ఎమ్మెల్యేల పనితీరు మారాలి : సీఎం చంద్రబాబు
Publish Date:Jun 29, 2025

Advertisement
కొంత మంది ఎమ్మెల్యేల పనితీరు మారాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని తెలుగు దేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌లకు ఆయన దిశానిర్దేశం చేశారు. పనితీరు బాగా లేకుంటే గుడ్‌బై చెప్పేస్తానని తేల్చిచెప్పారు. తాను క్షేత్ర స్థాయిలో పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమాచారం తెప్పించుకుంటున్నానని, అనేక మార్గాల ద్వారా సర్వేలు చేయిస్తున్నానని చంద్రబాబు తెలిపారు. అన్ని సర్వేలను విశ్లేషించి వాస్తవాలను బేరీజు వేస్తున్నట్లు వెల్లడించారు. ఎమ్మెల్యేలతో నిన్నటి నుంచి రోజుకు
నలుగురిని పిలిచి మాట్లాడుతున్నానని ఇంక కొంతమంది తమ పనితీరు మారాల్సిందేనని తేల్చిచెప్పారు. పనితీరు మార్చుకుంటే బాగుంటుందని, లేకపోతే ఇక అంతే సంగతులంటూ హెచ్చరించారు. ఎంత పని చేశామనే అంశంతో పాటు ఎలా చేస్తున్నామనేది కూడా కీలకమని స్పష్టం చేశారు. పార్టీలోని ప్రతి ఒక్కరూ అదే తరహాలో ఆలోచన చేయాలని పిలుపునిచ్చారు. వారసులకు హ్యండ్ హోల్టింగ్ ఇస్తాం కానీ దాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత వాళ్ల మీదే ఉంటుందని వివరించారు.రోడ్డు ప్రమాదంలో పాస్టర్ చనిపోతే మనమే కారణమన్నారు. నిజం గడప దాటేసరికి అబద్ధం ఊరంతా చుట్టి వస్తుందని గ్రహించాలి. ప్రజలకు వాస్తవాలు చెప్పడంతో నేతలంతా ముందుండాలి. సోషల్ మీడియా యుగంలో మరింత జాగ్రత్తగా ఉండాలని చంద్రబాబు తెలిపారు.
అక్కడ దారుణంగా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు. 2029 ఎన్నికలే నా టార్గెట్. పనితీరు బాగా లేకుంటే మొహమాటం లేకుండా గుడ్‌బై చెప్పేస్తా. వచ్చే ఎన్నికల్లో గెలిచేందుకు కౌంట్‌డౌన్ పెట్టుకుని పనిచేస్తున్నాం. ఏళ్లు.. నెలలు.. రోజులు.. గంటలు కూడా లెక్కిస్తున్నా. తానా, ఆటా అంటూ ఫారెన్ ట్రిప్పులు వద్దు. అలా వెళ్తే టాటా చెప్పేస్తా. ప్రజాప్రతినిధుల గ్రాఫ్ పెరుగుతుందా? తగ్గుతుందా? పరిశీలిస్తున్నా. మొదటి ఏడాది పాలన పూర్తయింది.. రెండో ఏడాది ప్రారంభైంది. నెల రోజులపాటు ప్రతి గడపకూ నేతలు వెళ్లాలి’’ అని చంద్రబాబు స్పష్టం చేశారు.
పాలనలో ఏమైనా లోటుపాట్లు, పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుని ముందుకు సాగుదామని చంద్రబాబు అన్నారు. "ప్రజలు మెచ్చాలి, కార్యకర్తలు ఆమోదించాలి. అదే మన లక్ష్యం. పార్టీ కోసం అహర్నిశలు పనిచేసిన కార్యకర్తలను ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోవద్దు. డబ్బులు పంచి ఎన్నికల్లో గెలవాలనుకోవడం బాధాకరం. గత ఎన్నికల్లో ప్రత్యర్థులు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేసినా 11 సీట్లకే పరిమితమయ్యారు. డబ్బు అన్నివేళలా పనిచేయదు. మనం ఆదర్శవంతమైన రాజకీయాలు చేద్దాం" అని ఆయన పిలుపునిచ్చారు.
http://www.teluguone.com/news/content/cm-chandrababu-39-200907.html












