ఏపీ హౌసింగ్ బోర్డు ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారం
Publish Date:Jul 28, 2025
Advertisement
బిడదారి ఎస్టేట్ లో కాలినడకన కలియదిరిగిన చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు సింగపూర్ పర్యటన ఆయన విజన్ కు అద్దం పడుతోంది. తన సింగపూర్ పర్యటనలో భాగంగా రెండో రోజ సోమవారం (జులై 28) ఆయన తన టీమ్ తో సింగపూర్ లో పది వేల కుటుంబాలు నివశించే బిడదారి ఎస్టేట్ ను సందర్శించారు. ఆంధ్రప్రదేశ్ లో భారీ ఎత్తున అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టులు చేపట్టాలన్న ప్రభుత్వ ప్రణాళికలలో భాగంగా సింగపూర్ లో అర్బన్ హౌస్ ప్లానింగ్ ను పరిశీలించేందుకే చంద్రబాబు బృందం బిడదారి ఎస్టేస్ సందర్శించింది. సిటీ ఇన్ ఎ గార్డెన్ పేరుతో ఏర్పాటైన ఈ హౌసింగ్ ప్రాజెక్ట్ విశిష్టతలను సింగపూర్ అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించారు. మొత్తం 250 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ హౌసింగ్ ప్రాజెక్టు ప్రాంతంలో సుమారు రెండు గంటల పాటు సీఎం చంద్రబాబు కాలి నడకన కలియదిరిగారు. ఈ క్రమంలో ఏపీకి సింగపూర్ దేశానికి ఉన్న అనుబంధాన్ని ఆ దేశ అధికారుల వద్ద సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. అలాగే అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించిన ఆలోచనలను వారితో పంచుకున్నారు. కొత్త ఆలోచనలతో, ఆధునిక వసతులతో ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు చెప్పిన చంద్రబాబు.. ఇందుకోసం ఉత్తమ విధానాలు అనుసరిస్తూ భవిష్యత్ నగరాన్ని తీర్చి దిద్దుతు న్నామన్నారు. అమరావతి కోసం సింగపూర్ ప్రభుత్వం ఇప్పటికే మాస్టర్ ప్లాన్ ఇచ్చిందనీ, రాజధాని నిర్మాణంలో ప్రపంచ బ్యాంకు కూడా భాగస్వామి అవుతోందనీపేర్కొన్నారు. గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్ - ఏపీ ప్రభుత్వాల మధ్య కొంత అంతరం వచ్చిందన్న ఆయన గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడంతో పాటు.. గ్యాప్ ను తగ్గించేందుకే ప్రస్తుతం తాను సింగపూర్ వచ్చి నట్లు చెప్పారు. భవిష్యత్‌లోనూ సింగపూర్-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య సహకారం కొనసాగాలని ఆకాంక్షించారు. బిడదారి ఎస్టేటులో గృహ సముదాయాల నిర్మాణం చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా... చేపట్టారు. ప్రకృతితో మమేకమయ్యేలా చేపట్టిన ఈ నిర్మాణాల వల్ల పర్యావరణానికి ఎలాంటి హానీ కలగదు. అంతే కాకుండా నివాసితులకు ఆహ్లాదాన్ని పంచే విధంగా నిర్మాణాలు ఉన్నాయి. కాగా ఈ సందర్భంగా చంద్రబాబు గృహ సముదాయాల నిర్మాణ వ్యయంపై కూడా చర్చించారు. పట్టణ, నగర ప్రాంతాల్లో అందుబాటు ధరల్లో ఉండేలా చూడడంతో పాటు.. నాణ్యమైన నివాస గృహాల నిర్మాణాల చేపట్టామని చంద్రబాబుకు సింగపూర్ అధికారులు చెప్పారు. బిడదారి హౌసింగ్ ప్రాజెక్టును సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు తీర్చిదిద్దిన తీరును ముఖ్యమంత్రి ప్రశంసించారు. సింగపూర్ ప్రభుత్వం చేపట్టిన ఈ హౌసింగ్ ప్రాజెక్టు అన్ని వసతులతో పర్యావరణ హితంగా అద్భుతంగా నిర్మించారని చంద్రబాబు కితాబిచ్చారు. స్మశాన ప్రాంతాన్ని సుందరమైన పార్క్‌గా సింగపూర్ అర్బన్ రీడెవల్పమెంట్ అథారిటీ మార్చడం ఆకట్టుకుందని చంద్రబాబు అన్నారు. ఏపీలో చేపట్టనున్న అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారంపై చర్చించారు. ఏపీలో, అమరావతిలో చేపట్టబోయే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు అధికారులను ముఖ్యమంత్రి కోరారు. రాజధాని అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలు, ఆలోచనలు, ప్రణాళికలను వారితో పంచుకున్నారు.
బిడదారి హౌసింగ్ ప్రాజెక్టు సందర్శన అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పొరేషన్ ఎంటర్ ప్రైజ్ సహా ప్రపంచ బ్యాంకు అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.
http://www.teluguone.com/news/content/cbn-seeks-singapore-cooperation-in-ap-housing-project-25-202919.html





