు విసురుతుంటే వైసీపీ అసంతృప్తి మంటలతో తగలబడిపోతుంది. నా బటన్ నొక్కుడే నన్ను గెలిపిస్తాయని సీఎం జగన్ మోహన్ రెడ్డి భావిస్తున్నారేమో ఏమో కానీ.. అన్ని బాధ్యతలను నేతల నెత్తిన పెట్టేసి ఆయన మాత్రం తాడేపల్లి ప్యాలెస్ లో రిలాక్స్ అవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో మారిన సమీకరణాలతో పాటు ఇలా కుమ్ములాటలతో వెళ్తే వైసీపీకి కనీసం డిపాజిట్లు కూడా కష్టమేనని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
http://www.teluguone.com/news/content/disaccord-in-yco-39-163585.html





