చిరంజీవి విందులో కుండలు బ్రద్దలు
Publish Date:Jan 3, 2014
Advertisement
సినీ పరిశ్రమలో చిరంజీవి మెగాజీవి కావచ్చును కానీ రాజకీయాలలో, అదీ కాంగ్రెస్ రాజకీయాలలో చాలా అల్పజీవని చెప్పకతప్పదు. ఎన్నోకలలతో స్థాపించిన తన ప్రజారాజ్యాన్నికాంగ్రెస్ కండువా కప్పేసి అధికారిక రాజ లాంఛనాలతో చాలా ఘనంగా అంత్యక్రియలు నిర్వహించి తను, తన అనుచరులు పుచ్చుకొన్న మంత్రి పదవులు అన్నీకూడా ఏడాది తిరగకుండానే ఊడుతున్నాయి. పైగా వారిలో గంటావారు బొత్సావారితో కయ్యం అందుకోవడంతో త్వరలో షోకాజ్ నోటీసులతో గంటావారిని ఘనంగా సన్మానించి పార్టీ నుండి వీడ్కోలు పలికేందుకు రంగం సిద్దం అయినట్లు మీడియా వాళ్ళు చెవులు కొరుకొంటున్నారు. ఇక మెగామంత్రిగారు తన రాజ్యంలో మిగిలిన యం.యల్.ఏ.ల మొహాలు చూసి చాలా కాలమే అయ్యింది. ఏ జీవి అండా లేని వారందరూ రాష్ట్ర విభజన దెబ్బకి చెట్టుకొకరు, పుట్టకొకరు లెక్కన చెల్లా చెదురయిపోతున్నారు పాపం. ఇటువంటి పరిస్థితుల్లో బహుశః అధిష్టానమే ఆదేశించిందో లేక తానే హనుమంతులవారిలా స్వయంగా రంగంలోకి దూకేరో తెలియదు, కానీ మెగామంత్రిగారు తన రాజ్యంలో మిగిలున్నయం.యల్.ఏ.లందరినీ తన ఇంటికి పిలిచి వారికి స్వయంగా నవరసాలు కొసరికొసారి వడ్డిస్తూ, “మీరందరూ అధిష్టానం చెప్పినట్లు బుద్ధిగా ఉంటూ కాంగ్రెస్ పార్టీలోనే కడదాకా ఉండాలని” నచ్చజెప్పే ప్రయత్నం చేసారు. తన ఈ చిట్టచివరి కోరిక తీర్చమని వారిని ప్రాధేయపడ్డారు. వారికి తను పార్టీ టికెట్స్ ఇప్పించగల సమర్దుడనని చెప్పి చూసారు కూడా. కానీ వారిలో ఏ ఒక్కరూ కూడా ఆయన అమృత హస్తాలతో ఇచ్చేకాంగ్రెస్ టికెట్స్ తీసుకొనేందుకు ఇష్టపడలేదు. కాంగ్రెస్ టికెట్స్ పై పోటీచేయడం, అందునా మెగా మంత్రిగారి నీడలో పోటీ చేయడం అంటే రాజకీయంగా ఆత్మహత్యతో సమానమని కుండలు బ్రద్దలు కొట్టేసారు. వారిలో రామచంద్రయ్యగారు దేవాదాయశాఖా మంత్రిగా ఉన్నపటికీ, ఏనాడు ఏదేవుడి పేరు తలచుకోకపోయినా నిత్యం నూటొక్కసార్లు చిరంజీవ నామ స్మరణ చేస్తే వెయ్యి దేవుళ్ళ పెట్టు అని దృడంగా భావించేవారు. చివరికి ఆయన కూడా తన ఆరాధ్యజీవికి కమిట్ అవలేదు. ఇక మరో అనుంగు చెలికాడు గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ “మీరు పార్టీలో ఉండమన్నారని మేము ఉంటే మాత్రం, మాకు పొగపెడుతున్నబొత్స మమ్మల్నిపార్టీలో ఉండనిస్తారా? అందుకే తెలుగుదేశంలో టికెట్స్ ఖరారు చేసేసుకొన్నామని కుండ బ్రద్దలు కొట్టేసారు. మెగా రాజ్యంలో మిగిలున్నయం.యల్.ఏ.లలో ఈలి వెంకట మధు సూధన రావు (తాడేపల్లి గూడెం), గ్రంధి మోహన్ (పెద్దాపురం), కన్నబాబు (కాకినాడ రూరల్) తదితరులు కూడా తాము తెదేపాలోకో మరో దానిలోకో జంప్ అయిపోవడం ఖాయమని కుండలు బ్రద్దలు కొట్టేసారు. ఇంతమంది ఇన్నికుండలు బ్రద్దలు కొట్టిన తరువాత మెగాజీవిగారు విందు సమావేశం ఎంత ముచ్చటగా ఉంటుందో ఎవరయినా ఊహించుకోవచ్చును. అందువల్ల ఆయన వారినందరినీ ఆపేందుకు శ్రమపడటం కంటే, తను కూడా వారితో కలిసి ఏ తెదేపాలోనో జేరిపోతే గంటావారు తన పలుకుబడితో ఆయనకీ ఒక టికెట్ ఇప్పించినా ఇప్పించగలడు. ఎంత కేంద్ర మంత్రయినా మునిగిపోయే కాంగ్రెస్ టైటానిక్ షిప్పులో సోనియా, రాహుల్ గాంధీలను నమ్ముకొని బిక్కుబిక్కుమంటూ కూర్చోవడం కంటే, నమ్మకస్తులయిన తన అనుచరులతో కలిసి ఆయన కూడా ఏ తెదేపాలోకో దూకేసి టికెట్ కాపాడుకొని పొరపాటున గెలిస్తే ఏదో ఒక మంత్రి పదవి సంపాదించుకోవచ్చుకదా!
http://www.teluguone.com/news/content/chiranjeevi-37-28998.html





