వేసవిలో తుఫాను.. ఎండల్లో వానలు..
Publish Date:May 15, 2021
Advertisement
ఎండాకాలం ఎండ. వానాకాలం వాన. ఇది ప్రకృతి సహజం. అప్పుడప్పుడూ వేసవిలోనూ చెదురుముదురు వానలు పడటమూ కామనే. కానీ, ఎండాకాలంలో తుఫాను రావడం మాత్రం అస్సలు కామన్ కానే కాదు. చాలా చాలా అరుదు. ఆ ప్రభావం మన తెలుగు రాష్ట్రాలపైనా ఉండటంతో అంతటా కంగారు. చేతికొచ్చిన పంట నీటి పాలై పోతుందనే టెన్షన్. మామిడి కాయలు రాలిపోతాయనే హైరానా. ఇలా, ఎండాకాలంలో అకస్మాత్తుగా ఊడిపడిన ‘తౌక్టే’ తుఫాన్‌పై సర్వత్రా ఆందోళన. అరేబియా తీరంలో ‘తౌక్టే’ తుఫాన్ ఇండియాపై విరుచుకుపడటానికి రెడీగా ఉంది. లక్ష్య దీప్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన వాయుగుండం బలపడి శుక్రవారం రాత్రి 11:30 గంటలకు తుఫానుగా మారింది. దీని పేరు.. తౌక్టే. శనివారం ఉదయం 5:30 గంటలకు అమిని దీవికి ఈశాన్య దిశగా 160 కి.మీ. దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. ఇది మరింత బలపడి రాగల 12 గంటలలో తీవ్ర తుఫానుగా మారి.. తరువాత ఉత్తర వాయువ్య దిశగా ప్రయాణించనుంది. తదుపరి 12 గంటలలో ఇది మరింత బలపడి అతి తీవ్రతుఫానుగా రూపాంతరం చెందనుంది. ‘తౌక్టే’ తుఫాను గుజరాత్ తీరాన్ని పోర్బందర్ - నలియాల మధ్య 18వ తేదీ సాయంత్రం 2.30 గంటల నుంచి 8.30 గంటల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని చెబుతున్నారు. తౌక్టే తుఫాన్ ప్రభావం ఐదు రాష్ట్రాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దాదాపు 50 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇప్పటికే ఆయా రాష్ట్రాలకు చేరుకున్నాయి. మరోవైపు నావికా దళం కూడా రంగంలోకి దిగింది. తుఫానును ఎదుర్కోవడానికి ప్రభుత్వ యంత్రాంగం సర్వ సన్నద్ధంగా ఉంది.
http://www.teluguone.com/news/content/cyclone-thakte-effect-on-5-states-39-115493.html





