ఐటీ నుంచి ఏఐ వరకు.. నారా లోకేష్ ట్రాన్స్‌ఫార్మేషన్!
Publish Date:Jun 23, 2026
Advertisement
పనితీరుని చూడలేని కబోది నాయకుల విమర్శల నుండి ఎదిగిన పరిణితి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నారా లోకేష్ ప్రస్థానం ఒక అద్భుతం. ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కుమారుడిగా, ఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న నేతగా మాత్రమే గుర్తింపు ఉన్న యువకుడు నారా లోకేష్. అదే నారా లోకేష్ ఇప్పుడు ప్రజా క్షేత్రంలో తిరుగులేని నాయకుడిగా ట్రాన్స్ ఫార్మ్ అయ్యారు. ప్రజా సమస్యల పరిష్కారం నుంచి రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, విద్యా పరంగా దేశంలోనే నంబర్ వన్ గా నిలిపే విషయంలో ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు, అదే సమయంలో రాజకీయ ప్రత్యర్థుల విమర్శలకుర దీటుగా ఇస్తున్న కౌంటర్లు.. ఆయనలోని పరిణితికి అద్దం పడుతున్నాయి. అదే సమయంలో జాతీయ మీడియాకు ఇస్తున్న ఇంటర్వ్యూలో ఆయన ప్రదర్శిస్తున్న పరిణితి అందరినీ విస్మయ పరుస్తోంది. జాతీయ మీడియా అడిగిన ప్రశ్నలకు ఇసుమంతైనా తడబాటు లేకుండా స్పాంటేనియస్ గా ఇస్తున్న సమాధానాలు, గణాంకాలతో సహితంగా ఆయన చెబుతున్న వివరాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఐటీ నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు ఆంధ్రప్రదేశ్‌ను ఎలా నడిపించబోతున్నారో ఇటీవల ఒక జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో లోకేష్ వివరిం వివరించిన తీరు ఆయన పొలిటికల్ ట్రాన్స్‌ఫార్మేషన్‌ను కళ్ళకు కట్టింది. లోకేష్ విజన్‌కు దిగ్గజ నేతలు సైతం ఫిదా అవుతున్నారు. అయితే నారా లోకేష్ లోని మార్పు ఒక్క రోజులో వచ్చింది కాదు. 2019 మంగళగిరి ఎన్నికల ఓటమి లోకేష్‌ను రాటుదేల్చింది. కేవలం 5,337 ఓట్ల తేడాతో ఓడిపోయిన ఆయన..కుంగిపోలేదు.. వెనకడుగు వేయలేదు. అదే మంగళగిరిని తన స్థావరంగా మార్చుకుని ప్రజా సమస్యలపై పోరాడారు. ఆ తర్వాత ఆయన చేపట్టిన 400 రోజుల యువగళం పాదయాత్ర లోకేష్ రాజకీయ భవిష్యత్తును పూర్తిగా మార్చేసింది. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు సుమారు నాలుగువేల కిలోమీటర్ల మేర సాగిన ఈ యాత్రలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ఫలితంగా 2024 ఎన్నికల్లో మంగళగిరిలో 91,413 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించి.. గత 39 ఏళ్లుగా అక్కడ గెలుపు అన్నదే ఎరుగని తెలుగుదేశం పార్టీకి అద్భుత విజయాన్ని అందించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల అభివృద్ధి , రియల్ టైమ్ గవర్నెన్స్ శాఖల మంత్రిగా లోకేష్ సరికొత్త పాలనా విధానాన్ని ప్రవేశపెడుతున్నారు. కేవలం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' మాత్రమే కాకుండా.. 'స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ను తమ ప్రభుత్వ పాలసీగా మార్చేశారు. ఇందుకు ఉదాహరణగా పుట్టపర్తిలో ఏఎంసీఏ ప్రాజెక్ట్ కోసం కేవలం 37 రోజుల్లోనే భూసేకరణ పూర్తి చేయడాన్ని చెప్పుకోవచ్చు. గూగుల్ వంటి దిగ్గజ సంస్థల ప్రాజెక్టులను వేగంగా ఆకర్షిస్తూ, రాష్ట్రంలోకి పెట్టుబడుల వరద పారించేలా ప్రణాళికా బద్ధంగా ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇప్పటికే ఏకంగా 24 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ప్రతిపాదనలను సాధించామని, వాటిని త్వరితగతిన కార్యరూపంలోకి తీసుకురావడమే తమ లక్ష్యమని లోకేష్ గణంకాలతో సహా జాతీయ మీడియా ముందు ఆవిష్కరించిన తీరు ఆయనకు ప్రత్యర్థుల నుంచి సైతం ప్రశంసలు దక్కేలా చేసింది. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్‌ను 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలనే భారీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు చెప్పిన నారా లోకేష్.. గతంలో హైదరాబాద్ ఐటీ రంగాన్ని ఎలా నిర్మించామో, అంతకంటే మెరుగైన ఫలితాలను విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్‌లో కేవలం 10 ఏళ్లలోనే సాధించి చూపిస్తామని లోకేష్ ధీమాగా చెబుతున్నారు. డిజిటల్ టెక్నాలజీ, లైవ్ డేటా ఫీడ్స్, రియల్ టైమ్ డ్యాష్‌బోర్డుల ద్వారా రికార్డు స్థాయిలో 52 లక్షల మందిని తెలుగుదేశం సభ్యులుగా చేర్పించిన లోకేష్ ఇప్పుడు అదే సాంకేతికతను ఏపీ అభివృద్ధికి సమర్థంగా వాడుతున్నారు. నారా లోకేష్ ఈ పొలిటికల్ ట్రాన్స్‌ఫార్మేషనే ఆయనను ప్రజా నాయకుడిగా అందరూ గుర్తించేలా చేస్తోంది.
http://www.teluguone.com/news/content/cbns-son-to-peoples-leader-39-223878.html





