వైసీపీని అధికారంలోకి రానివ్వం.. జనసేనాని ధీమా
Publish Date:Jun 26, 2025

Advertisement
రాదు..రానివ్వం..! వైసీపీ విషయంలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన కామెంట్లివి. ఆంధ్రప్రదేశ్‌లో మళ్లీ వైసీపీ వస్తుందేమో.. అప్పుడు పరిస్థితి ఏంటి అని ఎంతో మంది తమను అడుగుతున్నారంటూ.. స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సహా పలువురు మంత్రులు, అధికారులు మాట్లాడుతున్న వేళ.. కీలక కామెంట్లు చేశారు జనసేనాని. జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన ఈ కామెంట్లే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్‌గా మారాయి.ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ.. 2029లో అధికారంలోకి వస్తే పరిస్థితి ఏంటన్న మాట గత కొంత కాలంగా ఏపీ రాజకీయాల్లో గట్టిగా విన్పిస్తోంది. ఈ అంశంపై పారిశ్రామిక వేత్తలు, వాణిజ్య వర్గాలు తమను పలు సందర్భాల్లో ఎన్నో ప్రశ్నలు అడుగుతున్నాయంటూ స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబునాయుడు, మంత్రి లోకేశ్ సహా పలువురు చెప్పుకొచ్చారు.
సరిగ్గా ఇలాంటి పరిణామాల వేళ కీలక కామెంట్లు చేశారు పవన్ కల్యాణ్. అంతేకాదు.. ఈ ప్రభుత్వంలో ఉన్న అధికారులను ఉద్దేశిస్తూ తాము మళ్లీ అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వెనక్కు రప్పిస్తామంటూ మాజీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలకు గట్టి కౌంటరిచ్చారు పవన్ కల్యాణ్. అయితే.. వైసీపీ ప్రభుత్వం మళ్లీ రాబోయే రోజుల్లో అధికారంలోకి రాదు.. రానివ్వం అంటూ పవన్ వ్యాఖ్యానించడం వెనుక దీమా ఏంటన్న ప్రశ్నలే ఇప్పుడు తలెత్తుతున్నాయి. కూటమి సర్కారు అమలు చేస్తున్న, రాబోయే రోజుల్లో అమలు చేయబోయే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే కారణం అని కొందరు చెబుతుంటే.. ఎక్కడ నెగ్గాలో కాదు..ఎక్కడ తగ్గాలో తెలిసి వాడే జనసేనాని అని మరికొందరు చెబుతున్నారు. తమది సుదీర్ఘ కాల లక్ష్యంగా చెప్పుకొచ్చారు పవన్ కల్యాణ్. 15 నుంచి 20 ఏళ్లు అధికారంలో ఉండాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు మరోమారు స్పష్టం చేసిన ఏపీ డిప్యూటీ సీఎం.. ఇందుకోసం ఎలాంటి త్యాగాలకైనా రెడీ అని ప్రకటించారు.
వికసిత్ భారత్‌లో ఏపీ భాగస్వామ్యం అవుతుందని చెప్పిన ఆయన.. వికసిత్ ఏపీగా మారాలంటే కూటమి ఐక్యత చెడగొట్టే పరిస్థితుల్లో తాను కానీ, మరెవరూ కానీ లేరని స్పష్టం చేశారు. ఇది సైతం పవన్ దీమాకు ఓ కారణమని చెబుతున్నారు పొలిటికల్ అనలిస్ట్‌లు. నిజానికి.. 2024 ఎన్నికల్లో ఏపీలో కూటమి ఏర్పాటయ్యేందుకు గట్టిగా కృషి చేశారు పవన్ కల్యాణ్. ఎన్డీఏతో భాగస్వామిగా ఉన్న పవన్.. ఇటు టీడీపీతోనూ జట్టు కట్టారు. చివరకు మూడు పార్టీలను ఏకతాటిపైకి తీసుకొచ్చి ఎన్డీఏ కూటమిగా మార్చేందుకు తనవంతు పాత్ర పోషించారు. దీంతో.. 2024 ఎన్నికల్లో వైసీపీ వ్యతిరేక ఓటు చీలలేదు. ఫలితంగా టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి జైత్రయాత్ర కొనసాగించింది. తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. 2029 నాటికి వైసీపీ ఓటు చీలకుండా తన వంతు పాత్ర బలంగా పోషించేందుకు ఎల్లప్పుడూ తాను సిద్ధంగా ఉంటానని మరోసారి తన వ్యాఖ్యల ద్వారా చెప్పేశారు పవన్ అన్న టాక్ ఇప్పుడు విన్పిస్తోంది. మరి.. జనసేనాని మాటలకు వైసీపీ ఎలా స్పందిస్తుంది..? అన్నది ఆసక్తికరంగా మారింది.
http://www.teluguone.com/news/content/deputy-cm-pawan-kalyan-39-200701.html












