జగన్‌ని దువ్వుతున్న కాంగ్రెస్
Publish Date:Aug 25, 2014
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇటు తెలంగాణలో అడ్డంగా ఆరిపోయింది. ఆంధ్రప్రదేశ్‌లో అయితే తిరిగి ఎప్పటికీ వెలగడానికి వీల్లేని విధంగా ఆరిపోయింది. అధికారం కోల్పోయి మూడు నెలలు అవుతున్నా ఇప్పటి వరకు అక్కడ కాంగ్రెస్ పార్టీని పట్టించుకున్నవాళ్ళే లేరు. చరిత్రలో ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ అనే పార్టీ పాలించిందన్న విషయం కూడా జనం గుర్తు చేసుకోవడం లేదు. ఎప్పుడైనా కాంగ్రెస్ పార్టీ ప్రస్తావన వచ్చిందంటే, అది కూడా కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని గుర్తు చేసుకోవడానికి తప్ప మరొకందుకు కాదు. చింత చచ్చినా పులుపు చావలేదన్నట్టు ఆంధ్రప్రదేశ్‌కి తీరని ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి అధికారం చచ్చినా ఆంధ్రప్రదేశ్ మీద ఆశ చావలేదు. పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలన్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌లో మళ్ళీ అధికారం సాధించాలని కలలు కంటోంది. ఆ కలలను నిజం చేసుకోవడం కోసం అయిదేళ్ళ ముందు నుంచే ప్రయత్నాలు ప్రారంభిస్తోంది. ఘోర పరాజయంతో కుక్కినపేనుల్లా పడి వున్న నాయకులు అడపాడదపా బురదపాముల్లా తలలెత్తి తెలుగుదేశం పార్టీ మీద ఓసారి బుస్సుమని మళ్ళీ మన్నుతిన్న పాముల్లా వుండిపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గురించి తామెంత గొంతు చించుకుని అరిచినా ప్రజలు పట్టించుకోని తెలిసినా తన విఫల ప్రయత్నాలు చేస్తూనే వున్నారు. ఇన్ని విఫల యత్నాలు ఎందుకని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఐడియా వచ్చింది. తమ పార్టీ దత్తపుత్రుడు జగన్ ఉండగా తమకెందుకు టెన్షన్ అనుకున్నట్టుంది. అందుకే జగన్‌ని దువ్వే ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఆ ప్రయత్నాల్లో భాగమే మొన్న దిగ్విజయ్ సింగ్ హైదరాబాద్ వచ్చినప్పడు కాంగ్రెస్ సమావేశంలో వైఎస్ రాజశేఖరరెడ్డిని విపరీతంగా పొగడ్డం. మొన్నటి వరకూ రాజశేఖరరెడ్డిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు సడెన్‌గా వైస్సార్ భజన మొదలు పెట్టడానికి గల ప్రధాన కారణం జగన్ అండతో ఆంధ్రప్రదేశ్‌లో పాగా వేయడమేనని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/congress-part-ysr-congress-party-jagan-45-37595.html





