మాటల గారడీ చేస్తున్నకాంగ్రెస్ పార్టీ
Publish Date:Oct 2, 2013
Advertisement
యూపీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను ప్రజాభీష్టం మేరకు కేంద్ర మంత్రి మండలి రద్దు చేస్తున్నట్లు కేంద్ర మంత్రి మనిష్ తివారీ మీడియాకు తెలియజేసారు. “తమ ప్రభుత్వం ప్రజాభీష్టం మేరకే నడుచుకొంటుందని, ప్రజాభిప్రాయానికి అత్యంత గౌరవం ఇస్తుందని, అందుకే ప్రభుత్వం ఆర్డినెన్స్ ను రద్దు చేసిందని ఆయన మీడియాకు తెలియజేసారు. ఆయన చిలకలా చాలా చక్కగా పడికట్టు పదాలు కొన్ని వల్లె వేసారు. కానీ అలా ఎందుకు చేయవలసి వచ్చిందో అందరికీ తెలుసు. అయితే ఈ ప్రకటన చేస్తున్నపుడు ఆయన చెప్పిన మాటలు మరికొన్ని కొత్త ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. ఆయన చెప్పినట్లు రాహుల్ గాంధీ ఆక్షేపించడం వలన కాక, నిజంగా ప్రజాభీష్టం మేరకే యుపీయే ప్రభుత్వం నిర్ణయాలు తీసుకొనేమాటయితే, మరి గత రెండు-మూడేళ్ళుగా తెలంగాణా ప్రజలు ఉద్యమాలు చేస్తున్నపుడు ప్రభుత్వం వెంటనే ఎందుకు స్పందించలేదు? మళ్ళీ గత రెండు నెలలుగా లక్షలాది సీమంధ్ర ప్రజలు రాష్ట్రాన్ని విభజించవద్దని ఉద్యమాలు చేస్తుంటే, ఎట్టి పరిస్థితుల్లో మా నిర్ణయం మారదని అంత ఖరాఖండిగా ఎందుకు చెపుతున్నారు? రాష్ట్ర సమస్యలను పరిష్కరించడానికి మిగిలిన అన్ని రాష్ట్రాలకు చెందిన నేతల సలహాలు తీసుకొంటున్న కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రానికి చెందిన నేతలను ఎందుకు లెక్కలోకి తీసుకోవడం లేదు? అసలు కాంగ్రెస్ హై కమాండ్ లో ఒక్క తెలుగు వాడికి కూడా ఎందుకు చోటు కల్పించలేదు? పార్టీలో అత్యంత సీనియర్ నేత, కేంద్ర మంత్రి, మేధావి అయిన జయపాల్ రెడ్డి వంటి వ్యక్తిని కూడా ఎందుకు పరిగణనలోకి తీసుకోదు? రాష్ట్ర సమస్యలను పరిష్కరించలేకపోతే కనీసం ప్రజలతో మాట్లాడాలని కూడా ఇంతకాలం ఎందుకు ప్రయత్నం కూడా ఎందుకు చేయలేదు? అంటే లక్షలాది ప్రజల మాట కంటే, ఒక్క రాహుల్ గాంధీ మాటే కాంగ్రెస్ పార్టీకి, యుపీయే ప్రభుత్వానికి ముఖ్యమని, దానికే ప్రాధాన్యం ఇస్తుందని అర్ధం అవుతోంది. ఇక నుండి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీని ‘అవినీతి నిరోధక మహాశయా’ అని కీర్తించవచ్చు. కానీ, రాజకీయాలలో అవినీతికి వ్యతిరేఖంగా గొంతెత్తి ప్రభుత్వ నిర్ణయాలు మార్చుకోనేలాచేయగలిగిన ఆయన, అదే చొరవను రాష్ట్ర ప్రజల సమస్యల పట్ల ఎందుకు చూపడం లేదు? అదేవిధంగా గత రెండు మూడేళ్ళుగా రాష్ట్రం ఉద్యమాలతో అతలాకుతలమవుతున్నపటికీ ఆయన ఈ విషయంతో తనకు అసలు సంబంధం లేనట్లు ఎందుకు వ్యవహరిస్తున్నారు? ఆయనకు ఇష్టమున్నా లేకునా కాంగ్రెస్ పార్టీ ఆయనను ప్రధాని కుర్చీలో కూర్చోబెట్టుకోవాలని తహతహలాడుతోంది. అటువంటప్పుడు ఆయన తప్పనిసరిగా యావత్ దేశ సమస్యల పట్ల స్పందించవలసి ఉంటుందని తెలుసుకోవాలి.
http://www.teluguone.com/news/content/congress-37-26302.html





