ఈ ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు: బాబు
Publish Date:Jul 9, 2019
Advertisement
అభివృద్ది చేయడమే తాను చేసిన తప్పా అని టీడీపీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రశ్నించారు. అనంతపురం జిల్లా తాడిపత్రి నియోజకవర్గంలో హత్యకు గురైన టీడీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి కుటుంబాన్ని చంద్రబాబు మంగళవారం నాడు పరామర్శించారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సహాయం చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలు, నేతలు తమ గ్రామాల్లోకి వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన ఆరోపించారు. వైసీపీ చేసే దాడులు, దౌర్జన్యాలను ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు బనాయిస్తున్నారని బాబు ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తన ప్రాణాలను పణంగా పెడతానని చంద్రబాబు చెప్పారు. టీడీపీ నేత కేసరి రవిని పోలీసుస్టేషన్లో బట్టలు విప్పి నిర్భంధించారని బాబు ఆరోపించారు. అవసరమైతే ఇలాంటి ఘటనలపై ప్రైవేటు కేసులను పెడతామన్నారు.రాష్ట్రంలో చోటు చేసుకొన్న పరిస్థితులపై చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఎమ్మెల్యేకే రక్షణ లేదన్నారు. ఎమ్మెల్యేలకే ఈ ప్రభుత్వ హాయంలో రక్షణ కల్పించలేకపోయారని విమర్శించారు. మంచి ముఖ్యమంత్రిగా అనిపించుకొంటానని జగన్ చెప్పారన్నారు. ఎమ్మెల్యేలపై దాడులకు పాల్పడడం, కార్యకర్తలను బెదిరించడమే మంచి పాలనా అని బాబు నిలదీశారు. ఆరు నెలల వరకు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలనుకొన్నామన్నారు. కానీ, టీడీపీ కార్యకర్తలపై దాడులకు పాల్పడుతున్నారన్నారు. టీడీపీ కార్యకర్తలపై దాడులను నిరసిస్తూ రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేయాల్సిన పరిస్థితులను ప్రభుత్వం కల్పించిందన్నారు. తనకు నచ్చిన పార్టీలో చేరడమేనా భాస్కర్ రెడ్డి చేసిన తప్పు అని ఆయన ప్రశ్నించారు. భాస్కర్ రెడ్డిని వైసీపీ కార్యకర్తలు కొట్టి చంపారన్నారు. భాస్కర్ రెడ్డిని చంపిన వారు ఆయన పిల్లలకు ఏం సమాధానం చెబుతారని బాబు ఆవేదన వ్యక్తం చేసారు. నేరాలు, ఘోరాలు, హత్యలను ప్రజలెవరూ అంగీకరించబోరని, తప్పుడు పరిపాలన చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారని జగన్ సర్కార్ ని హెచ్చరించారు. అన్ని గ్రామాలు తిరిగి కార్యకర్తలను కాపాడుకుంటానన్న బాబు.. అవసరమైతే పరిస్థితులు చక్కబడే వరకు అక్కడే ఉంటానని చెప్పారు. "మీ గ్రామంలో మీరు ఏకాకి కాదు. టీడీపీ మీకు అండగా ఉంటుంది. మనది ఒక్క గ్రామానికే పరిమితమైన పార్టీ కాదు, రాష్ట్రం అంతటా ఉంటుంది. మీరు ఆత్మస్థయిర్యంతో ఉండాలి. ఎక్కడికి వెళ్లినా ఒక్కటే అడుగుతున్నారు, సార్ మేమంతా ఓట్లేశాం, ఆ ఓట్లు ఏమైపోయాయి అంటున్నారు. ఈ ప్రశ్నకు నా దగ్గర కూడా సమాధానం లేదు తమ్ముళ్లూ!" అన్నారు బాబు. "దాడులు చేయడం తప్పు అన్న వాళ్లపైనే తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇదేమన్నా రౌడీరాజ్యం అనుకుంటున్నారా? ఇది ప్రజాస్వామ్యం కాదా? ఏమనుకుంటున్నారు మీరు? ప్రాణం పోయినా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం" అంటూ బాబు ఆవేశపూరితంగా ప్రసంగించారు.
http://www.teluguone.com/news/content/chandrababu-slams-ycp-over-attacks-on-tdp-activists-39-87917.html





