ఉద్యోగుల అణిచివేత దారుణం.. మహిళలపై తీవ్ర నేరాలు.. జగన్‌పై చంద్రాగ్రహం
Publish Date:Apr 25, 2022
Advertisement
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ ఏ ఒక్కరు రోడ్డెక్కినా.. వారిని అణచివేయడమే లక్ష్యంగా జగన్ రెడ్డి పాలన సాగిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. ఇప్పటి వరకూ ప్రతిపక్షాలను వేధించారు., ఇప్పుడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు హక్కులు కాపాడాలని నిరసనకు సిద్ధమైతే అరాచకంగా అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో పీఆర్సీ విషయంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఉద్యమానికి.. నేడు సీపీఎస్ ఉద్యమంపై ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకుంటోందన్నారు. హక్కుల కోసం ఐక్య పోరాటం చేయడానికి కూడా వీల్లేదు అనేలా అరెస్టులు చేస్తున్నారని.. హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో 800 మందికి పైగా మహిళలపై తీవ్ర స్థాయి నేరాలు చోటు చేసుకుంటే.. ఎంత మందికి న్యాయం చేశారో, ఎందరిని శిక్షించారో సమాధానం చెప్పాలని చంద్రబాబు నిలదీశారు. జగన్ తన అసమర్థ పాలనతో యువత భవిష్యత్ కాలరాసాడని తప్పుబట్టారు. రాష్ట్రంలో పెట్టుబడులు లేక, పరిశ్రమలు రాక, ఉపాధి దొరక్క యువత ఫ్యూచర్ అగమ్య గోచరంగా మారిందని అన్నారు. జగన్ తమకు చేసిన నష్టంపై యువత తీవ్ర అవేదన, అసంతృప్తితో ఉన్నారని చంద్రబాబు చెప్పారు. దేశంలో ఎక్కడా లేని విధంగా విద్యా సంవత్సరాన్ని జూన్ 12 నుండి జులై 8కి మార్చడం ఏంటి? స్కూళ్లను మూసివేయడం వంటి విధానాలతో విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్ట్‌ను జగన్ ప్రభుత్వం తన అసమర్ధతకు బలి చేసిందని చంద్రబాబు ఆరోపించారు. డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే మూడేళ్లు జగన్ ప్రభుత్వం ఎందుకు దాచి పెట్టిందని ప్రశ్నించారు. పోలవరం అథారిటీ, కేంద్ర ప్రభుత్వం తప్పుబట్టినా.. మూర్ఖంగా ముందుకు వెళ్లి ప్రాజెక్టుని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డయాఫ్రం వాల్ ఎందుకు కూలిందో చెప్పకుండా.. తెలుగుదేశంపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు చంద్రబాబు.
http://www.teluguone.com/news/content/chandrababu-fire-on-cm-jagan-39-134952.html





