చంద్రబాబు నా అన్నయ్య.. విజయసాయి!
Publish Date:Jul 16, 2022
Advertisement
రాజకీయాల్లో బంధాలు, బంధుత్వాలకు అంతగా ప్రాధాన్యం కనిపించదు. ఒకే కుటుంబంలోని వ్యక్తులు వేర్వేరు పార్టీల్లో ఉండొచ్చు. వేర్వేరు పార్టీల్లోని వేర్వేరు వ్యక్తులు అన్నదమ్ముల్లా మసలుకోనూ వచ్చు. వాస్తవానికి రాజకీయ నేతలందరిదీ ఒకే కుటుంబం.. అదే రాజకీయ కుటుంబం. ఈ ఉపోద్ఘాతం అంతా దేనికంటే.. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడికి వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తమ్ముడు. అవును.. మీరు సరిగ్గానే విన్నారు. చంద్రబాబు నాయుడికి విజయసాయిరెడ్డి వరసకు తమ్ముడు అవుతారు. రాజకీయంగా అనుక్షణం ఉప్పు నిప్పులా విమర్శలు, ఆరోపణలు చేసుకునే చంద్రబాబు- విజయసాయిరెడ్డి మధ్య బంధుత్వం ఉందా అన్న ఆశ్చర్యం అనవసరం. ఎందుకంటే ఇది నిజంగా నిజం. ఇలాంటి ఆసక్తికరమైన విషయాన్ని విజయసాయిరెడ్డే స్వయంగా బయటపెట్టారు. అది కూడా చంద్రబాబును, టీడీపీ నేతలను విమర్శించే క్రమంలోనే తమ బంధుత్వాన్ని విజయసాయి వెల్లడించడం గమనార్హం. చంద్రబాబు- విజయసాయిరెడ్డి మధ్య బంధుత్వం ఎలా ఏర్పడిందంటే.. విజయసాయి భార్య సోదరి కుమార్తెని దివంగత సీఎం, టీడీపీ వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు మనవడు తారకరత్న పెళ్లి చేసుకున్నారు. దాంతో చంద్రబాబు నాయుడు తనకు వరసకు అన్నయ్య అవుతారని విజయసాయిరెడ్డి వెల్లడించారు. అరబిందో సంస్థకు, అదాన్ కంపెనీకి విజయసాయిరెడ్డి బంధువు ఒకరు కామన్ డైరెక్టర్. దీంతో అడాన్ కంపెనీతో తనకు సంబంధాలు ఉన్నాయని చంద్రబాబు, ఎల్లో మీడియా అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు విజయసాయి ఫైరవుతున్నారు. ఒక డైరెక్టర్ ఎన్నో సంస్థలకు డైరెక్టర్ గా ఉన్నంత మాత్రాన ఆయా కంపెనీలన్నీ ఆయనవి అయిపోతాయా? అనేది విజయసాయి ప్రశ్న. చంద్రబాబు తనకు వరసకు అన్న అవుతారని.. అలా అయితే.. చంద్రబాబు ఆస్తులన్నీ నావే అవుతాయా? అనేది విజయసాయి ప్రశ్న. రాజకీయంగా ఎదుర్కోలేక చంద్రబాబు, లోకేష్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ అఫీషియల్ ట్విటర్ వేదికగా విజయసాయి రాసుకొచ్చారు. ఉదయం లేచింది మొదలు టీడీపీపైన, చంద్రబాబు, లోకేష్ పైన విమర్శలు, ఆరోపణలు చేసే విజయసాయిరెడ్డికి చంద్రబాబు అన్నయ్య అవుతారన్న వాస్తవాన్ని విమర్శిస్తూనే బయటపెట్టారు. ఇంతకీ విజయసాయి ఇప్పుడీ విషయాన్ని ఎందుకు బయటపెట్టినట్టు. ఒక వైపు విమర్శలు గుప్పిస్తూనే, మరో వైపు అన్న అంటూ బంధుత్వాన్ని ఎందుకు కలుపుకున్నట్లు అన్న ప్రశ్నలకు ముందు ముందు తెలుగుదేశంతో ఏ రాజకీయ అవసరాలు ఉంటాయో అన్న సందేహమే కారణమని సామాజిక మాధ్యమంలో విజయసాయిపై సెటైర్లు పేలుతున్నాయి.
http://www.teluguone.com/news/content/chandrababu-is-my-big-brother-says-vijayasai-25-139889.html





