కాకాణిపై 7 కేసులు.. విల్లాలో శవం.. ఎస్పీ ఫేక్ స్టోరీ!.. మంత్రిపై ఫుల్ కాంట్రవర్సీ..
Publish Date:Apr 18, 2022
Advertisement
ఇటీవల ఎవరిపై ఇంత రచ్చ జరగలేదు. ఇటీవల ఏ కేసులోనూ ఇంత సంచలనం నెలకొనలేదు. ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. రోజుల వ్యవధిలోనే ఏకంగా కోర్టులోనే దొంగతనం జరిగింది. మంత్రి కేసు తాలూకూ సాక్షాధారాలు మాత్రమే ఎత్తుకెళ్లారు. దొంగలు దొరికినా.. వారికి రాజకీయ సంబంధం లేదని తేల్చారు. కట్ చేస్తే.. అదే మంత్రి కాకాణి విల్లాలో ఓ వ్యక్తి అనుమానాస్పదంగా చనిపోయాడు. ఇలా, సినిమాటిక్‌గా సాగుతున్న మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి ఎపిసోడ్ పొలిటికల్‌గా ఫుల్ కాంట్రవర్సీగా మారింది. ఓవైపు మాజీ మంత్రి అనిల్‌కుమార్.. పోటీ సభలు, ప్రెస్‌మీట్లు, సర్వేపల్లిలో పర్యటనలతో కాకాణిని సవాల్ చేస్తుంటే.. మరోవైపు, వరుస ఘటనలు కొత్త మంత్రిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. తాజాగా, టీడీపీ సైతం రంగంలోకి దిగి.. కాకాణిని అనుమానాలు, ప్రశ్నలతో కుమ్మేయడంతో.. కాకాణికి మంత్రి అయ్యాననే సంతోషమే లేకుండా పోయింది. కాకాణి గోవర్థన్ రెడ్డి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అరాచక పర్వానికి తెర తీశారని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. కాకాణి ఏడు కేసుల్లో ముద్దాయని గుర్తు చేశారు. నెల్లూరు కోర్టు చోరీపై చాలా అనుమానాలు ఉన్నాయన్నారు. సెలవు రోజు కోర్టు ఉద్యోగి.. కోర్టుకు ఎందుకు వెళ్లాడని ప్రశ్నించారు. కాలువలో సంచి ఉన్నట్లు ఎలా చెప్పాడన్నారు. ఎస్పీ కల్పిత కధ అల్లారని, వేల కేసుల ఫైల్స్ ఉంటే కేవలం కాకాణి కేసుకు చెందిన ఆధారాలున్న బీరువా మాత్రమే దొంగలకు కనిపించిందా? అని నిలదీశారు. ప్రభుత్వ పెద్దల సహకారం లేకుండా చోరీ జరగలేదని ధూళిపాళ్ల అనుమానం వ్యక్తం చేశారు. "మంగళగిరిలోని కాకాణి విల్లాలో మహమ్మద్ అనే వ్యక్తి చనిపోయారు. ఏసీ మెకానిక్ మహమ్మద్ మృతిపై చాలా అనుమానాలున్నాయి. మహమ్మద్ మృతికి.. చోరీ కేసుకు ఉన్న సంబంధమేంటి? సుమోటోగా న్యాయమూర్తులే సీబీఐ విచారణ జరిపించాలి. పోలీసులు దర్యాప్తుతో ఎలాంటి ఉపయోగం ఉండదు" అని ధూళిపాళ్ల నరేంద్ర అన్నారు. మరోవైపు, విల్లాలో శవం వ్యవహారం కాకాణి మెడకు చుట్టుకుంటోంది. మంగళగిరిలో మంత్రి కాకాణి గోవర్ధనరెడ్డికి చెందిన విల్లాలో ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. శనివారం ఉదయం మరణించగా, ఆదివారం ఉదయం వరకు విషయం గోప్యంగా ఉంచారు. విద్యుత్ షాక్‌తో చనిపోయాడని పోలీసులు చెబుతుండగా, హత్య చేశారని యువకుడి బంధువులు ఆరోపించారు. ఘటనపై దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. ఆందోళన చేపట్టేందుకు బంధువులు సిద్ధమమగా.. మంత్రి పీఏ రంగప్రవేశం చేసి స్థానిక వైసీపీ నేతల సాయంతో మృతుడి కుటుంబీకులతో బేరాలకు దిగినట్టు తెలుస్తోంది. మృతుడి కుటుంబీకులు రూ.12 లక్షలు ఇవ్వాలని పట్టుబట్టగా.. చివరకు 6 లక్షలకు ఒప్పించారు. అందులో మంత్రి కాకాణి 3 లక్షలు, మెకానిక్ షాపు యజమాని షేక్ యూసూబ్ 3 లక్షలు ఇచ్చేలా డీల్ కుదిరినట్టు సమాచారం.
http://www.teluguone.com/news/content/controversy-over-minister-kakani-25-134578.html





