జగనన్న కాలనీలు కాదు..పీఎంఏవై ఎన్టీఆర్ నగర్ లు
Publish Date:Jan 10, 2025
Advertisement
జగన్ హయాంలో అంతకు ముందు వరకూ ఉన్న పథకాల పేర్లను ఇష్టారీతిగా మార్చేసిన విషయం తెలిసిందే. వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పథకాలకు అప్పటి వరకూ ఉన్న పేర్లను మార్చేసి వాటికి వైఎస్ఆర్, జగనన్న పేర్లు పెట్టి కొనసాగించారు. కేవలం పథకాలకే కాకుండా ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి వైఎస్ఆర్ పేరు, అలాగే విశాఖలో అబ్దుల్ కలామ్ వ్యూపాయింట్ ను వైఎస్ఆర్ వ్యూ పాయింట్ గా మార్చేశారు. ఈ పేర్ల మార్పుపై అప్పట్లోనే పెద్ద ఎత్తున వివాదం రేగింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిేన తరువాత జగన్ హయాంలో ఇష్టారీతిగా పేర్లు మార్చి వైఎస్, జగన్ పేర్లు పెట్టుకున్న పథకాల పేర్లను మారుస్తూ వస్తున్నారు. ఆ క్రమంలోనే ఇప్పటికే జగనన్న విద్యాకానుక పథకాన్ని సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రగా, జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాలకు పోస్టు మెట్రిక్ స్కాలర్ షిప్, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధిగా, జగనన్న గోరు ముద్దను డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనంగా, జగనన్న ఆణిముత్యాలు పథకాన్ని అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారంగా, వైఎస్ఆర్ కళ్యాణమస్తు పథకాన్ని చంద్రన్న పెళ్లి కానుకగా, వైఎస్ఆర్ విద్యా వసతి పేరును ఎన్టీఆర్ విద్యావసతిగా, జగన్ సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహకం పేరును సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రోత్సాహకాలుగా, జగనన్న శాశ్వత భూహక్కు – భూరక్షణ పథకాన్ని ఏపీ రీ సర్వే ప్రాజెక్టుగా మార్చిన సంగతి తెలిసిందే. తాజాగా జగనన్న కాలనీల పేర్లను మార్చింది. జగనన్న కాలనీలను ‘పీఎంఏవై-ఎన్టీఆర్’ నగర్‌గా మార్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులతో ఆ కాలనీలో రాష్ట్ర ప్రభుత్వ నిధులను కలిపి పక్కా ఇళ్లను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
http://www.teluguone.com/news/content/cbn-sarkar-change-name-of-jagananna-colonies-39-191171.html





