తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు భారీ వర్షాలు
Publish Date:Aug 13, 2025
Advertisement
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఏపీలో పలు జిల్లాల్లో భారీనుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధ, గురువారాల్లో కోస్తా జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు, కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. ఏలూరు, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, బాపట్ల, పల్నాడు, గుంటూరు, ప్రకాశం, నంద్యాల జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. విజయవాడలో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా రెండు వేరు, వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఓ ఘటనలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మ్యాన్‌హోల్‌లో పడి చనిపోయాడు. మృతుడ్ని 53వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు మధుసూదన్‌గా గుర్తించారు. రెండవ ఘటనలో కూలిన చెట్టును ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందారు. విజయవాడలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో.. కృష్ణా నది, బుడమేరు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో.. కృష్ణానది, బుడమేరు పరివాహక ప్రాంతాలలో నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్చరించారు. ఫ్లడ్ అలర్ట్ జారీ చేసి, లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. ఇక, భారీ వర్షాల కారణంగా అచ్చంపేట-మాదిపాడు రహదారిపైకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో అమరావతి- విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా రేపు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడొచ్చని నాగరత్న తెలిపారు. హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. జీహెచ్ఎంసీ ఏరియాలో 20 సెంమీటర్ల వర్షం కురుస్తుందని ఐఎండీ హెచ్చరించింది. ఈ క్రమంలో నగర ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావొద్దని జీహెచ్‌ఎంసీ కమిషనర్ కర్ణన్ తెలిపారు. రోడ్డు, లోతట్టు ప్రాంతాల్లో భారీగా నీరు నిలిచే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు
మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా బుధ, గురువారం రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ప్రకటించారు. ఖమ్మం, భద్రాద్రి, మెదక్, వికారాబాద్, భూపాలపల్లి, ములుగు, మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లాలకు రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేసినట్లు వెల్లడించారు. అలాగే కామారెడ్డి, జనగామ, కుమురం భీం, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, మంచిర్యాల, నల్గొండ, రంగారెడ్డి, సిద్ధిపేట, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, మంచిర్యాల జిల్లాలకు ఆరెంజ్ కలర్ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపారు.
http://www.teluguone.com/news/content/director-nagaratna-25-204135.html





