ఏపీని గ్రీన్ వ్యాలీగా తయారు చేస్తాం : సీఎం చంద్రబాబు
Publish Date:Jan 17, 2026
Advertisement
కాకినాడలో రూ. 18 వేల కోట్లుతో ఏర్పాటు చేయనున్న ఏఎం గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్లాంట్‌కు సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన చేసిన ముఖ్యమంత్రి మాట్లాడుతు గ్రీన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్‌ను తయారు చేస్తామని అన్నారు.ఈ ఏడాది సంక్రాంతి పండుగకు 30 లక్షల మందికిపైగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రజలు తమ స్వస్థలాలకు వచ్చారని సీఎం తెలిపారు. హైదరాబాద్ నుంచి మాత్రమే సుమారు 3 లక్షల వాహనాలు ఏపీకి చేరాయని వెల్లడించారు. పండుగ వేడుకల్లో భాగంగా జగ్గన్నతోట ప్రభల తీర్థం ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్రాజెక్టు మన రాష్ట్రంలో ఏర్పాటు కావడం గర్వకారణమని సీఎం అన్నారు. ఈ ప్రాజెక్టును ప్రారంభించిన ప్రమోటర్లకు ఆయన అభినందనలు తెలిపారు. గత ఏడాదే గ్రీన్ అమోనియా ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చామని, 2027 జూన్ నాటికి సంవత్సరానికి 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమోనియా ఉత్పత్తి ప్రారంభం కానుందని వెల్లడించారు. చరిత్రను తిరగరాయగల సామర్థ్యం తెలుగువాళ్లకే ఉందని మరోసారి నిరూపితమవుతోందని ముఖ్యమంత్రి వెల్లడించారు. కాకినాడ నుంచి గ్రీన్ అమోనియాను నేరుగా జర్మనీకి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. గతంలో ఇదే ప్రాంతంలో నాగార్జునా ఫెర్టిలైజర్స్ గ్రే అమోనియా తయారు చేసేదని గుర్తు చేశారు. ఇప్పుడు అదే ప్రాంతంలో గ్రీన్ అమోనియా తయారీ జరగడం ద్వారా పర్యావరణ హిత ఉత్పత్తులు తయారవుతున్నాయని చెప్పారు.ప్రస్తుతం పర్యావరణ సమతుల్యత సాధించడమే ప్రధాన లక్ష్యమని, అందుకు అనుగుణంగా ప్రభుత్వ ప్రణాళికలు రూపొందుతున్నాయని సీఎం తెలిపారు. ప్రకృతి విపత్తులు, సముద్ర మట్టాలు పెరగడం వల్ల భూమి కోతకు గురవుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ 500 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకున్నారని గుర్తు చేస్తూ, ఆ లక్ష్యానికి అనుగుణంగా ఆంధ్రప్రదేశ్‌లో 160 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ ఇండస్ట్రీలతో ఏపీ భవిష్యత్తు మరింత ప్రకాశవంతంగా మారబోతుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-36-212664.html





