వరంగల్ విమానాశ్రయానికి కేంద్రం పచ్చ జెండా.. ఓరుగల్లు పోదాం.. రామప్పను చూసొద్దాం!
Publish Date:Mar 1, 2025
Advertisement
వరంగల్ కు మహర్దశ పట్టనుంది. ఐటీ, టూరిజం అభివృద్ధి కొత్త పుంతలు తొక్కనుంది. ఇందుకు వరంగల్ లో విమానాశ్రయానికి కేంద్రం పచ్చజెండా ఊపడమే కారణం. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న వరంగల్ విమానాశ్రయానికి కేంద్రం శుక్రవారం (ఫిబ్రవరి 28) అనుమతులు మంజూరు చేసింది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఢిల్లీలో భేటీ అయిన తరువాత ఈ అనుమతులు మంజూరు కావడం విశేషం. ఈ భేటీలో వరంగల్ సమీపంలోని మామునూరు ఎయిర్ పోర్ట్ ప్రస్తావన కూడా వచ్చింది. ఈ విమానాశ్రయ అభివృద్ధి కోసం ఇప్పటికే తెలంగాణ సర్కార్ 205 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఈ నిధులను భూసేకరణ కోసం వినియోగించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజ్ణప్తికి సానుకూలంగా స్పందించిన ప్రధాని మోడీ వెంటనే ఆమోదం తెలిపారు. దీంతో పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మెహన్ నాయుడు ఆఘ మేఘాల మీద వరంగల్ విమానాశ్రాయినికి అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పుడు కేంద్రం చొరవతో హెచ్ఐఏఎల్ వరంగల్ విమానాశ్రయానికి అభ్యంతరం లేదంటూ ఎన్ వోసీ (నో అబ్జెక్షన్ సర్టిఫికేట్) కూడా ఇచ్చేసింది. ఇక ఇప్పటికే ఉన్న మామునూరు విమానాశ్రయాన్ని విస్తరించేందుకు భూసేకరణ చేయాల్సి ఉంది. ఇందు కోసం తెలంగాణ ప్రభుత్వం 205 కోట్లు విడుదల చేసింది. మూమునూరు విమానాశ్రయ అధీనంలో ఇప్పటికే దాదాపు 700 ఎకరాల భూమి ఉంది. బ్రిటిష్ కాలంలో దీనిని ఆర్మీ బేస్ గా వాడుకున్నారు. ప్రస్తుతం ఈ విమానాశ్రయం నిరుపయోగంగా ఉన్నప్పటికీ, దీని అధీనంలో భూమి ఉంది. దానికి అదనంగా గాడిపల్లి, గుంటూరుపల్లి, నక్కలపల్లి గ్రామాల నుంచి మరో 253 ఎకరాలు సేకరిస్తే సరిపోతుంది. ఆపరేషన్ లో లేకపోయినప్పటికీ ఇప్పటికే అక్కడ విమానాశ్రయం ఉంది. దానిని విస్తరిస్తే సరిపోతుంది. దానికి ఇక అన్ని అడ్డంకులూ తొలగిపోవడంతో విమానాశ్రయ విస్తరణ పెద్ద సమయం పట్టే విషయం కాదు. భూసేకరణకు ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేయడం, భూములు కోల్పోతున్న రైతులు, యజమానులకు మంచి నష్టపరిహారం ఇవ్వడానికి కూడా సంసిద్ధంగా ఉండటంతో భూ సేకరణ కూడా త్వరిత గతిన పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఈ విమానాశ్రయం అందుబాటులోకి వస్తే ఇక వరంగల్ అభివృద్ధి ఆకాశమే హద్దు అన్నట్లుగా పరుగులు పెడుతుందనడంలో సందేహం లేదు. పర్యాటకంగా, ఐటీ, పారిశ్రామిక పరంగా వరంగల్ అభివృద్ధికి అపార అవకాశాలున్నాయి. ఇప్పటికే వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి పర్యాటకుల తాకిడి మరింత పెరుగుతుంది. అవే కాకుండా వరంగల్ కోట, భద్రకాళి దేవాలయం, వేయి స్తంభాల గుడి..ఇలా వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. విమానాశ్రయం అందుబాటులోకి వస్తే దేశ, విదేశీ పర్యాటకుల సంఖ్య ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది. అలాగే పారిశ్రామికంగా, వ్యాపార, వాణిజ్య పరంగా జిల్లా శరవేగంగా అభివృద్ధి చెందే అవకాశలు పుష్కలంగా ఉన్నాయి. దేశ విదేశాల నుంచి పర్యటకులు ఓరుగల్లు పోదాం.. అంటూ రెక్కలు కట్టుకుని వాలడం ఖాయం. అంతే కాకుండా తెలంగాణలో వరంగల్ మరో మెట్రో నగరంగా అభివృద్ధి చెందడం తథ్యం.
ఇంత కాలం వరంగల్ విమానాశ్రయానికి అడ్డంకిగా నిలిచిన కేంద్రం, హెచ్ఐఏఎల్ (హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు లిమిటెడ్) మధ్య ఉన్న ఒప్పందం నుంచి మినహాయింపు కూడా ఇచ్చేశారు.. శంషాబాద్ ఎయిర్ పోర్టు కు 150 కిలోమీటర్ల పరిధిలో కొత్తగా విమానాశ్రయం ఏర్పాటు చేయకూడదు అన్నదే ఆ ఒప్పందం. ఆ ఒప్పందం కాల వ్యవధి పాతికేళ్లు. ఆ కారణంగానే ఇప్పటి వరకూ తెలంగాణ రాష్ట్రంలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు అవకాశం లేకుండా పోయింది.
http://www.teluguone.com/news/content/center-approves-warangal-airport-39-193641.html





