డీలిమిటేషన్ తో దక్షిణాదికి నష్టమే ఎక్కువ
Publish Date:Sep 22, 2023

Advertisement
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్ ఉభ సభలు ఆమోదించాయి. అన్ని పార్టీలు ఏకమై మరీ బిల్లుకు ఆమోద ముద్ర వేశాయి. అయితే ప్రతిపక్ష పార్టీలు, మేథావులు మహిళా రిజర్వేషన్ చట్టం అమలుకు, జనగణన, డీలిమిటేషన్ (అసెంబ్లీ,లోక్ సభ,నియోజక వర్గాల పునర్విభజన)తో ముడిపెట్టి, ఏకంగా ఐదేళ్ళు వాయిదా వేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. సరే ఆ విషయంలో చివరకు ఏమి జరుగుతుందనేది పక్కన పెడితే, ఇప్పడు కొత్తగా డీలిమిటేషన్ పై రాజకీయ వివాదం తెరపై కొస్తోంది. ముఖ్యంగా లోక్ సభ నియోజక వర్గాల డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతుంది. మరీ ముఖ్యంగా, రాష్ట్ర విభజ చట్టంలో హామీ ఇచ్చిన విధంగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో తక్షణమే నియోజక వర్గాల పునర్విభజన జరగాలని అప్పటి నుంచి కోరుతున్న బీఆర్ఎస్ ఇప్పుడు జనభా ప్రాతిపదికన డీలిమిటేషన్ చేస్తే,ఉభయ తెలుగు రాష్ట్రాలకు నష్టమే జరుగుతుందని విమర్శిస్తూ ఉమ్మడి పోటానికి పిలుపు నిస్తోంది.
ఇప్పటికే ఉత్తరాది డామినేషన్ అనుభవిస్తున్న దక్షిణాది రాష్ట్రాలు మరింతగా నష్ట పోతాయని, దక్షిణాది రాష్ట్రాల ప్రజలు మరింత వివక్షకు గురయ్యే ప్రమాదం ఉందని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అంతేకాదు దక్షిణాది రాష్టాల ప్రజలు దేశంలో సెకండ్ క్లాస్ సిటిజన్స్ (రెండవ తరగతి పౌరులు) గా అవమానాలకు గురయ్యే ప్రమాదం ఉందని అనుమానిస్తున్నారు. అందుకే రాజకీయాలకతీతంగా దక్షిణాది నేతలంతా ఈ విషయంలో ఏకమై పోరాటం చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, కల్వకుంట్ల తారక రామారావు పిలుపు నిచ్చారు.
కేంద్రం తీసుకుంటున్న ఈ విధానాల వల్ల దక్షిణాది రాష్ట్రాలైన కేరళ ,తమిళనాడు, ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటక ,తెలంగాణ తీవ్రంగా నష్టపోతాయని లోక్ సభలో వీటి ప్రాతినిధ్యo తగ్గిపోతుందని ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని ఆయన హెచ్చరించారు. ఇందుకు ఉదాహరణగా ఉభయ తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతమున్న 44 లోక్ సభ నియోజక వర్గాల సంఖ్య, 36 తగ్గుతుందని అంటే, తెలుగు రాష్ట్రాలు ఎనిమిది శానాలు కోల్పోతాయని, దీంతో పార్లమెంట్ లో తెలుగు గళం బలహీనపడుతుందనిఅంటున్నారు. అలాగే, కేరళ,(8) తమిళనాడు,(8) కర్ణాటక (2) పశ్చిమ బెంగాల్ (4) ఇలా దక్షిణాది రాష్ట్రాలలో నియోజక వర్గాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. మరో వంక ఉత్తరాది రాష్ట్రాలలో జనాభా పెరిగిన కారణంగా చాలా వరకు రాష్ట్రాలలో నియోజక వర్గాల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. ఒక్క ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రస్తుతమున్న 80 నియోజక వర్గాల సంఖ్య 11 పెరిగి 91 చేరుకుంటుంది.
నిజానికి డీలిమిటేషన్ తర్వాత నియోజక వర్గాల సంఖ్య అన్ని రాష్ట్రాలలో పెరగాలి కానీ, డీలిమిటేషన్ కు జనాభాను ప్రాతిపదికగా తీసుకోవడం వలన జనాభా నియత్రణ పాటించిన ప్రగతి శీల రాష్ట్రాలకు తీరని నష్టం జరుగుతోందని దక్షిణాది రాష్ట్రాల నాయకులు ఆందోళన వ్యక్త పరుస్తున్నారు. జనాభా నియంత్రణ పాటించడంతో పాటుగా జనాభాల్లో 18 శాతం ఉన్న దక్షిణాది రాష్ట్రాలు స్థూల జాతీయ ఉత్పత్తికి 35 శాతం నిధులు అందిస్తున్నాయి.
ఈ నేపధ్యంలో ప్రగతిశీల విధానాలను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు ఈ రకమైన బహుమతి సరైనది కాదని అంటున్నారు.కేవలం ఉత్తరాది రాష్ట్రాలకు మేలు చేయడం కోసమే కేంద్రం ఇలాంటి విధానాలను ప్రతిపాదిస్తున్నదని నేతలు అంటున్నారు. మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తమకు ఇసుమంతైనా స్టేక్ లేని దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటులో ప్రాతినిథ్యం తగ్గించడమే లక్ష్యం, అదే సమయంలో తమ బలం ఎక్కువగా ఉన్నచోట మరిన్ని సీట్లు పెంచి తద్వారా దీర్ఘకాలం అధికారంలోకి ఉండాలనే స్వార్థ ప్రయోజనాల కోసమే జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ ను తెరమీదకు తెచ్చిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
అయితే, ఇంకా ఇప్పటి వరకు డిలిమిటేషన్ కమిషన్ ఏర్పాటు జరగ లేదు. అంతకు ముందు జరగ వలసిన జనగణన ఇంత వరకు మొదలు కాలేదు.. ఈ ప్రక్రియ మొదలయ్యేందుకే .. మరో సంవత్సరకాలం పడుతుంది. అన్నీ సక్రమంగా జరిగితే, మరో మూడేళ్ళ తరవాత 2026- 27 నాటికి కానీ ఈ ప్రక్రియ పూర్తి కాదు .. ఈ లోగా ఏమైనా జరగ వచ్చును. అయితే కేంద్రం ప్రతిపాదించిన జనాభా ప్రాతిపదికన డీలిమిటేషన్ మాత్రం కచ్చితంగా దక్షిణాది రాష్ట్రాలను బలహీన పరచి, వారి గళం లోక్ సభలో, రాజ్యసభలో వినపడకుండా చేయాలన్న దురుద్దేశంతో చేసిందేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/delimitation-a-big-loss-south-states-39-162199.html












