కార్యకర్తల కృషితోనే తెలంగాణలో అధికారం : మల్లికార్జున ఖర్గే
Publish Date:Jul 4, 2025

Advertisement
గతంలో అమెరికా బెదిరించినా మాజీ ప్రధాని ఇందిరా గాంధీ భయపడలేదని, కానీ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఫోన్ చేయగానే పాకిస్థాన్‌తో యుద్ధాన్ని ప్రధాని మోదీ ఆపేశారని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన ‘కాంగ్రెస్ సామాజిక న్యాయ సమరభేరి’ సభలో మాట్లాడుతు ఆపరేషన్ సింధూర్‌కు లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు తెలిపిందని, అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాకిస్థాన్‌తో యుద్ధాన్ని మధ్యలోనే నిలిపివేశారని ఆయన అన్నారు.
దేశం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ ప్రాణ త్యాగం చేశారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ నుంచి ఒక్కరైనా దేశం కోసం ప్రాణాలను అర్పించారా అని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోదీ, అమిత్ షా అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కృషితోనే అధికారంలోకి వచ్చిందని ఖర్గే పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, డీప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సమష్టిగా పనిచేసి బీఆర్ఎస్‌ను ఓడించారని ప్రశంసించారు. మాజీ సీఎం కేసీఆర్ తన పాలనలో రైతులను, మహిళలను, నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే 60 వేల ప్రభుత్వ ఉద్యోగ నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ప్రధాని మోడీ, కేసీఆర్, కేటీఆర్ దీనిపై చర్చ పెట్టాలని, ఒక్క ఉద్యోగం తక్కువ ఇచ్చినట్టు నిరూపించినా వారి కాళ్ళ ముందు క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని సవాల్ విసిరారు.గత బీఆర్ఎస్ పాలనలో యువతను గొర్రెలు, బర్రెలు కాయాలని, చెప్పులు కుట్టుకోవాలని, చేపలు పట్టుకోవాలని వారి కులవృత్తుల్లోకి మళ్ళీ వాళ్ళని నెట్టాలని చూశారని ముఖ్యమంత్రి అన్నారు
http://www.teluguone.com/news/content/cm-revanth-reddy-39-201295.html












