డామిట్ ..భారాస ముహూర్తం అడ్డం తిరిగిందా ?
Publish Date:Oct 18, 2022
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు దేవుడంటే భయం, భక్తి కొంచెం ఎక్కువే. నిజానికి ఆయనే చెప్పుకున్నట్లుగా ఆయన చేసినన్ని యజ్ఞాలు, యాగాలు మరో రాజకీయ నాయకుడు ఎవరూ చేసి ఉండరు. అలాగే, ముహూర్తాలు, శకునాల విషయంలోనూ ఆయనకు గట్టి విశ్వాసం ఉందని అంటారు. అందుకే మంచి చెడులు చూసుకోకుండా ఆయన ఏ నిర్ణయం తీసుకోరు. ఒక్క చిన్న అడుగు కూడా ముందుకు వేయరు. తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పేరును భారత రాష్ట్ర సమితి (భారాస)గా మార్చేందుకు కూడా ఆయన సుముహుర్తం చూసుకున్నారు. దసరా పండగ రోజు మధ్యాహ్నం ఒంటిగంట 19 నిమిషాలకు పేరు మార్పు పత్రాలపై సంతకం చేశారు. అయితే, అంతగా ముహూర్తం చూసుకుని మరీ పేరు మార్చినా అనుకున్నదేదీ జరగడం లేదు. ఫలితం కనిపించడం లేదు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరో అడుగు ముందుకు పడలేదు. కేసేఆర్ సంతకం చేసిన పత్రాలను పార్టీ నాయకులు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆగమేఘాల మీద అందచేశారు. కానీ, పత్రాలు అందుకుని పది రోజులు పైనే అవుతున్నా అటు నుంచి ఎలాంటి స్పందన లేదు. దీంతో మునుగోడు నుంచే భారాస,జాతీయ‘జైత్ర’యాత్రకు శ్రీకారం చుట్టాలనే కేసీఆర్ సంకల్పం నెరవేరలేదు .తొలి అడుగులోనే అపశకునం ఎదురైందా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బారాసాకు ఆదిలోనే హంసపాదు పడిందా అన్న సందేహాలూ వ్యక్తమౌతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలలో గులాబీ పార్టీ అభ్యర్ధి కూసుకుట్ల ప్రభాకర రెడ్డి తెరాస బీ ఫారం మీదనే నామినేషన్ వేయక తప్పలేదు. ఎంత త్వరగా వీలైతే అంట త్వరగా తెలంగాణ పేరును వదిలించుకోవాలని కేసీఆర్ తొందరపడుతున్నా తెలంగాణ మాత్రం ఆయన్ని వదలడం లేదు. అదలా ఉంటే కొందరు జ్యోతిష శాస్త్ర పండితులు భారాస ముహూర్త ఫలంతో పాటుగా కేసేఆర్ జాతక ఫలం జాతీయ రాజకీయాలకు ఏమాత్రం అనుకూలంగా లేదని అంటున్నారు. నిజానికి, జూన్ 29 నుచి, నవంబర్ చివరకు ఉన్న శుక్ర మౌఢ్యం (మూఢమి) కాలం నూతన కార్యం తలపెట్టేందుకు ఎవరికీ, ఏ మాత్రం మంచి కాదని కేసేఆర్ జాతక చక్రం ప్రకారం చూస్తే అసలే పనికి రాదని దత్త పీఠం జ్యోతిష పండితులు దామోదర శర్మ వంటి కొందరు పండితులు, ముందు నుంచి హెచ్చరిస్తూనే ఉన్నారు. అంతే కాకుండా కాదు కూడదని, కేసేఆర్ అదే ముహూర్తానికి తెరాస పేరును బీఆర్ఎస్ గా మారిస్తే ఫలితాలు ప్రతికూలం కావడమే కాకుండా, కేసేఆర్ కుటుంబం మొత్తం కూడా సమస్యలు ఎదుర్కొనక తప్పదని ముందుగానే చెప్పారు. ఇప్పుడిక జరుగతున్న పరిణామాలను గమనిస్తే, పండితుల జ్యోస్యం నిజమవుతున్నట్లే ఉందని పార్టీలో ఫామిలీలో చర్చ మొదలైందని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నిక విషయం ఎలా ఉన్నా ఢిల్లీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు కేసీఆర్ ను సైతం కలవరపాటుకు గురి చేస్తున్నాయని అంటున్నారు. ఓ వంక తెరాస పేరును భారాసగా మార్చడం ఇప్పట్లో అయ్యే పనికాదని అర్థమైపోయింది. మునుగోడు సహా మరి కొన్ని రాష్ట్రాలలో ఉప ఎన్నికలు ఆ వెంటనే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు ఒక దాని వెంట ఒకటి లైన్లో ఉన్న నేపథ్యంలో మరో మూడు నెలల వరకు కేంద్ర ఎన్నికల సంఘం తెరాస పేరు మార్పు వ్యవహారాన్ని పట్టించుకునే పరిస్థతి లేదని అంటున్నారు. అదీ గాక, పేరు మార్పు పై నిర్ణయం తీసుకోవాలంటే ముగ్గురు కమిషనర్ల ఫుల్ బెంచ్ సమావేశం కావాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఒక కమిషనర్ పోస్టు ఖాళీగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆ పోస్టును ఎప్పుడు భర్తీ చేస్తుందో ఎవరికీ తెలియదు. సో తెరాస పేరు భారాసగా ఎప్పుడు మారుతుందో చెప్పలేమని కమిషన్ వర్గాలు చెపుతున్నాయి. పేరు మార్పు ప్రక్రియ మొదలైన తర్వాత, ఇతరులు ఎవరైనా అదే పేరు కోసం దరఖాస్తు చేసుకుని ఉన్నా ఇతరత్రా అభ్యంతరాలు వచ్చిన మళ్ళీ కథ మొదటికి వస్తున్నదని అంటున్నారు. చివరకు కమిషన్ తెరాస అభ్యర్ధనను తిరస్కరించినా తిరస్కరించవచ్చని అంటున్నారు. ఇవన్నీ ఒకెత్తు అయితే ఢిల్లీ లిక్కర్ కుంభ కోణం విచారణ ఎప్పుడు ఏ మలుపు తిరిగుతుందో అనే భయం ఒకటి కేసీఆర్ ను వెంటాడు తోందని అంటున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో కేసీఆర్ కుమార్తె కవిత ఆరోపణలు ఎదుర్కుంటున్నారు. ఒకప్పుడు కవిత వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసినట్లు చెపుతున్న బోయినపల్లి అభిషేక్ ను సిబిఐ అరెస్ట్ చేయడంతో సిబిఐ నెక్స్ట్ టార్గెట్ కవిత కావచ్చని ప్రచారం జరుగుతోంది. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ వారం రోజులకు పైగా ఢిల్లీలో మకాం వేసి కుమార్తె కవితను, సేఫ్ గా బయట పడేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారని అంటున్నారు. మరో వంక, జ్యోతిష పండితులు చెప్పినట్లుగా ఇటు పార్టీలో, అటు ఫ్యామిలీలో కూడా అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తెరాసలో గుబులు మొదలైందని అంటున్నారు. అలాగే ముందు ముందు తెరాసలో పెను మార్పులు తప్పవనీ అంటున్నారు. అది భారాస నామకరణ ముహూర్త బలమో మరొకటో కానీ కేసీఆర్ జాతీయ రాజకీయాలు, అసలుకే మోసం తెచ్చేలా ఉన్నాయని అయితే పార్టీ సీనియర్ నాయకులు సైతం ఆందోళన చెందుతున్నారు. ఇటు పార్టీలో, అటు ఫ్యామిలీలో చోటుచేసుకుంటున్న పరిణామాలు కేసీఆర్ చేయి దాటి పోయాయని, ఒక విధంగా కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడి పడింది అన్నట్లుగా, పరిస్థితులు విషమిస్తున్నాయని పార్టీ నాయకులే అంటున్నారు. అయితే కేసీఆర్ ఏదో చేసి పార్టీని రక్షిస్తారనే విశ్వాసం అయితే ఇంకా మిగిలే ఉందని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/dammit-bharasa-muhurta-has-turned-upside-down--25-145637.html





