లేఖలు రాస్తే వ్యాక్సిన్లు వస్తాయా? నేను తెప్పిస్తే మీరెందుకు?
Publish Date:May 10, 2021
Advertisement
వ్యాక్సిన్లకు ఆర్డర్లు పెట్టకుండా.. అడ్వాన్సులు చెల్లించకుండా.. కేవలం లేఖలు రాస్తే వ్యాక్సిన్ ఎలా సరఫరా చేస్తారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు.. సీఎం జగన్‌ను ప్రశ్నించారు. "నేను వ్యాక్సిన్ ఇప్పిస్తే వేస్తామనడం జగన్ దిగజారుడు తనానికి నిదర్శనం. నేను టీకా తెప్పిస్తే మరి మీరెందుకు సీఎంగా ఉండటం?" అని చంద్రబాబు మండిపడ్డారు. వ్యాక్సిన్ కోసం రూ.1600 కోట్లు ఖర్చు చేయలేరా? టీకా కోసం కేటాయించిన రూ.45 కోట్లు ఏ మూలకు సరిపోతాయి? అని ప్రభుత్వాన్ని నిలదీశారు. ప్రజల ప్రాణాలంటే జగన్‌రెడ్డికి లెక్కలేనితనంగా ఉందన్నారు. ప్రతిపక్షాలపై కుట్రలు ఆపి వ్యాక్సిన్ కోసం ఆర్డర్లు పెట్టాలన్నారు చంద్రబాబు. సీరం, భారత్ బయోటెక్ తయారుచేసిన వ్యాక్సిన్‌లో.. 50% రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆస్పత్రులకు ఇచ్చే విధంగా కేంద్రం విధానం చేసిందని చెప్పారు. కోట్ల డోసుల వ్యాక్సిన్ కోసం సీరం ఇన్స్టిట్యూట్, భారత్ బయోటెక్‌కు పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్డర్లు ఇచ్చాయన్నారు. ఆయా రాష్ట్రాల్లో 18-45 ఏళ్ల వయసు వారికి ఆయా ప్రభుత్వాలు వ్యాక్సిన్ అందిస్తున్నాయని తెలిపారు. మహారాష్ట్ర ప్రభుత్వం గ్లోబల్ టెండర్లను కూడా పిలిచిందని అన్నారు. కరోనా కట్టడి చర్యలపై ప్రభుత్వం వెంటనే అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్న క్యాంటీన్లను తెరిచి పేదల ఆకలి బాధ తీర్చాలని తెలిపారు. కరోనా బాధితులకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే 500మందికి పైగా వైద్య సేవలు అందించామని ప్రకటించారు. కరోనా దెబ్బకు గిట్టుబాటు ధరలేక ఇబ్బంది పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పును కూడా లెక్కచేయకుండా ప్రతిపక్ష నేతలపై కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.
http://www.teluguone.com/news/content/chandrababu-serious-comments-on-cm-jagan-about-govt-failure-of-vaccine-purchase-39-115170.html





