బాబు హస్తిన టూర్.. వైసీపీలో భయం..జగన్ అరెస్టేనా?
Publish Date:May 21, 2025
Advertisement
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మద్యం కుంభకోణం కేసులో నేడో రేపో అరెస్టు కానున్నారా? అంటే జరుగుతున్న పరిణామాలను ప్రస్తావిస్తూ విశ్లేషకులు ఔననే అంటున్నారు. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కీలక వ్యక్తులను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. వారిని విడివిడిగా, కలిసి విచారించిన సిట్.. కీలక ఆధారాలు సేకరించిందని అంటున్నారు. వాటి ఆధారంగా ఈ కేసులో అంతిమ లబ్ధిదారు జగన్ అన్న నిర్ధారణకు వచ్చిన సిట్ అధికారులు ఆయన అరెస్టుకు రంగం సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ కేసులో అత్యంత కీలకంగా భావిస్తున్న రాజ్ కేశిరెడ్డి అప్రూవర్ గా మారడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. అంతే కాకుండా ఆయన న్యాయవాది కోర్టులోనే ఈ కేసులో పెద్దలు తప్పించుకుని తన క్లయింట్ రాజ్ కేశిరడ్డిని బలిపశువులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారంటూ చేసిన వ్యాఖ్యలు రాజ్ కేసిరెడ్డి బ్రేక్ డౌన్ అయ్యి మద్యం కుంభకోణం కేసు సూత్రధారులు, వాస్తవ లబ్ధిదారుల వివరాలు వెల్లడించేసి ఉండొచ్చని కూడా అంటున్నారు. అలాగే ఇదే కేసులో అరెస్టైన జగన్ కు అత్యంత సన్నిహితులైన గోవిందప్ప, ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డిల ద్వారా కూడా కీలక సమాచారం రాబట్టిన సిట్.. ఇక జగన్ అరెస్టు దిశగా అడుగులు వేస్తున్నదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అన్నిటికీ మించి వైసీపీ నాయకులు, శ్రేణులే జగన్ అరెస్టు తధ్యమన్న భావనలో ఉన్నారంటున్నారు. మాజీ మంత్రి పేర్ని నాని వంటివారు బాహాటంగానే జగన్ అరెస్టవుతారంటూ మీడియా ముఖంగానే చెప్పేశారు. అదలా ఉంచితే.. జగన్ అరెస్టు విషయంలో ఇప్పటికే గవర్నర్ కు సమాచారం అందించినట్లు చెబుతున్నారు. అయితే ఈ విషయంలో గవర్నర్ కంటే కేంద్రం ఆమోదం ఉంటే బెటరన్న ఉద్దేశంతో తెలుగుదేశం కూటమి ఉన్నట్లు చెబుతున్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నట్లుగా ఇంత వరకూ తెలుగుదేశం కూటమి దర్యాప్తు కు సంబంధించినంత వరకూ ఎలాంటి జోక్యం చేసుకోలేదు. అలాగే ఇప్పటి వరకూ అరెస్టులపై పెద్దగా స్పందించినదీ లేదు. అయితే సిట్ దర్యాప్తులో భాగంగా వెలుగులోకి వచ్చిన అంశాలు జగన్ అరెస్టు వరకూ దారి తీసిన నేపథ్యంలో..ఒక మాజీ ముఖ్యమంత్రిని అరెస్టు చేయాలంటే సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ అనుమతి తీసుకోవలఃసి ఉంటుంది. మామూలుగా జగన్ సీఎం కాకముందే ఆయనపై ఉన్న అక్రమాస్తుల కేసుల్లో అరెస్టుకు సెక్షన్ 17ఏ వర్తించదు కానీ, మద్యం కుంభకోణం కేసులో అరెస్టునకు సెక్షన్ 17ఏ వర్తిస్తుందని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే గవర్నర్ కు విషయం తెలియజేయడం జరిగిందనీ, అయితే గవర్నర్ నిర్ణయం తీసుకోవడంలో ముందు వెనుకలాడుతున్నారనీ, దీంతో విషయాన్ని కేంద్రం దృష్టికి తీసుకువెళ్లాలని ప్రభుత్వం భావిస్తోందంటున్నారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు మూడు రోజుల ఢిల్లీ పర్యటన కేవలం సాధారణ రాజకీయ పర్యటనగా భావించజాలమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. గురువారం (మే 22) చంద్రబాబు ఢిల్లీకి బయలుదేరి వెళతారు. ఆ మరునాడు అంటే శుక్రవారం (మే 23) కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ కానున్నారు. ఇది సాధారణ భేటీ కాదనీ, ఒక ఉన్నత స్థాయి మీటంగ్ అనీ విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ మీటింగ్ ప్రధాన ఉద్దేశం ఏపీలో జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై చర్చించడానికేనని కూడా అంటున్నారు. ఈ మద్యం కుంభకోణంలో ఇప్పటి వరకూ అరెస్టైన కీలక వ్యక్తుల విచారణలో ఈ స్కాంలో అంతిమ లబ్ధిదారు జగనే అని సిట్ నిర్దారణకు వచ్చిన నేపథ్యంలో జగన్ ను అరెస్టునకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ పొందేందుకే చంద్రబాబు హస్తిన పర్యటన పెట్టుకున్నారని అంటున్నారు.
మామూలుగా శనివారం (మే24) హస్తినలో జరిగే నీతి ఆయోగ్ పాలకమండలి సమావేశంలో పాల్గొనేందుకే చంద్రబాబు హస్తిన పర్యటన అని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నప్పటికీ ఆ సమావేశంలో పాల్గొనేందుకే అయితే చంద్రబాబు గురువారమే (మే22) హస్తినకు బయలు దేరాల్సిన అవసరం లేదు. అందుకే చంద్రబాబు హస్తిన పర్యటన అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. మరో వైపు చంద్రబాబు హస్తిన పర్యటనతో వైసీపీలో తీవ్ర ఆందోళన వ్యక్తం అవుతున్నది. ఈ నేపథ్యంలోనే జగన్ గురువారం (మే 22) మీడియా సమావేశంలో మాట్లాడనున్నారు. మొత్తం మీద చంద్రబాబు హస్తిన పర్యటనకు జగన్ అరెస్టునకు ముడిపెడుతూ రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
http://www.teluguone.com/news/content/cbn-delhi-tour-39-198440.html





