హిమాలయాల్లో దొరికే మూలికల భస్మంతో బంగారం తయారీ అంటూ చీటింగ్..నిందితులు అరెస్ట్
Publish Date:Aug 11, 2025
Advertisement
బంగారం తయారు చేస్తామంటూ జనాలను మోసం చేస్తున్న నిందితుల ముఠాను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. హిమాలయాల్లో దొరికే మూలికలతో బంగారం తయారు చేసి ఇస్తామంటూ నాగపూర్ కు చెందిన ఓ ముఠా హైదరాబాద్ లో మోసాలకు పాల్పడుతోంది. అమాయకుల నుంచి లక్షల్లో డబ్బు చోరీ చేస్తున్న ముఠాలోని ముగ్గురిని ఓ బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు అరెస్టు చేశారు. వివరాలిలా ఉన్నాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ ముఠాలోని ముగ్గు రిని అరెస్టు చేశారు. అయితే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నారు. ఈ ముఠా నిజాంపేట్ లోని గద్వాల్ ఆయుర్వేదిక్ సెంటర్, నాగోల్ లోని మహాలక్ష్మి ఆయుర్వేదిక్ సెంటర్లలో ఏజెంట్లుగా పని చేస్తున్నారు. వీరు హిమాలయాల్లో నుండి భస్మం తీసుకువచ్చి... జనాలను నమ్మించి... మోసాలకు పాల్పడుతూ... లక్షల్లో నగదు దోచేస్తున్నారు. ఇప్పుడు నిందితులను అరెస్టు చేయడంతో మరిన్ని ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు.
నాగపూర్ కు చెందిన గ్యాంగ్ హైదరాబాద్ లోకి ప్రవేశించి స్వామీజీ వేషధారణలో కష్టాలు తొలగిపోయేలా రెండు కేజీల బంగారం తయారుచేసి ఇస్తామంటూ అమాయక జనాలను బురిడీ కొట్టిస్తూ వారి వద్ద నుండి లక్షల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు ఈ క్రమంలోనే బంజారాహిల్స్ కి చెందిన గోపాల్ సింగ్ అనే వ్యక్తి ఈ గ్యాంగ్ మాయలో పడ్డాడు. హిమాలయాల్లో దొరికే మూలికలతో , భస్మంతో తయారు చేసిన బంగారాన్ని మీ ఇంట్లో పెట్టుకుంటే కష్టాలన్నీ తొలగిపోతాయని, ప్రతి పనిలో విజయం సాధిస్తారంటూ నమ్మించి ...గోపాల్ సింగ్ వద్దనుండి 10 లక్షల రూపాయలు తీసుకొని... అతని అతని ఇంటికి వెళ్లి నెల రోజుల పాటు పూజలు చేసి అనంతరం ఒక ఎర్ర బట్టలో రెండు కేజీల బంగారం ఉందంటూ వారి చేతికి ఇచ్చారు. వారం రోజులు పూజ గదిలో ఉంచిన అనంతరం దీనిని తెరిచి చూడాలని సూచించారు. అయితే గోపాల్ సింగ్ కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చి ఐదు రోజుల తర్వాత ఆ బట్ట తెరిచి చూడగా బంగారపు రంగులో ఉన్న ఇనుప ముక్కలు కనిపించాయి. స్వామీజీలమంటూ తమకు ఆ ఇనుపముక్కలను అంటగట్టిన వారికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ రావడంతో మోసపోయినట్లు గ్రహించి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
http://www.teluguone.com/news/content/cheating-saying-will-make-gold-with-ashes-of-herbs-found-in-the-himalayas-three-39-203991.html





