సహజ వనరుల దోపిడీపై చంద్రబాబు శ్వేతపత్రం!
Publish Date:Jul 15, 2024
Advertisement
గత అయిదేళ్ళలో వైసీపీ నేతలు సహజ వనరులను భారీ స్థాయిలో దోపిడీ చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. జగన్ ప్రభుత్వం అడవులను కూడా ధ్వంసం చేసిందని తెలిపారు. జగన్ ప్రభుత్వంలో సహజవనరుల దోపిడీపై ఏపీ సచివాలయంలో చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేశారు. వైసీపీహయాంలో భూములు, ఖనిజాలు, అటవీ సంపదను దోచేశారని విమర్శించారు. "కొత్త దారులు వెతుక్కుని, కొత్త విధానాలు ఏర్పాటు చేసుకొని మరీ దోపిడీ చేశారు. విశాఖపట్నం, ఒంగోలు, చిత్తూరులో భూకబ్జాలకు పాల్పడ్డారు. ఇళ్ల నిర్మాణం పేరుతో దందా చేశారు. 23 పార్టీ కార్యాలయాల పేరుతో అక్రమాలకు పాల్పడ్డారు. వైకాపా నేతలు, కార్యకర్తలకు అసైన్డ్ భూములు అప్పగించారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం పేరుతో భూ దోపిడీకి కుట్రపన్నారు." అని చంద్రబాబు వెల్లడించారు. * విశాఖపట్నంలోని రామానాయుడు స్టూడియో భూములు కొట్టేసేందుకు విఫలయత్నం చేశారు. * వృద్ధాశ్రమానికి ఇచ్చిన హయగ్రీవ ల్యాండ్స్ కూడా కొట్టేశారు. * దసపల్లా భూములను కాజేసి ఇళ్లు కట్టారు. * మాజీ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అనేక భూ అక్రమాలకు పాల్పడ్డారు. * తిరుపతి, రేణిగుంటలోని మఠం భూములను కొట్టేశారు. * తిరుపతి జిల్లాలో భూ ఆక్రమణలు, అక్రమాలకు లెక్కే లేదు. 22-ఏ పెట్టి భూ ఆక్రమణలు చేశారు. * చిత్తూరులో 782 ఎకరాలు కాజేసేందుకు ప్రయత్నించారు. * పుంగనూరులో 982 ఎకరాలను పట్టా చేయించుకున్నారు. పేదవారి అసైన్డ్ భూములను లాక్కున్నారు. హౌసింగ్ కాలనీ ఎక్కడ రావాలో వైసీపీ నేతలే నిర్ణయించేవారు. ముందే స్థలం కొనేవారు.. అనేక రెట్ల పరిహారం కొట్టేసేవారు. * గ్రామాల్లో ఉండే ఖాళీ భూములను ఆక్రమించారు. నివాసయోగ్యం కాని భూములను ఇళ్లకు కేటాయించారు. * అక్రమంగా భవనాలు కట్టేశారు. ప్రశ్నించే వారిపై దాడులు చేశారు. * 13,800 ఎకరాలను జగన్ ప్రభుత్వం ఆ పార్టీ నేతలకు ధారాదత్తం చేసింది. వైసీపీ నేతలు తక్కువ ధరకు 40 వేల ఎకరాలు కొన్నారు. అధికారులను బెదిరించి భూములకు పట్టాలు తెచ్చుకునేవారు. అని చంద్రబాబు ఆరోపించారు. * భూహక్కు పత్రం పేరుతో ప్రచారానికి 13 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. * భూముల రీసర్వే పేరుతో సరిహద్దు రాళ్ళ మీద జగన్ చిత్రం ముద్రించుకున్నారు. * ఎంతో అహంభావంతో ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చారు. ఆ చట్టం దురుద్దేశాలను ప్రజలు గ్రహించారు. ఒకసారి భూములను చెక్ చేసుకోవాలని ప్రజలను కోరుతున్నా.. భవిష్యత్‌లో భూ కబ్జా చేయాలంటే భయపడేలా చేస్తాం. భూములు, ఆస్తులు కబ్జాకు గురైతే ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. గుజరాత్లో ఉన్న ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని ఇక్కడా తీసుకొస్తాం. తాము భూమి యజమానులమని కబ్జాదారులే నిరూపించుకోవాలి... అని చంద్రబాబు అన్నారు. * మైనింగ్, క్వారీ లీజుల్లో అనేక అక్రమాలకు పాల్పడ్డారు. బెదిరింపులు, భారీ జరిమానాలతో అనేక గనులు కొల్లగొట్టారు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ నిబంధనలకు తూట్లు పొడిచారు. * నిబంధనలు ఉల్లంఘించి గనులు తవ్వేశారు. అధికారులను డిప్యుటేషన్ మీద తెచ్చుకొని అక్రమాలకు పాల్పడ్డారు. ఇసుక తవ్వకాల్లో ప్రైవేట్ ఏజెన్సీలను తెచ్చారు. అక్రమంగా భారీ యంత్రాలు వాడారు. తవ్వకాల కోసం నదులు, కాలువలపై రోడ్లు వేశారు. ఇసుక దందాను ప్రశ్నించే వారిపై అట్రాసిటీ కేసులు పెట్టారు. కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లో భారీ ఇసుక దందాలు జరిగాయి. వైసీపీ నేతలకు కప్పం కట్టలేక అనేక మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇసుక దందాలో 9,750 కోట్ల రూపాయలు కొట్టేశారు. * ఏ ప్రభుత్వంలోనైనా అటవీ, గనులశాఖను సాధారణంగా ఒక వ్యక్తికి ఇవ్వరు. కానీ, వైసీపీ హయాంలో మాత్రం ఆ రెండుశాఖలను ఒకే వ్యక్తికి అప్పగించారు. తూర్పుగోదావరి జిల్లాలో లేటరైట్ గనులను బలవంతంగా లాక్కున్నారు. ప్రకాశం జిల్లాలో 250 క్వారీలపై దాడులు చేశారు. కుప్పం నియోజకవర్గంలోనే అక్రమంగా గనులు తవ్వేశారు. దౌర్జన్యం, బెదిరింపులు, జరిమానాల పేరుతో గనులను దోపిడీ చేశారు. ఆఖరికి ద్రావిడ యూనివర్సిటీలో అక్రమంగా మైనింగ్ చేశారు. చిత్తూరు జిల్లాలో టార్గెటెడ్ ఇన్‌స్పెక్షన్ల పేరుతో వేధించారు. గనుల కేటాయింపులో పారదర్శకత తీసుకువస్తాం.... అని చంద్రబాబు అన్నారు. * పర్యావరణాన్ని దెబ్బతీస్తే భావితరాలు దెబ్బతింటాయి. ప్రకృతి సంపద ప్రజలకు చెందాలి. గనులు బాధితులు ముందుకు రావాలి. ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలి. * అమరావతి రోడ్డుపై ఉన్న మట్టిని తవ్వుకొని పోయారు. * ఎర్రచందనం దొంగ రవాణా కోసం అక్రమాలకు పాల్పడ్డారు. ఎర్రచందనాన్ని అక్రమంగా చైనాకు పంపారు. ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ సిబ్బందిని తగ్గించారు. స్మగ్లర్లను ప్రోత్సహించారు. * రుషికొండలో 500 కోట్ల రూపాయలతో ప్యాలెస్ కట్టారు. రుషికొండ కట్టడాలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే. భీమిలి ఎర్రమట్టి దిబ్బల్ని పూర్తిగా మింగేశారు. * ప్రభుత్వ, ప్రైవేట్ భూముల పరిరక్షణకు ప్రజలంతా కలిసి రావాలి. భూగర్భ ఖనిజ సంపద సమాజహితానికి వినియోగించాలి. అడవులను మింగేసిన అనకొండలను శిక్షిస్తాం... అని చంద్రబాబు నాయుడు వివరించారు.
* ఒంగోలులో నకిలీ డాక్యుమెంట్లతో 101 కోట్ల రూపాయల ఆస్తి కాజేసేందుకు యత్నించారు. ఒంగోలు భూ కబ్జాలపై కేసులు నమోదు చేసి విచారణ చేపట్టాం.
http://www.teluguone.com/news/content/chandrababu-white-paper-on-natural-resources-25-180806.html





