సీఐ నాగరాజు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
Publish Date:Jun 24, 2026
Advertisement
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో యువకుడు సాయికృష్ణ కస్టడీలో మృతి చెందడం, అనంతరం మృతదేహాన్ని మాయం చేసిన కేసులో మాజీ సీఐ సూడా సురేష్ వీర వెంకట నాగరాజును ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచింది. ఈ సందర్భంగా దాఖలు చేసిన రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు నమోదయ్యాయి. రిమాండ్ రిపోర్టు ప్రకారం.. సాయికృష్ణపై కృష్ణలంక, మాచర్ల పోలీస్ స్టేషన్లలో నాన్-బెయిలబుల్ వారెంట్లు పెండింగ్‌లో ఉన్నాయి. 2026 మే మొదటి వారంలో మార్కాపురం వద్ద అతడిని అదుపులోకి తీసుకుని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. మే 6న తెల్లవారుజామున సీఐ నాగరాజు సాయికృష్ణను తన కస్టడీలోకి తీసుకున్నారు. చట్టప్రకారం 24 గంటల్లో మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచాల్సి ఉన్నప్పటికీ, అక్రమంగా లాకప్‌లోనే ఉంచినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. సాయికృష్ణను పోలీసులు పట్టుకున్న విషయం తెలుసుకుని అతని తల్లి పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు, గాయాలతో లాకప్‌లో ఉన్న తన కుమారుడిని చూసినట్లు, లోపల నుంచి కేకలు వినిపించినట్లు ఆమె వాంగ్మూలంలో నమోదు చేశారు. కుమారుడిని విడిచిపెట్టాలని వేడుకున్నా సీఐ నాగరాజు ఆమెను దూషించి, తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. స్పృహ లేని స్థితిలో ఉన్న సాయికృష్ణ కాళ్లకు తాడు కట్టి స్టేషన్‌లోనే హింసించినట్లు దర్యాప్తులో నమోదు చేశారు. ఈ హింస కారణంగానే మే 6 నుంచి మే 8 మధ్యకాలంలో సాయికృష్ణ పోలీస్ కస్టడీలో మృతి చెందినట్లు ప్రాథమిక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. కస్టడీలో మరణం అనంతరం మృతదేహాన్ని పోలీస్ స్టేషన్ నుంచి రహస్యంగా తరలించి, ఆధారాలు లభించకుండా తగులబెట్టి పూర్తిగా మాయం చేసినట్లు రిమాండ్ రిపోర్టులో నమోదు చేశారు. ఇప్పటివరకు సాయికృష్ణ మృతదేహానికి సంబంధించిన ఆనవాళ్లు లభించలేదని పేర్కొన్నారు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలను చెరిపివేసే ప్రయత్నంలో భాగంగా పోలీస్ స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను కూడా తొలగించినట్లు రిపోర్టులో వెల్లడైంది. మే 1 నుంచి జూన్ 1 వరకు ఉన్న సీసీటీవీ రికార్డులను సైంటిఫిక్ అసిస్టెంట్ పరిశీలించగా ఎలాంటి డేటా లేకుండా పూర్తిగా డిలీట్ చేసినట్లు గుర్తించారు. అలాగే హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సమయంలో కూడా సాయికృష్ణ తమ కస్టడీలో లేడంటూ తప్పుడు సమాచారం సమర్పించినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. మృతుడు సాయికృష్ణ తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూన్ 19న విజయవాడ మహిళా పోలీస్ స్టేషన్‌లో మాజీ సీఐ నాగరాజుపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 127(4) (అక్రమ నిర్బంధం), 127(6), 103(1) (హత్య), 238 (సాక్ష్యాల ధ్వంసం) కింద కేసు నమోదు చేశారు. .కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ 21న ఐజీపీ ఎం. రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. బాపట్ల అదనపు ఎస్పీ ఎల్. సుధాకర్ దర్యాప్తు అధికారిగా బాధ్యతలు స్వీకరించి మాజీ సీఐ నాగరాజును అరెస్టు చేశారు. జూన్ 24న విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించగా నిందితుడు ఆరోగ్యంగానే ఉన్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ కేసు పోలీస్ కస్టడీ హింస, హత్య, శవాన్ని మాయం చేయడం, సాక్ష్యాల ధ్వంసం వంటి అత్యంత తీవ్రమైన అంశాలకు సంబంధించినదని సిట్ కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. నిందితుడు దర్యాప్తుకు సహకరించడం లేదని, తప్పించుకునే సమాధానాలు ఇస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అతడు బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉన్నందున 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించాలని దర్యాప్తు అధికారి కోర్టును అభ్యర్థించారు.
http://www.teluguone.com/news/content/ci-nagaraju-36-224017.html





