వంశీ బెయిలు పిటిషన్ పై విచారణ వాయిదా
Publish Date:Mar 6, 2025
Advertisement
బెయిలు కోసం వల్లభనేని మరి కొన్ని రోజులు నిరీక్షించక తప్పదు. గన్నవరం తెలుగుదేశం కార్యాలయంపై దాడి కేసులో ఫిర్యాదు దారుడు సత్వవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదరించిన కేసులో గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్టై.. విజయవాడ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన దాఖలు చేసుకున్న బెయిలు పిటిషన్ పై విజయవాడ ఎస్టీఎస్టీ కోర్టు గురువారం విచారణ జరిపింది. అయితే వల్లభనేని వంశీకి బెయిలు ఇస్తే సాక్ష్యులను ప్రభావితం చేయడమే కాకుండా, కీలక ఆధారాలను తారుమారు చేసే అవకాశం ఉందంటూ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు విన్న వించారు. వల్లభనేని వంశీకి కస్టడీలో ప్రశ్నించిన సందర్భంగా కీలక సమాచారం వెల్లడైందని చెప్పిన ఆయన.. వల్లభనేని వంశీ ఆదేశాల మేరకే సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసినట్లు ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు వెల్లడించారని, ఈ నేపథ్యంలో వంశీకి బెయిలు ఇవ్వవద్దనీ ఆయన కోర్టులో వాదించారు. అంతే కాకుండా వంశీని మరో పది రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని కోరారు. కాగా వంశీ తరఫు న్యాయవాది.. సత్యవర్ధన్ కిడ్నాప్‌తో వంశీకి ఎటువంటి సంబంధం లేదని వాదించారు. వంశీ అరెస్టు ప్రభుత్వ ప్రతీకార చర్యలో భాగమేనని పేర్కొన్నారు. ఇరు వైపు వాదనలూ విన్న తరువాత కోర్టు తదుపరి విచారణను ఈ నెల 10కి వాయిదా వేసింది.
http://www.teluguone.com/news/content/court-adjourns-hearing-of-vamshi-bail-petition-39-193976.html





