రౌడీలకు రౌడీని.. గుండెల్లో నిద్రపోతా! చంద్రబాబు ఉగ్రరూపం
Publish Date:Mar 7, 2021
Advertisement
టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రోడ్ షోలో ప్రసంగించిన చంద్రబాబు.. వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. వైసీపీ నేతల రౌడీయిజం తన వద్ద సాగదని స్పష్టం చేశారు. అయితే ప్రజల కోసమే కొన్ని భరిస్తున్నానని, ఈ వైసీపీకి భయపడి కాదని స్పష్టం చేశారు. పేకాట మంత్రికి, అవినీతి మంత్రికి ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని చంద్రబాబు పిలుపిచ్చారు. రాష్ట్రానికి పట్టిన శని జగన్ అంటూ దుయ్యబట్టారు. ప్రజల నెత్తిన పెట్టిన కుంపటి బాగా మండుతోందని చెప్పారు. నాసిరకం మద్యం బ్రాండ్లతో ఆరోగ్యం, ఆదాయాన్ని ప్రజలు కోల్పోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఎవరైనా నోరెత్తితే ప్రతి శుక్రవారం సాయంత్రం ప్రజల ఇళ్లకు ప్రొక్లెయినర్ పంపి విధ్వంసం సృష్టిస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు రాష్ట్ర మంత్రి కొడాలిపై చంద్రబాబు తనదైన శైలిలో విమర్శలు చేశారు. ‘‘ఒకడు బూతుల మంత్రి... నోరు పారేసుకుంటాడు.. పేకాట ఆడిస్తాడు. ఆడితే తప్పేముంది అంటాడు. ఎంత సింపుల్ సమాధానం. తాడేపల్లిలో సీఎం దగ్గరకు వెళ్లి దర్జాగా బయటకు వస్తాడు. అంటే సీఎం ఆశీస్సులు తీసుకున్నట్టా?’’ అంటూ కొడాలిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. "రాష్ట్ర పంచాయతీ శాఖ మంత్రి ఓ పనికిమాలిన మంత్రి. తానో పెద్ద రౌడీ అనుకుంటున్నాడు. నేను రౌడీలకు రౌడీని. గుండెల్లో నిద్రపోతా. ప్రజలు తిరగబడ్డ రోజున నీలాంటి రౌడీలు పారిపోతారు. సిగ్గు లేకుండా దౌర్జన్యాలు చేసి గెలవాలనుకుంటున్నారు" అంటూ చంద్రబాబు మండిపడ్డారు. ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలు చేసుకుని ప్రజల ఓటు హక్కును సమాధి చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ అరాచక, దోపిడీ పాలనకు ఈ మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. రాజధానిగా అమరావతి ఆమోదయోగ్యమో, కాదో ఓటు ద్వారా చెప్పాలని అన్నారు చంద్రబాబు. వైసీపీకి ఓటు వేస్తే 3 రాజధానులకు మద్దతు ఇచ్చినట్టు అవుతుందని స్పష్టం చేశారు. ఆంధ్రులు గర్వించే రాజధాని అమరావతిని నిర్మిస్తుంటే... జగన్ వచ్చి రాజధానిని ముక్కలుగా చేసి అస్తవ్యస్తం చేశాడని చంద్రబాబు ఆరోపించారు. మేయర్ పదవిని సాధించాలని, లేదంటే విజయవాడ జనం తలెత్తుకు తిరగలేరన్నారు. నేరస్థుల అడ్డాగా ఆంధ్రాను తయారు చేస్తున్నారని వాపోయారు. పేదోళ్లకు కనీసం ఐదు రూపాయల భోజనం పెడుతుంటే... టీడీపీకి పేరొస్తుందనే భయంతో.. అన్నా క్యాంటీన్‌లను నిరుపయోగం చేశారని తెలిపారు. ‘‘ప్రత్యేక హోదా కోసం ఢిల్లీ మెడలు వంచుతా అన్నాడు... ప్రత్యేక హోదా ఏమైంది? ఎవరికైనా న్యాయం జరిగిందా..?’’ అని ప్రశ్నించారు. తమ పాలనలో నిరుద్యోగ భృతి ఇచ్చామని, ఇప్పుడు దాన్ని తీసేశారన్నారు. పెళ్లి కానుక రావడం లేదని, భరోసాను పెంచామని చెప్పుకొచ్చారు.
http://www.teluguone.com/news/content/chandrbabu-fire-on-jagan-kodali-nani-peddi-reddy-in-vijayawada-road-show-25-111330.html





