పాదయాత్రలో చంద్రబాబు వరాల జల్లు
Publish Date:Oct 18, 2012
Advertisement
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాగానే వ్యవసాయానికి 9 గంటల పాటు ఉచిత విద్యుత్తుని అందజేస్తామని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. రైతుల రుణాల మాఫీపై తొలి సంతకం చేస్తానని, బెల్ట్ షాపుల రద్దుపై రెండో సంతకం చేస్తానని చంద్రబాబు ప్రజలకు హామీ ఇచ్చారు. ఆదోనిలో తెదేపా అధినేత చంద్రబాబుని చూసేందుకు ఆయన ప్రసంగాన్ని వినేందుకు అశేష జనవాహిన పోటెత్తింది. వస్తున్నా మీకోసం పాదయాత్రలో బాబుకి జనం నుంచి మంచి స్పందన కనిపిస్తోంది. ఎక్కడికెళ్లినా ప్రజలు ఆయనకు ఇబ్బందులు ఏకరువు పెడుతున్నారు. కష్టాలనుంచి గట్టెక్కించమని వినతులు అందజేస్తున్నారు. కాంగ్రెస్ ప్రజాసంక్షేమాన్ని పూర్తిగా విస్మరించిందని చంద్రబాబు ఆదోని ప్రసంగంలో విమర్శించారు. తాగడానికి గుక్కెడు నీళ్లు ఇవ్వలేని ప్రభుత్వం కూడా ఓ ప్రభుత్వమేనా అంటూ సర్కారుపై నిప్పులు చెరిగారు. అవినీతిపైకి శూలాన్ని ఎక్కుపెట్టి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పేదలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు, తమ పార్టీ ఉద్యోగులకు వ్యతిరేకం కాదని, ఉద్దేశపూర్వకంగానే అలాంటి అభిప్రాయాన్ని ప్రచారం చేశారని చెప్పుకొచ్చారు. తమ హయాంలోనే ఎక్కువ ఉద్యోగాలిచ్చిన విషయాన్ని గుర్తుచేసుకోవాలని ఉద్యోగ సంఘాలను కోరారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు 50 గజాల ఇంటి స్థలాన్ని కేటాయించి, 50 శాతం రాయితీతో ఇళ్లు కట్టించి ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. పాదయాత్రలో ప్రజలనుంచి లభిస్తున్న ఆదరణను చూసి చంద్రబాబు చెలరేగిపోతున్నారు. ఇప్పట్నుంచే ఎన్నికల హామీలను గుప్పిస్తూ జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. నేనున్నా మీకోసం అనే భరోసాను కల్పించే ప్రయత్నాన్ని గట్టిగా చేస్తున్నారు. 2014 ఎన్నికల్ని ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న బాబు తన ఆరోగ్యాన్నికూడా లెక్కచేయకుండా పాదయాత్రని దీక్షతో కొనసాగిస్తున్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
http://www.teluguone.com/news/content/chandrababu-padayatra-31-18296.html





