చంద్రబాబు సంతోషం కోసమే తనపై అక్రమ కేసులు.. చెవిరెడ్డి బహిరంగ లేఖ
Publish Date:Jun 19, 2025

Advertisement
సీఎం చంద్రబాబును సంతోషం కోసమే పోలీసులు తనపై, తన కుటుంబ సభ్యులపై అక్రమ కేసులను బనాయిస్తున్నారని చంద్రగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి పేర్కొన్నారు. లిస్కర్ స్కాం కేసులో ఆయన్ని సిట్ అధికారులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో ఆయన సిట్ కు ఓ బహిరంగ లేఖ విడుదల చేశారు. ఆ లేఖను చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుమారుడు హర్షిత్‌రెడ్డి విజయవాడలోని సిట్ కార్యాలయం వద్ద మీడియాకు విడుదల చేశారు. ఈ లేఖ పూర్తి పాఠం ఇలా ఉంది.
నేను చాలా స్పష్టంగా మీరు ఎప్పుడు రమ్మంటే అప్పుడు సిట్ కార్యాలయానికి వస్తాను అని చెప్పాను. మీరు కేవలం నా సెల్ ఫోన్‌కు ఒక చిన్న మెసేజ్ పెట్టినా సిట్ కార్యాలయం ముందు నిలబడి ఉంటా. మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి నిజాయితీగా సమాధానం చెప్పి ఉంటా. నేను పగలే కాదు, రాత్రి వేళల్లో కూడా ఏ రోజు నా సెల్ ఫోన్ ఆఫ్ చేయలేదు. నేను నిన్న కూడా విజయవాడలోనే ఉన్నా, మీరు పిలిచి ఉంటే వచ్చేవాడిని. నేను నా జీవితంలో ఎన్నడూ పారిపోలేదు. ముందస్తు బెయిల్ కూడా నా జీవితంలో ఏనాడూ అడగలేదు. అలాంటి నాపై లుకౌట్ నోటీసులు ఇవ్వడం అన్నది మీ సభ్యతను తెలియజేస్తుంది. బతుకు తెరువు కోసం అవకాశం ఉన్న ప్రదేశాలకు, దేశాలకు వెళుతుంటాం, తప్పేంటి? మీరు పిలిస్తే రానప్పుడు తప్పు అవుతుంది. కానీ నేను అలా చేయలేదు కదా! సిట్ విచారణ ప్రారంభించి 365 రోజులు అవుతుంది, ఏ రోజు అయినా, ఏ ఒక్కరు అయినా, చివరకు ఏ పేపర్‌లోనైనా, ఏ ఛానల్‌లో అయినా నిన్నటి వరకు నా పేరు ప్రస్తావనకు వచ్చిందా? లేదుకదా. కనీసం నిన్నటి వరకు మీ సిట్ అధికారులు ఒక్కరైనా నన్ను ఏదైనా అడిగారా? ఒక చిన్న నోటీస్ అయినా ఇచ్చారా? ఎప్పుడైనా పిలిచారా? లేదు కదా! అంటే దాని అర్థ ఏంటీ!.
చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా నన్ను ఏలా ఇబ్బందులు పెట్టాడో, ఎన్ని కేసులు పెట్టారో, ఒక ఎమ్మెల్యే అని కూడా చూడకుండా అనేకసార్లు ఎంతగా కొట్టించారో మీకు తెలుసు. ప్రజలందరికీ తెలుసు! మరలా చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. దుర్మార్గంగా అన్యాయమైన కేసులు పెట్టిస్తున్నారు. ఇక మిగిలింది మా పాత గన్‌మేన్‌లను తప్పుడు కేసులకు సంతకాలు పెట్టమని మీ సిట్ అధికారులు కొట్టినట్టు, మీ చేత మరల నన్ను కూడా కొట్టిస్తారేమో! అది కూడా కానిచ్చేయండి. చంద్రబాబు కుటుంబం అప్పుడైనా శాంతిస్తుంది.
ఈసారి నా ఒక్కడినే కాదు, చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశాడని కేవలం 26 సంవత్సరాలు వయసు గల చిన్నవాడైన నా కొడుకు మోహిత్‌రెడ్డిని కూడా కేసులో ఇరికించి జైలుకు పంపాలనుకుంటున్నట్టు ఉన్నారు! ఒక్క మోహిత్‌నే ఎందుకు ఇంట్లో ఇంకా నా భార్య నా మరో కొడుకు కూడా మిగిలి ఉన్నారు. వాళ్లను కూడా దయచేసి ఏదో ఒక కేసులో ఇరికించి జైలుకు పంపి, చంద్రబాబును చంద్రబాబు కుటుంబాన్ని సంపూర్ణంగా శాంతింప చేయండి.
మాకేం పర్లేదు మా కుటుంబం అంతా నిత్యం కొలిచే మా వెంకటేశ్వర స్వామి మాలో ఉన్నాడు. జీవితం అంతా పోరాటాల ఊపిరిగా జీవిస్తున్న మా జగనన్నే మాకు స్ఫూర్తిగా ఉన్నాడు. ధైర్యం ఉంది ఎదుర్కొంటాం, సగౌరవంగా తిరిగి వస్తాం, ఆలస్యమైన సత్యమే జయిస్తుంది.
http://www.teluguone.com/news/content/chevireddy-open-letter-to-sit-39-200302.html












