భారత్‌కు ఎకనమిక్ పవర్ హౌస్‌గా ఆంధ్రప్రదేశ్ : సీఎం చంద్రబాబు

Publish Date:Jun 16, 2026

Advertisement

 

భూమి, నీరు, మౌలిక వసతులు, అత్యుత్తమ పాలసీలతో పెట్టుబడులకు ఏపీ అత్యంత అనుకూల స్థానమని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయడు అన్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు ఏపీదే పేటెంట్ అని, పెట్టుబడులకు ఎంతో సురక్షితమని స్పష్టం చేశారు. ఈ ఏడాది విశాఖలో తలపెట్టిన పార్టనర్షిప్ సమ్మిట్‌కు సన్నాహకంగా సింగపూర్‌లో సీఐఐ నిర్వహించిన బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ... ‘సింగపూర్‌తో భారత్‌కు, ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌కు మంచి సంబంధాలున్నాయి. 

సింగపూర్ నిర్మాత లీ క్వాన్ యూ అంటే నాకు చాలా అభిమానం. 3 దశాబ్దాలుగా సింగపూర్‌తో కలిసి పనిచేస్తున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్‌లో సింగపూర్ టౌన్ షిప్‌నే నిర్మించాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చింది. బ్లూ, గ్రీన్ రాజధానిగా ఓ అద్భుతమైన బృహత్ ప్రణాళికను సింగపూర్ రూపొందించి అందించింది. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతితో పాటు రాష్ట్రంలోని పట్టణాల అభివృద్ధి తదితర అంశాల్లో సింగపూర్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ ప్రాంతం అని స్పష్టం చేస్తున్నా. సింగపూర్ పారిశ్రామిక వేత్తలు అమరావతిని, ఆంధ్రప్రదేశ్‌ను రెండో నివాసంగా ఎంచుకోవాలి.’ అని అన్నారు. 

స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు

‘ఏపీలో పరిశ్రమలకు భూమి కేటాయింపు, అనుమతులను వేగంగా జారీ చేస్తున్నాం. ప్రపంచ దిగ్గజ స్టీల్ కంపెనీ అయిన ఆర్సెలార్ మిట్టల్‌కు అనతికాలంలోనే అన్ని అనుమతులు వేగంగా ఇచ్చాం. 2028 నాటికి ఆర్సెలార్ మిట్టల్ ఉత్పత్తి కూడా ప్రారంభించి ఏపీ నుంచి ఎగుమతులు చేస్తుంది. గూగుల్ క్లౌడ్ ఏఐ డేటా హబ్ కూడా ఏర్పాటు అవుతోంది. ఆ సంస్థకు గ్రీన్ ఎనర్జీని సరఫరా చేయాలని నిర్ణయించాం. పెట్టుబడులు వచ్చిన మరుక్షణం నుంచే పరిశ్రమలు ప్రారంభించేలా ఓ నిర్దిష్టమైన కాలవ్యవధిని నిర్ణయిస్తున్నాం. 

గూగుల్‌తో పాటు దాదాపు 10 గిగావాట్ల సామర్ధ్యం ఉన్న డేటా సెంటర్లను వివిధ కంపెనీలు ఏర్పాటు చేయబోతున్నాయి. ఎల్జీ ఎలక్ట్రానిక్స్ కూడా రూ.7 వేల కోట్లతో శ్రీసిటీలో గృహోపకరణాల తయారీ యూనిట్‌ను ప్రారంభించనుంది. నైపుణ్యం ఉన్న మానవ వనరులను తయారు చేసేందుకు ఆపరేషనల్ స్కిల్ యూనివర్సిటినీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ విస్తృతి పెరిగింది. దీని ఆధారంగానే నిర్ణయాలు ఉంటున్నాయి. ఏపీలోనూ అదే తరహాలో డేటా డ్రివెన్ నిర్ణయాలను తీసుకుని పౌరసేవల్ని అందిస్తున్నాం

ప్రపంచ ఆర్ధిక శక్తిగా భారత్

వికసిత్ భారత్ 2047 విజన్‌లాగే స్వర్ణాంధ్ర 2047 విజన్‌కు రూపకల్పన చేశాం. త్వరలోనే భారత ఎకనామిక్ పవర్ హౌస్‌గా ఆంధ్రప్రదేశ్ మారుతుంది. ప్రపంచ ఆర్థిక శక్తిగా భారత్ వేగంగా ఎదుగుతోంది. సుదీర్ఘమైన తీరప్రాంతం, అరుదైన ఖనిజాలు, పర్యాటక ప్రాంతాలు ఏపీ సొంతం. ఆక్వా, హార్టికల్చర్, వ్యవసాయం, సేవల రంగంలో ఏపీ కీలకమైన రాష్ట్రంగా ఉంది. దేశంలోనూ, రాష్ట్రంలోనూ సుస్థిరమైన ప్రభుత్వాలు ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా వివిధ దేశాలు సంక్షోభాలను ఎదుర్కొంటున్నాయి. పూర్తి స్థాయి సన్నద్ధతతో ఈ సంక్షోభాన్ని కూడా భారత్ సమర్ధంగా ఎదుర్కోగలిగింది. 

ఏపీ నుంచి ఎగుమతులు పెంచేందుకు మేం విస్తృతంగా ప్రయత్నాలు చేస్తున్నాం. దీనికి అనుగుణంగా పోర్టులు, ఎయిర్ పోర్టులు సిద్ధం చేస్తున్నాం. రాష్ట్ర అభివృద్ధి కోసం స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక ప్రణాళికల ద్వారా ఆర్ధిక అసమానతలు తొలగించేలా పనిచేస్తున్నాం. పారిశ్రామిక అనుకూల పరిస్థితులను కల్పించేలా 26 పాలసీలు అమలు చేస్తున్నాం. ఏపీలో భూమి లభ్యత, నీటి లభ్యత ఉంది. కృష్ణా, గోదావరి నదుల ద్వారా వివిధ ప్రాంతాలకు నీటి సరఫరా ఉంది. పారిశ్రామికంగా మౌలిక సదుపాయాలను పెద్ద ఎత్తున కల్పిస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి అన్నారు.  

గ్లోబల్ నగరాలకు ఏపీ కనెక్టివిటీ

‘ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఒక్కరినీ వ్యాపారవేత్తలుగా మార్చేందుకు వన్ ఫ్యామిలీ వన్ ఎంట్రప్రెన్యూర్ అనే విధానం తెచ్చాం. అలాగే ఎంఎస్ఎంఈ సహా వివిధ పరిశ్రమల్లో తయారయ్యే ఉత్పత్తుల నాణ్యతపై కూడా దృష్టి పెట్టాం. రియల్ టైమ్ గవర్నెన్సు ద్వారా ఎక్కడా జాప్యం లేకుండా అనుమతులు వేగంగా వచ్చేలా చూస్తున్నాం. ఏపీకి ఉన్న వెయ్యి కిలోమీటర్లకు పైగా తీర ప్రాంతంలో 6 ఆపరేషనల్ పోర్టులు ఉన్నాయి. ఈ పోర్టులను దేశంలోని వివిధ ప్రాంతాలకు, విదేశీ పోర్టులకు కనెక్టు చేసేలా ప్రయత్నాలు చేస్తున్నాం. 7 ఆపరేషనల్ ఎయిర్ పోర్టులు ఏపీలో ఉన్నాయి. భోగాపురం లాంటి అంతర్జాతీయ విమానాశ్రయంతో గ్లోబల్ నగరాలకు కనెక్టివిటీ ఏర్పడుతుంది. 

లాజిస్టిక్స్, అగ్రికల్చర్, సివిల్ ఏవియేషన్, ఎనర్జీ లాంటి వివిధ అంశాల్లో ఫంక్షనల్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తున్నాం. ఏపీలో ఉన్న పోర్టులను దేశంలోని ఇతర ప్రాంతాలు అనుసంధానించేలా రహదారి, రైల్ నెట్వర్క్‌ను కూడా పెద్ద ఎత్తున నిర్మిస్తున్నాం. ఎలక్ట్రానిక్స్, స్పేస్, ఏరోస్పేస్, డ్రోన్, డిఫెన్స్ క్లస్టర్లతో పాటు రాష్ట్రంలోని 175 చోట్ల నియోజకవర్గ ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేస్తున్నాం. ఈ పారిశ్రామిక పార్కులకు నీరు, విద్యుత్ లాంటి మౌలిక సదుపాయాలు కూడా సిద్ధంగా ఉన్నాయి. రాయలసీమలోని పుట్టపర్తి వద్ద 5వ తరం ఫైటర్ జెట్ తయారీ, టెస్టింగ్ ఫెసిలిటీ కూడా వస్తోంది. ఈవీల వినియోగం పెంచటం ద్వారా కాలుష్యాన్ని తగ్గించేలా ప్రయత్నాలు చేస్తున్నాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. 

నాలెడ్జ్ హబ్‌గా అమరావతి

‘అమరావతిని ఎడ్యుకేషన్, నాలెడ్జ్ హబ్‌గా తయారు చేయటంతో పాటు దేశంలోని ప్రధాన నగరాలను కనెక్ట్ చేస్తాం. హైస్పీడ్ రైల్ నెట్వర్క్ కూడా అమరావతిని హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి నగరాలను కనెక్టు చేస్తుంది. బ్లూ, గ్రీన్ సిటీగా అమరావతిని నిర్మించటం తోపాటు ఈవీల వినియోగం, గ్రీన్ ఎనర్జీని వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నాం. అమరావతిలోనే ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ఏడాది డిసెంబరు నాటికల్లా క్వాంటం అమరావతిలో కంప్యూటర్ పనిచేయటం ప్రారంభిస్తుంది. 

రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఆవిష్కరణల్ని, స్టార్టప్‌లను ప్రోత్సహిస్తున్నాం. ప్రాజెక్టులు పెట్టే వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ప్రభుత్వం సహకారం అందిస్తుంది. త్వరలోనే విశాఖ సమీపంలో సెమీకండక్టర్ పరిశ్రమ ఏర్పాటు అయ్యే అవకాశం ఉంది.  ఏపీలో అద్భుతమైన పర్యాటక ప్రాంతాలు కూడా ఉన్నాయి. దేవాలయాలు, పర్యాటక, బుద్దిస్ట్ సర్క్యూట్‌లు ఉన్నాయి. అక్వా, వ్యవసాయం, హార్టికల్చర్‌లో ఏపీ అగ్రస్థానంలో ఉంది. పెద్ద ఎత్తున ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు అవకాశం ఉంది. పెద్దఎత్తున ప్రకృతి సేద్యం ద్వారా వ్యవసాయ, ఉద్యాన ఉత్పత్తులను పండిస్తున్నాం.  ఏపీకి వచ్చి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను పరీక్షించి అప్పుడు పెట్టుబడులు పెట్టాలని పిలుపునిస్తున్నాను. పెట్టుబడులు పెట్టడానికి ఇది సువర్ణ అవకాశం. ఇండియా గ్రోత్ స్టోరీలో భాగస్వాములు కావాలని కోరుతున్నాను’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. 

భవిష్యత్ అంతా స్టార్టప్‌లదే

‘భౌగోళిక రాజకీయ పరిస్థితుల కారణంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి పెట్టుబడులు భారతదేశానికి వస్తున్నాయి. ఇందులో 25 శాతం మేర ఏపీలో ప్రాజెక్టులు పెట్టేందుకు ముందుకు వచ్చాయి. భారత్‌లో ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు ఉన్నాయి. పోర్టులు, ఎయిర్ పోర్టులు ప్రపంచ వ్యాప్తంగా వివిధ ప్రాంతాలను అనుసంధానం చేస్తున్నాయి. అంతర్జాతీయంగా ఉత్పన్నమైన పరిస్థితులను ఎదుర్కునేలా కొన్ని దేశాలు సొంతంగా నిధిని ఏర్పాటు చేశాయి. 

సింగపూర్ కూడా సావరిన్ ఫండ్స్‌ను ఏర్పాటు చేసుకున్నాయి. సమీప భవిష్యత్ అంతా స్టార్టప్ లదే. వాటిని ప్రోత్సహిస్తే పెద్దఎత్తున ఉత్పత్తికి అవకాశం ఉంటుంది. పెద్ద కంపెనీలు, సంపన్నులు స్టార్టప్ లలో పెట్టుబడి పెట్టడం విజయవంతమైన మార్గంగా చూస్తున్నాయి. అమరావతిలో ఫైనాన్షియల్ డిస్టిక్ట్‌ను ఏర్పాటు చేశాం. బ్యాంకులు, ఆర్ధిక సంస్థలు ఈ ఆర్ధిక నగరంలో ఉంటాయి’ ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంత్రి పి.నారాయణ, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఈడీబీ సీఈఓ షన్మోహన్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

By
en-us Political News

  
మానవ సంబంధాలు ఎంతలా మంటగలిసిపోతున్నాయో చెప్పడానికి కాకినాడ జిల్లాలో జరిగిన ఈ దారుణ ఘటనే ఒక పెద్ద ఉదాహరణ.
ఉత్తరాఖండ్‌లోని ప్రముఖ పర్యాటక కేంద్రం ముస్సోరీ లో తెలుగు యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం సంచలనంగా మారింది.
రేపు ఆరుట్ల తెలంగాణ పబ్లిక్ స్కూల్‌ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి...
సింగపూర్‌లో వరల్డ్ సిటీస్ సమ్మిట్‌లో ముఖ్యమంత్రి ప్రసంగం..
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గ టీడీపీ నేతలు, కార్యకర్తలతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ కార్వనిర్వాహక అధ్యక్షులు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు.
మెట్రో ప్రాజెక్టు విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనపై చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారమని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి స్పష్టం చేశారు
తెలంగాణలో హెచ్‌సీఏ ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న టీజీ 20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది.
రైతులకు విత్తనాల సరఫరా నుంచి పండించిన పంటల కొనుగోళ్ల వరకు సమగ్ర ప్రణాళికతో పాటు నిర్దిష్ట కార్యాచరణ అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
సికింద్రాబాద్‌లోని ప్రసిద్ధ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో 2026 ఆషాఢ మాస బోనాల జాతర నిర్వహణకు సంబంధించిన షెడ్యూల్‌ను ఆలయ అధికారులు ఖరారు చేశారు.
ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సాయం
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన లక్ష్యంగా పనిచేస్తున్న ఈగల్ ఫోర్స్ అంతర్రాష్ట్ర డ్రగ్స్ నెట్‌వర్క్‌ను బహిర్గతం చేసింది.
హనీమూన్ ప్రయాణం అంటే సరికొత్త జీవితానికి అందమైన పునాది.
దేశ రక్షణలో కీలకమైన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ (IAF) అధికారిక విధుల్లో బిజీగా ఉండే ఒక ఉన్నతాధికారి కుటుంబంలో నమ్మశక్యం కాని ఘోరం వెలుగుచూసింది.
 
Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
 
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.