రాఫెల్ తీర్పుపై సమీక్ష అవసరంలేదు.. ఆ తీర్పు సరైనదే
Publish Date:May 4, 2019
Advertisement
రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంపై కేంద్రం ప్రభుత్వం సుప్రీం కోర్టులో తాజాగా అఫిడవిట్ దాఖలు చేసింది. రాఫెల్ ఒప్పందంపై సీబీఐ దర్యాప్తు అవసరం లేదని.. రివ్యూ పిటిషన్లను కొట్టివేయాలని కోరింది. ఈ విషయంపై గత ఏడాది డిసెంబరు 14న ఇచ్చిన తీర్పు సరైనదేనని కేంద్రం అఫిడవిట్లో పేర్కొంది. ఆ తీర్పును సమీక్షించాల్సిన అవసరం లేదని తెలిపింది. సోమవారం సుప్రీంకోర్టులో రాఫెల్ రివ్యూ పిటిషన్లు విచారణకు రానున్న నేపథ్యంలో కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది. 36 రాఫెల్ విమానాల కొనుగోలుకు సంబంధించిన ధరల వివరాలను కాగ్‌కు సమర్పించామని వివరించింది. యూపీఏ ప్రభుత్వం హయాంలో జరిగిన ఒప్పందం కంటే 2.86శాతం తక్కువకే కొనుగోలు చేసేలా ఒప్పందం కుదిరిందన్నారు. రివ్యూ పిటిషనర్లు ప్రశాంత్ భూషణ్, అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా కేవలం మీడియాలో వచ్చిన నిరాధారపూరిత సమాచారంపైనే ఆధారపడుతున్నారని కేంద్రం ఆరోపించింది. ఎంపికచేసి మరీ ఉద్దేశ్యపూర్వకంగా వారు బయటపెట్టిన కొన్ని అంతర్గత ఫైల్ నోటింగ్స్.. సుప్రీంతీర్పు పునఃసమీక్షకు ఆధారం కాజాలవని కేంద్రం వాదించింది. పిటిషనర్లు పొందుపరిచిన పత్రాలు రహస్య పత్రాల్లో కొంతభాగమేనని.. అవి ఒప్పంద సమయంలో నిపుణులు ఇచ్చిన సలహాలకు సంబంధించినవని తెలిపింది. అవి తుది ఒప్పందానికి చెందినవి కావని అభిప్రాయపడింది. ఇది దేశ రక్షణకు సంబంధించిన అంశమని.. కావున రహస్య పత్రాలను బహిర్గతం చేయాల్సిన అవసరం లేదని కోర్టుకు వివరించింది. రాఫెల్ యుద్ధవిమానాల ఒప్పందంలో కేంద్రప్రభుత్వానికి క్లీన్చిట్ ఇస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సమీక్షించాలంటూ రివ్యూ పిటిషన్లు దాఖలైన విషయం తెలిసిందే. దీనిపై కోర్టు స్పందిస్తూ.. పిటిషనర్లు పొందుపరిచిన రహస్య పత్రాల ఆధారంగా విచారణ చేపట్టడానికి అంగీకరించింది. ఈ అంశం ఏప్రిల్ 30న విచారణకు రాగా.. అఫిడవిట్ దాఖలుకు నాలుగు వారాల సమయం కావాలని కేంద్రం కోరింది. దీనికి నిరాకరించిన కోర్టు నాలుగు రోజుల్లోగా తమ అభిప్రాయాన్ని తెలియజేయాలని ఆదేశించింది.
http://www.teluguone.com/news/content/centre-files-fresh-affidavit-says-2018-judgment-correct-39-86845.html





