క్వాష్ పిటిషన్ విచారణను కోర్టు వాయిదా వేసిందంతే!
Publish Date:Jun 27, 2025
Advertisement
సింగయ్య మతి కేసులో ఏ2గా ఉన్నజగన్ దాఖలు చేసుకున్న క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు జులై 1కి వాయిదా వేసింది. ఆ సందర్భంగా అప్పటి వరకూ జగన్ పై ఎటువంటి తొందరపాటు చర్యలూ తీసుకోవద్దని పోలీసులను ఆదేశించింది. సాధారణంగా బెయిలు పిటిషన్లు, క్వాష్ పిటిషన్ల విచారణ వాయిదా వేసే సందర్భంగా కోర్టులు ఇటువంటి ఆదేశాలు ఇస్తుంటాయి. అంత మాత్రాన ఆయా కేసులలో పిటిషన్లు దాఖలు చేసుకున్న వారు నిర్దోషులని కోర్టులు తీర్పు ఇచ్చినట్లు కాదు. కానీ జగన్ క్వాష్ పిటిషన్ విషయంలో మాత్రం వైసీపీ క్వాష్ పిటిషన్ విచారణ వాయిదా వేసి జగన్ పై తదుపరి విచారణ వరకూ ఎటువంటి చర్యలూ తీసుకోవద్దన్న కోర్టు ఆదేశాలకు తనదైన భాష్యం చెప్పు కుంటోంది. కోర్టు ఆదేశాలను జగన్ నిర్దోషి అని కోర్టు తీర్పు వెలువరించేసిందన్నట్లుగా ప్రచారం చేసుకుంటోంది. వాస్తవానికి జరిగిందేమిటంటే.. జగన్ క్వాష్ పిటిషన్ ను పూర్తిగా పరిశీలించకుండానే కోర్టు కేసు విచారణను వాయిదా వేసింది. వాస్తవానికి జగన్ పల్నాడు యాత్రకు పోలీసులు 100 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారు. అయినా దానిని ధిక్కరించి, నిబంధనలను తుంగలోకి తొక్కి జగన్ వేలాది మందితో బలప్రదర్శనకు వచ్చినట్లు ఆ పర్యటనకు వచ్చారు. ఆ సందర్భంగా సింగయ్య ఆయన కారు కిందే పడి మరణించారు. ఇవన్నీ వాస్తవాలే.. జగన్ క్వాష్ పిటిషన్ విచారణలో ఈ విషయాన్నీ చర్చకు, ప్రస్తావనకు వస్తాయి. కోర్టు విచారణను జులై 1కి వాయిదా వేయగానే జగన్ కు కేసు నుంచి విముక్తి వచ్చేసిందంటూ వైసీపీ పండుగ చేసుకోవడం విడ్డూరంగా ఉంది. జులై 1 వరకూ మాత్రమే కోర్టు జగన్ కు అరెస్టు నుంచి రక్షణ కల్పించింది. ఈ రోజు జగన్ క్వాష్ పిటిషన్ ను విచారించి తీర్పు వెలువరిస్తుంది. అప్పుడు జగన్ క్వాష్ పిటిషన్ ను కోర్టు కొట్టి వేస్తే అరెస్టు నుంచి మినహాయింపు పోయినట్లే. ఆ విషయాన్ని పరిగణ నలోనికి తీసుకోకుండా ఇప్పుడే పండుగ చేసుకోవడం ఇల్లు అలికేసి పండగ వచ్చేసింనుకోవడమే.
http://www.teluguone.com/news/content/court-only-adjourned-jagan-quash-petition-39-200787.html





