అమెరికా అధ్యక్షుడు సహా అగ్రనేతల హత్యలకు కుట్ర
Publish Date:Apr 25, 2026
Advertisement
అమెరికా రాజకీయ యవనికపై పెను సంచలనం సృష్టించిన బహుళ హత్యల కుట్ర కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అమెరికా ప్రస్తుత, మాజీ అధ్యక్షులతో పాటు పలువురు కీలక నేతలను అంతమొందించేందుకు పథకం రచించిన పాకిస్థానీ పౌరుడు ఆసిఫ్ రజా మెర్చంట్‌ను న్యూయార్క్ జ్యూరీ దోషిగా నిర్ధారించింది. ఇరాన్ ప్రభుత్వ అధికారిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్జీసీ) కనుసన్నల్లోనే ఈ హత్యలకు ప్రణాళికలు సిద్ధమైనట్లు విచారణలో తేలింది. ఇది కేవలం ఒక నేరపూరిత చర్య మాత్రమే కాదని, అమెరికా ప్రజాస్వామ్య మూలాలపై జరిగిన దాడిగా అధికారులు అభివర్ణిస్తున్నారు. 48 ఏళ్ల ఆసిఫ్ రజా వ్యాపారవేత్త ముసుగులో అమెరికాలోకి ప్రవేశించి ఈ వినాశకర మిషన్‌ను ప్రారంభించాడు. విచారణ సంస్థల కథనం ప్రకారం, 2022 నుంచే ఇరాన్ ఇంటెలిజెన్స్ నెట్‌వర్క్‌తో సంబంధాలు కలిగి ఉన్నాడు. గూఢచర్యంతో పాటు కౌంటర్ సర్వైలెన్స్‌లో శిక్షణ పొందిన ఇతడు, దుస్తుల వ్యాపారం, బ్యాంకింగ్ అవసరాల నిమిత్తం పాకిస్థాన్, ఇరాన్, అమెరికా దేశాల మధ్య తరచూ ప్రయాణించేవాడు. అయితే.. ఈ ముసుగు వెనుక అమెరికా రాజకీయాలను అస్థిరపరచాలనే భారీ కుట్ర దాగి ఉందని ఎఫ్‌బీఐ ఆధారాలతో సహా నిరూపించింది. 2024 ఏప్రిల్‌లో అమెరికా చేరుకున్న మెర్చంట్.. అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే హింసను ప్రేరేపించాలని ప్లాన్ చేశాడు. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్, జో బైడెన్, నిక్కీ హేలీ వంటి అగ్రనేతలను లక్ష్యంగా చేసుకున్నట్లు కోర్టు విచారణలో వెల్లడైంది. హత్యలు చేయడమే కాకుండా, అల్లర్లు సృష్టించడం, నిరసనల ద్వారా గందరగోళం రేపడం ఇతని ప్రధాన ఉద్దేశం. ఇందుకోసం న్యూయార్క్‌లో కిరాయి హంతకుల కోసం అన్వేషణ ప్రారంభించి, నదీమ్ అలీ అనే వ్యక్తిని సంప్రదించాడు. అయితే.. అలీ వెంటనే అప్రమత్తమై అమెరికా దర్యాప్తు సంస్థలకు సమాచారం అందించడంతో ఈ రహస్య ఆపరేషన్ వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో అమెరికా గూఢచారి విభాగాలు అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాయి. ఎఫ్‌బీఐ ఏజెంట్లు కిరాయి హంతకులుగా మారి మెర్చంట్‌ను కలవగా.. అతడు తన ప్రణాళికలను నాప్‌కిన్‌పై బొమ్మలు గీసి వివరించాడు. భద్రతా ఏర్పాట్లు, ర్యాలీలలో కాల్పులు జరపాల్సిన పద్ధతులపై స్పష్టమైన ఆదేశాలిచ్చాడు. ముందస్తు ఖర్చుల కింద 5,000 డాలర్ల నగదును కూడా అందజేశాడు. సంభాషణల్లో 'ఫ్లీస్ జాకెట్' అంటే హత్య అని, 'టీ-షర్ట్' అంటే అల్లర్లు అని కోడ్ వర్డ్స్ ఉపయోగించినట్లు ఫోన్ డేటా ద్వారా నిరూపితమైంది. పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద మూలాలు ఇప్పుడు ఇరాన్ ప్రయోజనాల కోసం పనిచేస్తున్నాయనే అంశం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో చర్చనీయాంశమైంది. అల్-ఖైదా, లష్కరే తోయిబా వంటి సంస్థలకు నిలయంగా ఉన్న పాకిస్థాన్.. ఇప్పుడు ఇరాన్ ప్రాక్సీ'ఆపరేషన్లకు వేదికగా మారుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఒకవైపు పాకిస్థాన్‌ను భద్రతా భాగస్వామిగా చూస్తూనే, మరోవైపు ఆ దేశ పౌరులే అమెరికా అధ్యక్షులపై దాడులకు సిద్ధపడటం అమెరికా విదేశాంగ విధానంపై కొత్త ప్రశ్నలను లేవనెత్తింది. బ్రూక్లిన్‌లోని ఫెడరల్ కోర్టులో జరిగిన విచారణలో, తాను తన కుటుంబ రక్షణ కోసమే ఇదంతా చేశానని మెర్చంట్ వాదించినప్పటికీ, జ్యూరీ అతని వాదనలను తోసిపుచ్చింది. మార్చి 6, 2026న అతడిని దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువడింది. దేశ సరిహద్దులు దాటి ఉగ్రవాద చర్యలకు పాల్పడటం, హత్యలకు కుట్ర పన్నడం వంటి అభియోగాల కింద అతనికి జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. అమెరికా భూభాగంపై అగ్రనేతలను హతమార్చాలనే శత్రుదేశాల ప్రయత్నాలను తమ చట్టవ్యవస్థ సమర్థవంతంగా అడ్డుకుందని అమెరికా అటార్నీ జనరల్ ప్రకటించారు. ఈ పరిణామం భవిష్యత్తులో విదేశీ ప్రయాణికుల స్క్రీనింగ్ మరియు వీసా నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా అడుగులు వేస్తోంది. - సీతారాం కంఠంనేని
http://www.teluguone.com/news/content/conspiracy-to-assassinate-top-leaders-36-218220.html





