కర్నాటకం.. సీఎం మార్పు ఖాయమేనా?
Publish Date:May 26, 2026
Advertisement
కర్ణాటక రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించడం ఎవరికైనా కష్టమే. గత కొంతకాలంగా ముఖ్యమంత్రి పీఠం చుట్టూ తిరుగుతున్న అంతర్గత రాజకీయాలు ఇప్పుడు కీలక మలుపు తిరిగాయి. కర్ణాటక తదుపరి సీఎం ఎవరనే ఉత్కంఠకు తెరదించుతూ, కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌కు కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ వాద్రా పూర్తి మద్దతు ప్రకటించినట్లు ప్రచారం సాగుతోంది. 2023 మేలో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య సీఎం పదవి కోసం గట్టి పోటీ నెలకొంది. పార్టీ హైకమాండ్ మధ్యవర్తిత్వంతో రెండున్నరేళ్ల రొటేషనల్ పవర్ షేరింగ్ ఒప్పందం కుదిరిందని, అందులో భాగంగానే సిద్ధరామయ్యకు మొదట అవకాశం ఇచ్చారని డీకే శివకుమార్ అనుచరులు గట్టిగా చెప్తున్నారు. ఇప్పుడు సిద్ధరామయ్య మూడేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకుంటున్న తరుణంలో, ముఖ్యమంత్రి పీఠాన్ని డీకే శివకుమార్‌కు అప్పగించాలనే డిమాండ్ జోరందుకుంది. డీకే శివకుమార్ పార్టీ కోసం చేసిన కష్టాన్ని, ఆయనకున్న వ్యూహాత్మక చతురతను కాంగ్రెస్ అధిష్టానంలోని కొందరు ప్రముఖులు బలంగా సమర్థిస్తున్నారు. ముఖ్యంగా సోనియా గాంధీ, ప్రియాంకా గాంధీ ఇద్దరూ డీకే శివకుమార్ పట్ల సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తోంది. కర్ణాటకలో పార్టీని క్షేత్రస్థాయి నుంచి బలోపేతం చేయడంలో కేపీసీసీ అధ్యక్షుడిగా డీకే శివకుమార్ పోషించిన పాత్ర చాలా ముఖ్యమనీ, ఒడుదొడుకులు ఎదురైన ప్రతిసారీ పార్టీని ఆర్థికంగా, వ్యూహాత్మకంగా ఆదుకున్న ట్రబుల్ షూటర్ ఆయనేనీ అంటున్నారు. 2023 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం డీకే శివకుమార్‌కు రూ. 1,413.80 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. 2018లో ఈ ఆస్తుల విలువ రూ. 840.01 కోట్లుగా ఉండగా, అది ఐదేళ్లలో భారీగా పెరిగింది. ఇందులో రూ. 1,140.38 కోట్ల స్థిరాస్తులు, రూ. 273.41 కోట్ల చరాస్తులు ఉన్నాయి. అలాగే ఆయనకు రూ. 265.06 కోట్ల అప్పులు, ఏడాదికి రూ. 14.4 కోట్ల వార్షిక ఆదాయం ఉంది. ఐటీ, ఈడీ, సీబీఐ వంటి సంస్థల ద్వారా దాదాపు 19 కేసులు ఎదుర్కొంటున్నప్పటికీ, ఆయన పార్టీ లైన్‌ను దాటకుండా నమ్మకంగా నిలబడ్డారు. అందుకే ఆయన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కాలని, సీఎం కుర్చీ ఆయనకే ఇవ్వాలని ప్రియాంకా గాంధీ గట్టిగా అభిప్రాయపడుతున్నట్లు సమాచారం. అయితే, ఈ అధికార మార్పిడి అంత సులభంగా సాగేలా కనిపించడం లేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఒక బలమైన ఓబీసీ నాయకుడు కావడంతో.. ఆయనను అకస్మాత్తుగా పదవి నుంచి తప్పిస్తే పార్టీ ఇమేజ్‌కు భంగం కలుగుతుందేమోనని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. సిద్ధరామయ్యను రాజ్యసభకు పంపి, కేంద్ర రాజకీయాల్లోకి తీసుకురావాలనే ఒక సరికొత్త వ్యూహాన్ని అధిష్టానం పరిశీలిస్తోందంటున్నారు. బీహార్‌లో నితీష్ కుమార్ సీఎం పదవి వదిలి రాజ్యసభకు వెళ్లిన తరహాలోనే, కర్ణాటకలోనూ అధికార బదిలీ ఫార్ములాను అమలు చేయాలని కాంగ్రెస్ అగ్రనాయకులు భావిస్తున్నారు. కానీ సిద్ధరామయ్య మాత్రం తన స్థానంలో డీకే శివకుమార్ రావడాన్ని అంతగా ఇష్టపడటం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. కర్ణాటకలోని బొక్కలిగ సామాజిక వర్గంలో డీకే శివకుమార్‌కు ఉన్న పట్టు, బూత్ స్థాయి కార్మికులను నడిపించే నైపుణ్యం పార్టీకి శ్రీరామరక్ష అని ప్రియాంక వాదిస్తున్నారు. రాబోయే రోజుల్లో కేరళ, తమిళనాడు, అస్సాం అసెంబ్లీ ఎన్నికలు ఉన్నందున, దక్షిణాదిలో కీలకమైన కర్ణాటకలో ఎలాంటి అస్థిరత రాకూడదని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే డీకే శివకుమార్ ఓపిక ఎల్లప్పుడూ మంచి ఫలితాన్ని ఇస్తుంది అని వ్యాఖ్యానించడం విశేషం. ప్రియాంకా గాంధీ అండతో డీకే శివకుమార్ అనుకున్నది సాధిస్తారా, లేదా సిద్ధరామయ్య తన పీఠాన్ని కాపాడుకుంటారా అన్న చర్చ కర్నాటక రాజకీయాలలో జోరుగా సాగుతోంది.
http://www.teluguone.com/news/content/cm-change-in-karnataka-39-220944.html




