ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులు.. టాప్ ఫైవ్ లో కేసీఆర్
Publish Date:Jul 13, 2022
Advertisement
రాజకీయ నాయకులూ అన్న తర్వాత కేసులు ఉండడం సహజం. అందులోనూ, పుష్కర కాలం పైగా, ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి సారధ్యం వహించిన తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు పై క్రిమినల్ కేసులు ఉండడం, విశేషం కాదు. కానీ, తెలంగాణ ఉద్యమం ముగిసి, రాష్ట్రం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు పూర్తయినా, ఇంకా, అయన పై అనేక కేసులు పెండింగ్ లో ఉన్నాయి. అదలా ఉంచితే.. దేశంలో, అత్యధికంగా క్రిమినల్ కేసులు నమోదైన టాప్ ఫైవ్ ప్రజా ప్రతినిధుల్లో కేసీఆర్ కూడా ఉన్నారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) విడుదల చేసిన నివేదికలో, అత్యధిక క్రిమినల్ కేసులున్న ప్రజాప్రతినిధుల్లో కేసీఆర్ పేరు ఐదవ స్థానంలో వుంది. ఈనెల 18న జరిగే రాష్ట్ర పార్టి ఎన్నికల ఎలక్టోరల్ కాలేజీలో ఓటు హక్కున్న ఎమ్మెల్యేలు, ఎంపీల నేర చరితను, వారిపై ఉన్న కేసుల వివరాలను, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్ల్యూ) సంస్థలు విడుదల చేశాయి. ఈ రెండు ప్రజాస్వామ్య పరిరక్షణ సంస్థలు విడుదల చేసిన నివేదికల ప్రకారం ఎక్కువ క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్న తొలి ఐదుగురిలో తెలంగాణ సీఎం కేసీఆర్ పేరు కూడా ఉంది.. ఏడీఆర్ నివేదొక ప్రకారం, కేసీఆర్ పై 64 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి, అందులో ఇంచుమించుగా సగానికి పైగా (37) తీవ్ర నేరాలకు పాల్పడిన కేసులున్నాయి. అందులో కొన్ని కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. వాటిలో.. మహిళా ఉద్యోగిని విధులను అడ్డుకోవడం, గాయ పరిచే ప్రయతనం చేయడం (ఐపీసీ సెక్షన్-506)కి సంబంధించి నాలుగు కేసులతో పాటుగా హత్యాయత్నానికి సంబంధించి 13 నేరపూరిత బెదిరింపులకు సంబంధించిన కేసులున్నాయి. ప్రభుత్వ ఉద్యోగిని తన విధులు అడ్డుకోవడం, గాయపరచడానికి ప్రయత్నించడానికి సంబంధించిన 4 అభియోగాలు, హత్య ప్రయత్నానికి సంబంధించిన 3 అభియోగాలు, ప్రమాదకరమైన ఆయుధాలు లేదా మార్గాల ద్వారా గాయపరచడానికి సంబంధించిన 3 ఆరోపణలు, ఎవరైనా ఒక వ్యక్తి నుండి దొంగతనంగా లేదా దాడి ద్వారా లేదా నేరపూరిత బలాన్ని ఉపయోగించి దొంగతనానికి పాల్పడి, ఆ వ్యక్తికి హాని కలిగించినా లేదా అతని ప్రాణానికి హాని కలిగించిన, 'స్నాచింగ్స నేరాలకు సంబదించి మూడు అభియోగాలు ఉన్నాయి. మతం, జాతి, పుట్టిన ప్రదేశం, నివాసం, భాష మొదలైన వాటి ఆధారంగా వివిధ సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహించడం, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు సంబంధించిన ఆరోపణలు, ఇలా కేసీఆర్ పై మొత్తం 13 కేసులు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. అయితే ఇందులో చాలా వరకు తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసులే ఉన్నాయి. ఇక ఏడీఆర్, ఎన్ఈడబ్ల్యూ నివేదికల ప్రకారం అత్యధిక క్రిమినల్ కేసులున్న టాప్ ఐదుగురు ప్రజాప్రతినిధుల్లో కేరళ ఎంపీ డీన్ కురియకోస్ 204 కేసులతో మొదటి స్థానంలో ఉన్నారు. 99 పెండింగ్ కేసులతో తమిళనాడుకు చెందినా డీఎంకే ఎంపీ ఎస్.కతిరవన్ రెండో స్థానంలో ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే మహ్మద్ ఆజం ఖాన్ 87 కేసులతో మూడో స్థానంలో ఉన్నారు. మరో తమిళనాడు ఎమ్మెల్యే ప్రిన్స్ జేజీ 73 కేసులతో నాలుగో స్థానంలో ఉండగా, 64 క్రిమినల్ కేసులతో తెలంగాణ సీఎం కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు.
http://www.teluguone.com/news/content/criminal-cases-on-politicians-list-kcr-in-top-five-25-139630.html





