వైసీపీకీ కేంద్రం ఝలక్?!
Publish Date:Jul 26, 2023
Advertisement
నాలుగేళ్లుగా కేంద్రంలోని బీజేపీ సర్కార్ నించోమంటే నించుని, కూర్చోమంటే కూర్చుని రాష్ట్ర ప్రయోజనాలను పూర్తిగా విస్మరించి మరీ అడుగులకు మడుగులోత్తిన జగన్ సర్కార్ కు సరిగ్గా ఎన్నికల ముందు దిమ్మతిరిగేలా ఝలక్ ఇచ్చింది మోడీ ప్రభుత్వం. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లా అయిన కడపలో స్టీల్ ఫ్యాక్టరీకి అవకాశాలు ఇసుమంతైనా లేవని పార్లమెంటు సాక్షిగా కేంద్రం కుండబద్దలు కొట్టేసింది. సెయిల్ అధ్యయనం కడపలో స్టీల్ ఫ్యాక్టరీ నిర్మాణానికి అవకాశాలు లేవని తేల్చిందని నిన్న పార్లమెంటులో కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ ప్రకటించారు. అయితే రాష్ట్రంలో ఉక్కు కర్మాగారం సాధ్యాసాధ్యాలపై, ఏర్పాటు చేసిన జాయింట్ టాస్క్‌ఫోర్స్ నివే దిక ఎప్పటికి వస్తుంది అన్న విషయాన్ని కూడా ఆయన పేర్కొనలేదు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ సీమ ప్రజల ఆకాంక్ష, దానిని సాధించి తీరుతామంటూ ఇప్పటి వరకూ చెబుతూ వచ్చిన సీఎం జగన్ ఇక రాయలసీమ వాసులకు ముఖం ఎలా చూపించగలరని విపక్షాలు నిలదీస్తున్నాయి. కడన స్టీల్ ఒక్కటే అని కాదు.. విశాఖ రైల్వే జోన్ ను కూడా అటకెక్కించేసినట్లేనని నిత్యానందరాయ్ సమాధానంతో తేటతెల్లమైపోయింది. కనీసం ఆంధ్రులు పోరాడి సాధించుకున్న కడప స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించబోమన్న మాట కూడా ఆయన నోటి వెంట రాలేదు. విశాఖ ఉక్కును ఎట్టిపరిస్థితుల్లోనూ ప్రైవేటు పరం కానీయబోమని ఇంత కాలం చెబుతూ వచ్చిన సీఎం జగన్, ఆయన పార్టీ నేతలు, ఎంపీలు, ఎంపీలు కంగుతినేలా కేంద్రమంత్రి తాజా ప్రకటనలో ప్రైవేటీకరణ ఉండదన్న మాట కూడా రాలేదు. గతంలో సోము వీర్రాజు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో, ఆయనతో, బీజేపీ అగ్రనేతలంతా.. విశాఖ రైల్వేజోన్ సాధిస్తామని గంభీరమైన ప్రకటనలు చేశారు. సోము వీర్రాజయితే ఒక అడుగు ముందుకేసి.. రైల్వే జోన్ రాదని మీకెవరు చెప్పారని మీడియాపై రుసరుసలాడారు. ఎంపి జీవీఎల్ కూడా పలు మీడియా సమావేశాల్లో విశాఖ రైల్వే జోన్ పై హామీలు గుప్పించారు. ఇప్పుడు కేంద్రమంత్రి ప్రకటనతో జగన్ సర్కార్ కు దిక్కు తోచని పరిస్థితి ఎదురైంది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న సమయంలో ఇంత కాలం తాము చేసిన గంభీర ప్రకటనలన్నీ డొల్లేనని తేటతెల్లమయ్యేలా పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ చేసిన ప్రకటనతో ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ కాళ్ల కింద నేల కదిలిపోయినట్లైంది. ఇంత కాలం ఊరిస్తూ వచ్చిన బీజేపీ వైసీపీ ఆయువుపట్టుమీద దెబ్బకొట్టినట్లైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇంత కాలం వైసీపీ ఏం చెబుతూ వచ్చిందో.. జగన్ పదే పదే ఢిల్లీ వెళ్లి మోడీ, అమిత్ షాలతో భేటీ అయ్యి ఏ డిమాండ్లైతే చేశానని చెబుతూ వచ్చారో అవన్నీ ఉత్తుత్తి మాటలే అని తేటతెల్లమయ్యేలా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ ప్రకటన ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితి నడి సంద్రంలో చుక్కాని లేని నావగా మిగిలిపోయింది. కేంద్ర మంత్రి నిత్యానందరాయ్ పార్లమెంటు వేదికగా చేసిన ప్రకటన రాజకీయంగా వైసీపీ ప్రతిష్టను, వ్యక్తిగతంగా జగన్ పరువును నిండా గంగలో ముంచేసిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గత ఎన్నికల ముందు తమకు ఎంపీ సీట్లు మొత్తం ఇస్తే, కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామన్న జగన్ ఇప్పుడు ఏ ధైర్యంతో మళ్లీ ప్రజలను ఓట్లు అడుగుతారని విపక్షాలు నిలదీస్తున్నాయి. ఇప్పుడిక కేంద్రంపై వైసీపీ యుద్ధ భేరి మోగించినా చేతులు కాలిన తరువాత ఆకులుపట్టుకున్న చందమే అవుతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నాలుగేళ్లుగా కేంద్రంలోని మోడీ సర్కార్ తో అంటకాగింది జగన్ స్వప్రయోజనాల పరిరక్షణకేనని జనానికి పూర్తిగా అర్థమయ్యిందని రాజకీయవర్గాలు అంటున్నాయి.
http://www.teluguone.com/news/content/center-shock-to-jagan-25-159022.html





