యువగళం నవశకం.. ఈ దశాబ్దపు అతి పెద్ద వేడుక
Publish Date:Dec 20, 2023
Advertisement
రాష్ట్రంలో జగన్ మోహన్ రెడ్డి అరాచక పాలనను అంతమొందించడమే లక్ష్యంగా యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర దిగ్విజయంగా పూర్తైన సందర్భంగా బుధవారం (డిసెంబర్ 20)నిర్వహించనున్న యువగళం-నవశకం బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పనుం దనడంలో సందేహం లేదు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర దిగ్విజయంగా ముగిసిన సందర్భంగా బుధవారం(డిసెంబర్ 20) జరిగే సభకు పార్టీ అధినేత నారాచంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాజరౌతున్నారు. అలాగే తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన పలువురు అగ్రనేతలూ హాజరౌతున్నారు. ఏపీలో మరో మూడు నెలలలో ఎన్నికలు జరగనుండటంతో ఇప్పుడు అందరి దృష్టీ ఈ సభపైనే ఉంది. అన్ని దారులూ రోమ్ వైపే అన్నట్లుగా రాష్ట్రం మొత్తం సభ జరగనున్న విజయనగరం జిల్లా పోలిపల్లి వైపే చూస్తోంది. నడుస్తోంది. మధ్యాహ్నం 3 నుంచి 7 గంటల వరకూ జరిగే ఈ సభకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. దాదాపు 6లక్షల మంది ఈ సభకు హాజరౌతారన్న అంచనాలున్నాయి. ఈ సభ కోసం తెలుగుదేశం ఐదు ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. ఇవి కాక ప్రైవేటు బస్సులు, లారీలు, కార్లు.. ఇలా అందుబాటులో ఉన్న ప్రతి సాధనాన్నీ ఉపయోగించుకుని జనం సభకు పోటెత్తుతున్నారు. సభకు జనం రాకుండా చేసేందుకు అధికార పార్టీ సృష్టించిన, సృష్టిస్తున్న అడ్డంకులన్నిటినీ దాటుకుని రాష్ట్ర నలుమూలల నుండి ప్రజలు అందుబాటులో ఉన్న వాహనాలతో ఉదయానికే పెద్ద సంఖ్యలో సభా ప్రాంగణానికి చేరుకున్నారు. ఇంకా వస్తున్నారు. జనం జోరు, జోష్ చూస్తుంటే అంచనాలకు మించి సభ విజయవంతమౌతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. సభ విజయవంతం కాకుండా అడ్డంకులు సృష్టించాలన్న జగన్ సర్కార్ కుట్ర భగ్నమైందని చెబుతున్నారు. ఈ సభావేదికపై నుంచి తెలుగుదేశం అధినేత, జనసేనాని ఎన్నికల సమరశంఖారావాన్ని పూరిం చనున్నారు. దీంతో ఈ సభపై రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా దేశ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఒకే వేదికను పంచుకోవడం ఇదే ప్రథమం. దీంతో రెండు పార్టీల శ్రేణులు భారీగా హాజరు అవ్వడం ఖాయమంటున్నారు. 110 ఎకరాల విశాల ప్రాంగణంలో జగరనున్న ఈ సభ కోసం 8 అడుగుల ఎత్తులో, 200 అడుగుల పొడవు, 100 అడుగల వెడల్పుతో వేదిక సిద్ధమైంది. ఈ వేదికపై 600 మంది ఆసీనులయ్యే అవకాశం ఉంది. వేదిక ఎదురుగా వీఐపీలు కూర్చుంటారు. ఇక సభను వీక్షించేందుకు ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర నలుమూల నుండి సభకు వచ్చే ప్రజలను తరలించడానికి విశాఖపట్నం, విజయనగరం రైల్వే స్టేషన్ల వద్ద ప్రత్యేక రవాణా సౌకర్యం కల్పించారు. ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుండి వచ్చే వాహనాలకు 2, విశాఖ వైపు నుండి వచ్చే వాహనాలకు 2 భారీ పార్కింగ్ లు సభకు ఇరువైపులా ఏర్పాటు చేశారు. యువగళం, నవశకం సభ ఈ దశాబ్ధపు అతిపెద్ద వేడుక గా తెలుగుదేశం అభివర్ణిస్తున్నది. పోలిపల్లి వద్ద సభ నిర్వహిస్తున్న సందర్భంగా ఆ ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. ప్లెక్సీలు, స్వాగత తోరణాలతో విశాఖపట్నం నుంచి విజయనగరం వరకూ పసుపు జాతరలా మారిపోయింది.
http://www.teluguone.com/news/content/decade-biggest-fest-yuvagalam-navasakam-39-167352.html





