400 కంటెంప్ట్ కేసులప్పుడు మౌనం.. ఇప్పుడు హైడ్రాపై విమర్శలా..? : సీఎం రేవంత్
Publish Date:Jul 28, 2026
Advertisement
సోమేశ్ కుమార్‌పై 400 కంటెంప్ట్ కేసులప్పుడు బీఆర్‌ఎస్ మౌనం ఎందుకు..! ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌ను కలిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. చెరువులు, నాలాలు, కుంటలు, ప్రభుత్వ భూములు, ప్రభుత్వ పార్కులను కబ్జా చేసుకున్న వారు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్టు అంటున్నారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కింద అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే, గతంలో సోమేశ్ కుమార్‌పై 400 కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసులు ఉన్నప్పుడు ఎందుకు మాట్లాడలేదని ఆయన ప్రశ్నించారు. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వ విచక్షణాధికారమని, ఆ అధికారాన్ని ఎవరూ లాక్కోలేరని సీఎం స్పష్టం చేశారు. న్యాయస్థానాలపై తనకు సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. హైడ్రా మంచి పనులు చేస్తోందని, తమ ప్రభుత్వం తీసుకొచ్చిన గొప్ప సంస్కరణల్లో హైడ్రా ఒకటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైడ్రా అత్యుత్తమ సంస్థల్లో ఒకటని, ప్రభుత్వ పార్కులు, చెరువులు, కుంటలు, నాలాలను కాపాడటమే దాని బాధ్యత అని, ఆ పనిని హైడ్రా పకడ్బందీగా నిర్వహిస్తోందని చెప్పారు. బతుకమ్మ కుంటను బీఆర్ఎస్ నేతలు కబ్జా చేశారని, దానిపై కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కేసు వేశారని సీఎం విమర్శించారు. ఆ కుంట పేరు బతుకమ్మ కుంట అని, దానిపై కేసు కొనసాగుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారాలను ఎలా చూడాలని ఆయన ప్రశ్నించారు. హైడ్రా పనిచేయకుండా అడ్డుకోవాలని చూస్తున్న కబ్జాదారులకు సహకరించవద్దని సీఎం రేవంత్ రెడ్డి మీడియాకు విజ్ఞప్తి చేశారు."హైడ్రా ఎన్ కన్వెన్షన్‌ను కూలగొట్టింది.. అది పేదోళ్లదా? గండిపేట చెరువులో ఆక్రమణలను తొలగించింది.. అవి పేదోళ్లవా? బతుకమ్మ కుంటను ఆక్రమించుకున్న వాళ్లు పేదోళ్లా?" అని సీఎం ప్రశ్నించారు. కబ్జాదారులను కాపాడేందుకు డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయిస్తూ ప్రభుత్వాన్ని బదనాం చేయాలని కొందరు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. హైడ్రా కార్యకలాపాలపై, అది నిర్వహిస్తున్న బాధ్యతలపై ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన ఉందని సీఎం తెలిపారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఇంకా పరిశీలించలేదని, ప్రభుత్వ పరంగా సమీక్షిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కోర్టు ఆదేశాలను, న్యాయస్థానాలను గౌరవిస్తామని, అదే సమయంలో హైడ్రా కొనసాగిస్తున్న పనులను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
CM Revanth Reddy, Somesh Kumar, 400 Contempt of Court cases, Contempt of Court, HYDRA,
HYDRA criticism, HYDRA operations, BRS Party ,KTR, KCR
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-36-227403.html





